NTV Telugu Site icon

Off The Record : తెలంగాణ బీజేపీకి కొత్త అస్త్రం.? అందుకే రేవంత్ రెడ్డిని టార్గెట్.?

Tbjp Otr

Tbjp Otr

తెలంగాణ బీజేపీకి కొత్త అస్త్రం దొరికిందా? దాంతోనే కాంగ్రెస్‌ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్లాన్‌లో ఉందా? అందుకే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే టార్గెట్‌ చేసిందా? కాషాయ నేతల వరుస స్టేట్‌మెంట్స్‌ ఈ విషయమే చెబుతున్నాయా? ఇంతకీ బీజేపీకి దొరికిన ఆ అస్త్రం ఏంటి? ఏ పేరుతో నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేస్తున్నారు? ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయి.. ఐదున్నర నెలలపాటు జైల్లో ఉండి.. ఇటీవలే బయటికి వచ్చారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. అదంతా గతం. అయితే ప్రస్తుతం ఆమె బెయిల్‌పై రాజకీయ రచ్చ మొదలైంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని చాలా రోజులుగా అంటోంది కాంగ్రెస్‌. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని కూడా సీఎం రేవంత్ రెడ్డితో సహా చాలామంది కాంగ్రెస్‌ నేతలు అంటున్న పరిస్థితి. అదే సమయంలో అటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనంటూ రివర్స్‌ కౌంటర్‌ వేస్తోంది బీజేపీ. కవిత కేసును కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ వాదించారని, ఆయన మీద బీఆర్‌ఎస్‌ పోటీ పెట్టలేదని, ఇదంతా ఒప్పందంలో భాగమేనన్నది బీజేపీ వెర్షన్‌. ఇలా పరస్పరం ఎత్తిపోతల కార్యక్రమం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో నాయకులు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ… అందరికంటే ఎక్కువగా బెయిల్‌ రావడాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి అన్నట్టుగా చెబుతున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు ఆ మాటలనే బేస్‌ చేసుకుని పొలిటికల్‌ అడ్వాంటేజ్‌ తీసుకోవాలని అనుకుంటోందట బీజేపీ. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి. బాధ్యతగా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి… అలా అనడమేంటని లాజిక్‌ లాగుతున్నారట కమలనాథులు. కోర్ట్‌ ఇచ్చిన కవిత బెయిల్‌కు, బీజేపీకి ఏం సంబంధం? అలా ముడిపెట్టి మాట్లాడటం ఏంటని తెలంగాణ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.

కవితకు బీజేపీ బెయిల్ ఇప్పించిందంటూ… కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, ఒక పార్టీగాని, వ్యక్తిగాని చెబితే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్‌. తాను కూడా కోర్ట్‌ను తప్పు పట్టేలా కామెంట్ చేయలేదని, కవిత బెయిల్ కోసం ఎవరు వాదించారో చెబుతూ, కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ బంధం గురించి మాత్రమే మాట్లాడానని వివరణ ఇచ్చారాయన. ఇటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం తన వ్యాఖ్యలను వక్రీకరించి వేరే ఉద్దేశ్యాలను ఆపాదించారంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ పాయింట్‌నే ఇప్పుడు రాజకీయంగా వాడేసుకోవాలని అనుకుంటోందట బీజేపీ. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏదో ఒక మాట అనేసి చివరికి వివరణలు ఇచ్చుకోవడం, సారీలు చెప్పుకునే పరిస్థితి తెచ్చుకోవడం ఏంటంటూ…. కొత్త తరహా రాజకీయం మొదలుపెడుతోందంటున్నారు. తెలంగాణ ప్రజలకి పాలించుకోవడం చేతకాదని అన్నట్టుగా…. నవ్వుల పాలయ్యేలా రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ కామెంట్‌ చేశారు ఈటల రాజేందర్. కమలం పార్టీ సీనియర్స్‌ కూడా ఒక్కొక్కరే ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేస్తూ… కవిత బెయిల్ విషయంలో ఆయన్ని డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటేనన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మారని, ఆ దెబ్బ తమకు గట్టిగానే పడిందని భావిస్తున్న కాషాయ నేతలు… ఇప్పుడు సీఎం చేశారని చెబుతున్న వ్యాఖ్యల ఆధారంగా కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టే ప్లాన్‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చిన పరిస్థితులు మరోసారి రావొద్దనుకుంటూ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారట తెలంగాణ బీజేపీ లీడర్స్‌. సీఎం చేసిన వ్యాఖ్యలని చెబుతూ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి మరి.