NTV Telugu Site icon

Off The Record : Telangana BJP తేడాగా ఉందా..? బిల్డప్లన్నీపార్టీ మీటింగ్లోనేనా..?

Tbjp Otr

Tbjp Otr

తెలంగాణ బీజేపీ తేడాగా ఉందా? వ్యవహారం మొత్తం పైన పటారం లోన లొటారంలాగా మారుతోందా? పార్టీ నేతలు కలిసి పనిచేయడం అన్న మాట మర్చిపోయారా? సమన్వయం అన్న పదానికి పార్టీలో అర్ధం లేకుండా పోయిందా? అసలు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏంటి? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న టార్గెట్‌ ఏమైంది? అన్నీ… పక్కన బెడదాం…, అందరం కలిసి ముందుకు సాగుదాం…. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద జెండా పాతేద్దాం…. ఇవీ కమలం పార్టీ పెద్దలు రాష్ట్ర నాయకులకు పదే పదే చెబుతున్న మాటలు. వాళ్ళు అలా చెప్పినంత సేపు వీళ్ళు కూడా… ఓ… అలాగే చేసేద్దాం, పొడిచేద్దాం, ఈసారి ఇరగదీసేద్దాం అంటూ ఓ రేంజ్‌లో వాయిస్‌ రెయిజ్‌ చేస్తున్నారట. కానీ… ఆ బిల్డప్‌లన్నీ ఆ మీటింగ్‌ల వరకే తప్ప తర్వాత ఉండటం లేదన్నది పార్టీ కేడర్‌ వాయిస్‌. అసలు అలా జెండా పాతేయడానికి కావాల్సిన ప్రాధమిక అర్హత విషయంలోనే నాయకులు ఫెయిల్‌ అవుతున్నట్టు గుసగుసలాడుకుంటున్నాయి తెలంగాణ బీజేపీ శ్రేణులు. అదేంటయ్యా… అంటే సమన్వయం. ముందు అందరి మధ్య సమన్వయం ఉంటేనే కదా… కలిసి పోరాడి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడేది అంటున్నారు పార్టీ కార్యకర్తలు. ఇతరుల సంగతి తర్వాత….. ముందసలు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, ఎమ్మెల్యేలకు మధ్యనే సమన్వయం లేదన్నది ఇన్నర్‌ వాయిస్‌. బీజేపీ శాసన సభ పక్షానికి పార్టీకి మధ్య గ్యాప్‌ ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీకి కనీస సమాచారం లేకుండానే ఎల్పీ నేతలు కొన్ని అంశాలపై స్పందిస్తున్నారని, ఒక్కోసారి పార్టీ లైన్‌కు విరుద్ధంగా కామెంట్స్ ఉంటున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోందట. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు కావాల్సినంత మెటీరియల్ పార్టీ వైపు నుండి అందువ్వలేదన్న విమర్శలు సైతం వచ్చాయి. బీజేపీ శాసనసభ్యులకు సొంతగా ప్రిపేర్ అయ్యే వ్యవస్థ లేదని, పార్టీ సిస్టం వారికి చేదోడు వాదోడుగా ఉంటే… సభలో వాళ్ళ పనితీరు బాగుంటుందని, కానీ… ఆ దిశగా సరైన సహకారం లేదన్నది ఎల్పీ వైపు నుంచి ఉన్న కంప్లయింట్‌గా తెలుస్తోంది.

 

ఇక ముఖ్యమైన అంశాల్లో కొందరు బీజేపీ నాయకులు ప్రభుత్వం టార్గెట్ గా కాకుండా అందులోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారట. దాంతో పార్టీ ప్రయోజనాలను పర్సనల్‌ అజెండాకు ముడిపెడుతున్నారా అన్న డౌట్స్‌ పెరుగుతున్నాయట. మరోవైపు బీజేపీ పదాదికారుల సమావేశానికి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే హాజరవడం పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదట. అలాగే బీజేఎల్పీ సుంకిశాల పర్యటనకు వెళ్లినా… అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు ఏమయ్యారంటే ఎవ్వరి దగ్గరా సమాధానం లేదట. మూడు రోజుల ముందే టూర్‌ ప్రోగ్రామ్‌ నిర్ణయం అయినా… ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడంవల్లే అందరూ వెళ్ళలేనట్టు తెలుస్తోంది. పార్టీ ఆదేశంతోనే బీజేఎల్పీ సుంకిశాలకు వెళ్లిందని అనుకుంటున్నా… అసలు పార్టీ చెప్పిందా లేదా అన్నది క్లారిటీ లేదట. అంత ముఖ్యమైన కార్యక్రమంలోనే ఇంత సమాచారం లోపం ఎలాగన్నది పార్టీ శ్రేణులకు అంతుబట్టడం లేదంటున్నారు. ఏతావాతా పార్టీకి, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేదు. అలాగే ఎమ్మెల్యేల మధ్యనే ఒకరికి ఒకరికి కో ఆర్డినేషన్‌ లేదు. ఇంకో నాలుగున్నరేళ్ళలో అధికారంలోకి రావాలనుకునే పార్టీ రాష్ట్రంలో ఉండాల్సింది ఇలాగేనా అని కేడర్‌ ప్రశ్నించుకుంటున్న పరిస్థితి. పరిస్థితులు చక్కబడకుండా ఈ సమన్వయ లోపం ఇలాగే ఉంటే…. టార్గెట్‌ నెరవేరుతుందా అన్నది కేడర్‌ క్వశ్చన్‌. బీజేపీ అధినాయకత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.