తెలంగాణ బీజేపీ నాయకులు ఢిల్లీ హై కమాండ్‌నే భయపెడుతున్నారా? వాళ్ళు పర్మిషన్ అడిగితే ప్రస్తుతానికి కామ్‌గా ఉండమంటూ దండం పెట్టేస్తున్నారా? ఏ విషయంలో ఢిల్లీ పెద్దలు అంతలా భయపడుతున్నారు? అసలు ఇక్కడి నాయకులు ఏ మేటర్‌లో ఢిల్లీ పెద్దల పర్మిషన్ అడిగారు? రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతోంది? తెలంగాణలో బీజేపీ విస్తరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో చేరికలతో నాయకుల సంఖ్య కూడా పెరుగుతోంది. అంతకు ముందు రాష్ట్ర పార్టీలో ఒకరిద్దరు, మహా అయితే ముగ్గురో నలుగురో ముఖ్య నాయకులు ఉండేవారు. కానీ… ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ప్రజా ప్రతినిధుల సంఖ్య కూడా పెరిగింది. ఇక పార్టీ ప్రమేయం లేకుండా… సొంత ఇమేజ్ ఉన్న నాయకులు అయితే…ఏదో ఒక సమస్య మీద ఎక్కడో ఒకచోట మాట్లాడుతూనే ఉన్నారు. ఆ వైఖరే ఇప్పుడు వోవరాల్‌గా రాష్ట్ర పార్టీకి ఇబ్బందిగా మారుతోందట. మొదట్నుంచి బీజేపీకి ఒక డిసిప్లిన్ ఉంది. ఎవరు ఏం మాట్లాడినా పార్టీ లైన్లోనే ఉండాలి. కానీ… ఈమధ్య కాలంలో ఆ లైన్ కట్టు తప్పుతోందన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. నచ్చినట్టు మాట్లాడే క్రమంలో ఒక్కో సారి పార్టీ లైన్‌కి వ్యతిరేక వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయని, అదే ఇప్పుడు హై కమాండ్‌ని భయపెడుతోందని అంటున్నారు. ఎస్సీ ,ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై నేతలెవరూ మాట్లాడొద్దన్నది హై కమాండ్ ఆదేశం.
తాము మద్దతిచ్చిన, తమ హయాంలో జరిగిన ఘనతను చెప్పుకోకుండా… అలా ఎందుకు నియంత్రించారంటే… నాయకులు ఎవరికి వారు ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడితే… లేనిపోని కొత్త తలనొప్పులు వస్తాయని, అసలే అది సున్నితమైన సామాజికవర్గాల అంశం కావడంతో ఢిల్లీ పెద్దలు ఆ జాగ్రత్త తీసుకున్నట్టు తెలిసింది. ఇక హైడ్రా విషయంలో గ్రేటర్ పరిధిలోని నేతలు, ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. అందరి భావం ఒక్కటే అయినా ప్రజెంటేషన్‌లో తేడా ఉండడంతో అది పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందట. అసలు పార్టీ ఆఫీస్‌లో ప్రెస్ మీట్ పెట్టిన నేతలు కూడా హైడ్రా పై ఎవరి వెర్షన్ వారు చెప్పారు తప్ప ఒక లైన్ తీసుకోలేదన్న నివేదిక హైకమాండ్‌కు వెళ్ళినట్టు తెలిసింది. ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ విషయంలో బీజేపీ ఇంకా అధికారికంగా మాట్లాడలేదు. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన ప్రెస్ మీట్‌లు రద్దయ్యాయి. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఆ అంశానికి సంబంధించి ముందులాగే నాయకులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని భయపడ్డారట ఢిల్లీ పెద్దలు. ఇంకో నేత వేరే అంశం పై మాట్లాడతానని చెప్పినా… ఇప్పటికైతే ఏం వద్దు బాబూ… అని దండం పెట్టేశారన్నది పార్టీ వర్గాల సమాచారం. పార్టీ ఆఫీస్‌లో మీడియా సమావేశం పెట్టి ఏది మాట్లాడినా అది అధికారికమే అవుతుందని, అందుకనే…ఏది పడితే అది మాట్లాడవద్దని నియంత్రణ విధించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎవరు ఏ ప్రెస్‌మీట్ పెడతామన్నా… పర్మిషన్ ఇవ్వడానికి జంకుతున్నారట ఢిల్లీ పెద్దలు. ఏదైనా సమస్య వస్తే… దాని పైన పార్టీ లైన్ ఏందో పార్టీ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని.. దాని ప్రకారమే మాట్లాడాలి తప్ప ఇష్టానుసారం ఉంటే… పార్టీ ప్రయోజనాలు దెబ్బతించాయన్నది హై కమాండ్ భయంగా తెలిసింది. ఇలా… మొత్తం మీద తెలంగాణ బీజేపీ నేతలు పార్టీ హైకమాండ్‌నే భయపెట్టారన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో.
