Site icon NTV Telugu

Off The Record : ఉమ్మడి విజయనగరంలో అసమ్మతి బుసలు కొడుతుందా?

Otr Tdp

Otr Tdp

అక్కడ టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారిందా? పార్టీ అధిష్టానం ఇస్తున్న హామీలు రెబెల్స్‌ చెవికెక్కడం లేదా? అందరికీ ఒకే రకమైన హామీలివ్వడం బెడిసికొట్టిందా? తగ్గేదేలే అంటున్న అసంతృప్తులు దారికొచ్చే అవకాశం ఎంత? రివర్స్‌ అయ్యే ఛాన్స్‌ ఎంత? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఏంటా కథ? తెలుగుదేశం పార్టీకి ఒకప్పటి కంచుకోట ఉమ్మడి విజయనగరం జిల్లా. కానీ ఇప్పుడు ఆ కోట బద్దలైంది. సీన్‌ రివర్స్‌లో ఉంది. అసమ్మతి ఆరున్నొక్కరాగం పాడుతోంది. అభ్యర్థుల ఎంపికతో మొదలైన అసమ్మతి ఇప్పుడు బుసలు కొడుతోందని పార్టీ వర్గాలే అంటున్న పరిస్థితి. ఇదంతా టీ కప్పులో తుఫానేనంటూ బుజ్జగింపు ప్రయత్నాలు మొదలుపెట్టింది అధిష్టానం. ఇందుకోసం ఓ తారకమంత్రాన్ని కూడా సిద్ధం చేసుకుంది. ఈసారి పవర్‌లోకి వచ్చేది మనమే… అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఏదో ఒక కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి, లేదా… తొలి జాబితాలోనే ఎమ్మెల్సీ ఇస్తామని రెబెల్స్‌ అందరికీ సందేశాలు వెళ్ళాయట. కానీ… అక్కడే అసలు ట్విస్ట్‌ మొదలైంది. ప్రతి రెబెల్‌ అభ్యర్థి ఒకటే తరహా హామీలు ఇచ్చారని, వాళ్లంతా పరస్పరం మాట్లాడుకునేసరికి విషయం బయటపడిందని అంటున్నారు. అందరికీ ఒకటే తరహా హామీలు ఇస్తే అమలు ఎలాగని డౌట్‌ వచ్చిన అసమ్మతి నేతలు… ఇదేదో తేడాగా ఉందే… అనుకుంటూ ఇప్పుడు ఇండిపెండెంట్స్‌గా పోటీకి రెడీ అయిపోతున్నట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా గజపతినగరం, విజయనగరం సెగ్మెంట్లలోని అసమ్మతి నేతలు పోటీకి రెడీ అయిపోతున్నట్టు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు గజపతి నగరం టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్నారు.

గడచిన అయిదేళ్లగా పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చారాయన. అయితే అనూహ్యంగా కొండపల్లి శ్రీనివాస్ రావును అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం. దీంతో రెబెల్‌ అయ్యారు కేఏ నాయుడు. పట్టువదలని విక్రమార్కుడిలా ఇప్పటికీ టిక్కెట్‌ ప్రయత్నాల్లో ఉన్నారాయన. ఆవేశపడొద్దని కేడర్‌కు సర్దిచెప్పుకుంటూ ఆఖరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ… వాళ్లని మాత్రం తన చెయ్యి దాటిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నాయుడు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ పదవుల హామీ మీద నమ్మకం లేదంటున్నారాయన. ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడ్డ తమ నాయకుడికి కాకుండా… వైసిపి నుంచి వచ్చిన కొండపల్లి కొండలరావు కుమారుడు శ్రీనివాస్‌కి టిక్కెట్‌ ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారట కేఏ నాయుడు అనుచరులు. పార్టీలో తనకున్న పాత పరిచయాలతో చివరి క్షణం వరకు టికెట్ కోసం ప్రయత్నించి, అప్పటికీ అవకాశం దక్కకుంటే… స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దూకేందుకు సమాయత్తమవుతున్నారన్నది కేడర్‌ వాయిస్‌. ఇక విజయనగరం నియోజకవర్గంలో కూడా అసమ్మతి సెగలు పార్టీకి గట్టిగానే తగులుతున్నాయట. ఇక్కడ అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతిని అభ్యర్ధిగా ప్రకటించింది అధిష్టానం. ఆమె అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత. బంగ్లా రాజకీయాలకు స్వస్తి చెప్పాలని భీష్మించుకొని కూర్చున్న గీత ఏకంగా పార్టీ కార్యాలయాన్నే వేరుగా ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాలు చేస్తూ టిక్కెట్టు తనకొస్తుందని తొలి నుంచి ధీమాగా ఉన్న గీత కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆదిశగా అడుగులు పడుతున్నట్టు చెబుతున్నారు గీత సన్నిహితులు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకొని ఉన్న ముఖ్యనాయకులు అధిష్టానం తీరును ఎండగడుతున్నారట. దీంతో బుజ్జగింపు ప్రయత్నాలు ఫలిస్తాయా? లేక ఇండిపెండెంట్స్‌ రూపంలో టీడీపీకి ముప్పు ముంచుకొస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version