NTV Telugu Site icon

Off The Record : గుంటూరు వెస్ట్ టీడీపీలో గందరగోళం

Tdp Otr

Tdp Otr

సైకిల్‌ సర్‌ సర్‌మని దూసుకువెళ్లే అసెంబ్లీ నియోజకవర్గం అది. టీడీపీ తరపున జస్ట్‌… నామినేషన్‌ వేస్తే చాలు గెలుపు ఖాయమని అనుకునే సీటు అది. అలాంటి చోట ఇప్పుడెందుకో కేడర్‌కి డౌట్‌ కొడుతోందట. పార్టీ ప్రకటించిన అభ్యర్థి వెంట నియోజకవర్గ ముఖ్య నాయకులు కనిపించడం లేదు. ఎందుకా అని ఆరా తీస్తే… స్టోరీ చాలానే ఉందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏంటా స్టోరీ? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం…..ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే సీటు ఇది. 2019 జగన్ ప్రభంజనంలో కూడా ఇక్కడ పార్టీ జెండా ఎగిరింది. అలాంటి చోట ఇప్పుడు ద్వితీయశ్రేణి నాయకత్వం ఎందుకో డీలాగా ఉందన్నది ఓ పొలిటికల్‌ పరిశీలన. నిన్న మొన్నటి దాకా ఈ టిక్కెట్‌ మాకంటే మాక్కావాలంటూ…10 నుండి 15 మంది టీడీపీ ఆశావహులు పోటీలు పడ్డారు. టిక్కెట్‌ ప్రయత్నాల్లో తెగ తిరిగేశారు కూడా. చివరికి…. ఎవ్వరూ ఊహించని విధంగా బీసీ మహిళ పిడుగురాళ్ళ మాధవికి ఇచ్చింది పార్టీ అధిష్టానం. దీంతో పత్తా లేకుండా పోయారట మిగతా నాయకులు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర మినహా మిగిలిన వారెవరు ప్రస్తుతం ప్రచారంలో అభ్యర్థి వెంట తిరగడం లేదట.. ఇన్నాళ్లు సీటు మాకేననుకుని తెగ తిరిగాం… డబ్బులు ఖర్చు పెట్టుకొని కార్యక్రమాలు చేశాం, తీరా చూస్తే… నియోజకవర్గ సరిహద్దులు కూడా తెలియని వారికి టిక్కెట్‌ ఇచ్చారంటూ సీనియర్స్‌ కోపంగా ఉన్నారన్నది పార్టీ వర్గాల టాక్‌. సామాజిక వర్గం, మహిళా కోటా పేరుతో ఎవర్నో తీసుకొచ్చి మా నెత్తిన పెడితే… ఇప్పుడు మేం వాళ్ళకు జిందాబాద్‌లు కొట్టాలా అన్న వైఖరి కనిపిస్తోందట ఎక్కువ మంది గుంటూరు వెస్ట్‌ టీడీపీ నేతల్లో.

నాయకులే ఇలా ఉంటే… ఇక కేడర్‌ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నది లోకల్‌ టాక్‌. నాయకులు ఎవరికి వారు సైలెంట్‌గా ఉండటంతో…ఇన్నాళ్లు వాళ్ళ చుట్టూ తిరిగిన అనుచరులు కూడా ముఖం చాటేస్తున్నట్టు తెలిసింది.దీంతో కొత్తగా వచ్చిన పార్టీ అభ్యర్థి మాధవి ఏదో… ఉన్నవాళ్ళతోనే బండి లాగించేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి స్థానిక పార్టీ వర్గాలు. ఇక్కడ మరో విషయం గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు సీటు ఎవరికి ఇచ్చినా గెలిపించి తీరతాం… అంటూ గప్పాలు కొట్టిన గుంటూరు నాయకులు.. తీరా పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుని అభ్యర్థిని బరిలో దించాక ఎందుకు ముఖం చాటేస్తున్నారన్న ప్రశ్న వస్తోంది. అవన్నీ పైపై మాటలేనా? సీటు ఇస్తే ఒకలా, ఇవ్వకపోతే మరోలా ఉంటారా? అయినా.. పోటీ పడ్డవాళ్ళందరికీ టిక్కెట్‌ ఇవ్వలేరు కదా..ఆ లాజిక్‌ని ఈ నాయకులు ఎందుకు మిస్‌ అవుతున్నారన్న ప్రశ్నలు సైతం పెరుగుతున్నాయి. సీటు ఆశించి భంగపడ్డ నాయకులే ప్రచారానికి వెళ్ళకుండా కేడర్‌ని నియంత్రిస్తున్నారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలపడుతోంది. టీడీపీకి గట్టి పట్టున్న గుంటూరు వెస్ట్‌లో వైసీపీ తరపున పోటీ పడుతున్నారు మంత్రి విడదల రజని. అంగ బలం, ఆర్థిక బలం ఉన్న ప్రత్యర్థిని ఢీ కొట్టాల్సి ఉన్న టైంలో నియోజకవర్గ నేతలు ఇలా మాకెందుకు అన్నట్టుగా ఉండటం కరెక్టేనా అన్నదిలోకల్‌గా వినిపిస్తున్న క్వశ్చన్‌. ఇంత కీలకమైన టైంలో కూడా నాయకులు ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు తప్ప పార్టీ అభ్యర్థి విజయం కోసం కలిసికట్టుగా వ్యూహాలు రూపొందించడం లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థిని, అలాగే నియోజకవర్గాన్ని కాపాడుకోవాలంటే అధిష్టానం సీరియస్‌గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న చర్చ పార్టీ కేడర్‌లో జరుగుతోంది.