NTV Telugu Site icon

Off The Record : టీడీపీ మహానాడును ఈసారి Kadapa లోనే ఎందుకు నిర్వహిస్తున్నారు?

Tdp Otr

Tdp Otr

తెలుగుదేశం మహానాడును ఈసారి కడప జిల్లాలోనే ఎందుకు నిర్వహించబోతున్నారు? గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా తొలిసారి కడప వైపు ఎందుకు చూసింది టీడీపీ పొలిట్‌బ్యూరో? జగన్‌ అడ్డాలో సత్తా చూపాలనుకోవడమేనా? లేక అంతకు మించిన వేరే కారణాలు ఉన్నాయా? అసలు టీడీపీ టార్గెట్‌ ఏంటి? మహానాడు వ్యూహం ఏంటి? కడప జిల్లా రాజకీయాల ప్రస్తావనలో ఎవరికైనా… ఠక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. నాటి కాంగ్రెస్ పార్టీ నుంచి నేటి వైసీపీ వరకు… ఇక్కడంతా ఆ కుటుంబానిదే హవా. అందుకు తగ్గట్టే… గడిచిన పాతికేళ్ళలో ఉమ్మడి కడప జిల్లాలో టిడిపికి నామ మాత్రపు సీట్లే దక్కాయి. మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను… 2004లో ఒక్క చోట మాత్రమే గెలిచింది తెలుగుదేశం. 2009లో కూడా అదే పరిస్థితి. 2014లో కూడా రాజంపేటలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. ఇక 2019కి వచ్చేసరికి మొత్తం పదికి పది సీట్లు దక్కించుకుని క్లీన్‌ స్వీప్‌ చేసింది వైసీపీ. కానీ… ఈసారి మాత్రం సీన్‌ మారిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా పుంజుకుంది టీడీపీ. ఉమ్మడి కడప జిల్లాలోని పది స్థానాలకు గాను ఏడు చోట్ల కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులో… టిడిపి ఐదు, బిజెపి ఒకటి, జనసేన ఒకటి చొప్పున దక్కించుకున్నాయి. మొట్టమొదటిసారిగా జిల్లాలో బిజెపి, జనసేన బోణీ కొట్టాయి. రాష్ట్రంలో అధికారం రావడం ఒక ఎత్తయితే… కడపలో కుమ్మేయడం మరో ఎత్తు అనుకుంటున్నారట తెలుగుదేశం ముఖ్యులు. జగన్ అడ్డాలో ఏకంగా ఏడు ఎమ్మెల్యే సీట్లు కొట్టి సత్తా చాటామని, ఇక ఈ పట్టు తగ్గకుండా చూసుకోవాలని డిసైడైనట్టు తెలిసింది.

అలా పట్టు నిలుపుకునే క్రమంలోనే ఈసారి టీడీపీ మహానాడును కడపలో పెట్టాలని డిసైడయ్యారట. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా కడపలో మహానాడు నిర్వహించలేదు. దాంతో ఇప్పుడు మొదటిసారిగా కడప జిల్లాలో పెట్టడమే కాకుండా…వైసీపీ అడ్డాలో తమ బలాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నారట టీడీపీ పెద్దలు. కడపలో మహానాడు నిర్వహించాలని పార్టీ పొలిట్‌ బ్యూరో నిర్ణయించడం వెనక రీజన్‌ ఇదేనని చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. కడప లాంటి ఉమ్మడి జిల్లాలో కూటమి ఏడు సీట్లు గెలవడంతో…స్థానిక ఎమ్మెల్యేలకు కూడా అదే స్థాయి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్‌రెడ్డికి మంత్రి పదవి దక్కింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్ పదవులు వరించాయి. కేవలం నాయకులతో సరిపెట్టకుండా… రాయలసీమలోని పార్టీ కార్యకర్తలకు కూడా భరోసా కల్పించాలన్న ప్లాన్‌లో ఉందట టిడిపి అదిష్టానం. అందుకే కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా కనివిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించాలనుకుంటున్నట్టు సమాచారం. నిర్వహణ కోసం కడప నగరంలోని నాలుగు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా నేతలు అధిష్టానానికి నివేదికలు పంపారట. ఇప్పటికే వైసిపి అడ్డాలో పాగా వేసిన టిడిపి… మహానాడు నిర్వహణతో తన సత్తా చాటాలని అనుకుంటోందట. అటు వైసిపికి బిగ్ షాక్ ఇవ్వడంతోపాటు కార్యకర్తలకు భరోసా కల్పించాలన్నదే టిడిపి ధ్యేయంగా చెప్పుకుంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా…మహానాడు జరగాలన్నది టీడీపీ పెద్దల టార్గెట్‌గా తెలుస్తోంది. ఎంతవరకు ఆ లక్ష్యం నెరవేరుతుందో చూడాలంటున్నారు విశ్లేషకులు.