తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ ఎవరు? రాష్ట్ర పార్టీని పర్యవేక్షించాల్సింది ఎవరు? పర్యవేక్షిస్తోంది ఎవరు? ఢిల్లీ నాయకత్వం క్లారిటీగా చెప్పేసినా అసలా డౌట్ ఎందుకు వస్తోంది? ఇన్ఛార్జ్ పదవి కేంద్రంగా రాష్ట్ర పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? పార్టీ నాయకులు ఏమంటున్నారు? జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ ఎవరన్న డౌట్ ఎందుకు వస్తోంది? పార్టీ జాతీయ వెబ్ సైట్‌లో చూస్తే…అభయ్ పాటిల్ అని ఉంది. ఢిల్లీలో జరిగిన మెంబర్షిప్ డ్రైవ్ వర్క్ షాప్‌కు రాష్ట్ర ఇన్ఛార్జ్ హోదాలో హాజరయ్యారాయన. తెలంగాణలో జరిగిన మీటింగ్‌కు కూడా హాజరయ్యారు…. ఇంకేంటి డౌట్ అంటారా? అలాంటి అనుమానాలు రావడానికి పార్టీ రాష్ట్ర నేతల వైఖరే కారణమట. తెలంగాణ బీజేపీ నేతలు ఆయన్ని ఇంకా ఇన్ఛార్జ్‌గా గుర్తించడం లేదట. అధిష్టానం ఆయన్ని ఇన్ఛార్జ్‌గా నియమించింది, బాధ్యతలు అప్పగించిందని అంగీకరించడానికి కొందరు రాష్ట్ర నాయకులు మానసికంగా సిద్ధం లేరన్నది ఇంటర్నల్ టాక్. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నా… అభయ్ పాటిల్ మాత్రం డోంట్ కేర్ అంటున్నట్టు తెలిసింది. ఎవరు గుర్తిస్తే ఎంత, గుర్తించకుంటే ఎంత? ఢిల్లీ పెద్దలు బాధ్యత ఇచ్చారు, నేను పనిచేసుకుంటూ పోతానని అంటున్నట్టు తెలిసింది. నన్ను పార్టీ పంపింది. వాళ్ళు ఏం ఆశిస్తే అది ఇక్కడ చేసి తీరతానని తనకు సన్నిహితంగా ఉండే కొందరితో అంటున్నట్టు తెలుస్తోంది. తానంటే కొందరికి ఇష్టం అని, మరికొందరికి భయం అని…. ఎవరి ఇష్టాయిష్టాలతో నాకు సంబంధం లేదు. వాళ్ళు భయపడితే నేనేం చేయలేనని కూడా అంటున్నారట అభయ్. అలాగే సభ్యత్వ నమోదుపై మండల స్థాయి వరకు వెళతానని చెబుతున్నారట ఆయన. నన్ను ఇన్ఛార్జ్‌గా ఎవరు గుర్తించినా గుర్తించకున్నా… పని విషయంలో మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పుకుంటున్నారు.
అదే ఊపులో మెంబర్షిప్ డ్రైవ్ పై మీటింగ్‌కు డుమ్మా కొట్టిన వాళ్ళ వివరాలు అడిగారని, వాళ్ళు ఎందుకు రాలేకపోయారో వివరాలు కూడా తీసుకోమని రాష్ట్ర పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించారట అభయ్ పాటిల్. ఊరికే ఆదేశాలతో సరిపెట్టకుండా…రిపోర్ట్ పంపించే వరకు వెంటపడి ఫాలోఅప్ చేశారట. సెప్టెంబర్ రెండున మళ్ళీ రాష్ట్రానికి వస్తానని, ఎవరేమనుకున్నా… నా ట్రాక్ నాదే… నా రూటే సపరేటు అంటున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఇన్ఛార్జ్‌గా వచ్చిన అభయ్ పాటిల్ అప్పట్లో పని విషయంలో చాలా కఠినంగా ఉన్నారన్నది తెలంగాణ బీజేపీ వర్గాల మాట. అప్పగించిన పని చేయని వారిని, మీటింగ్ లకి హాజరు కానీ వారిని మందలించడంతోపాటు… వారు ఏ స్థాయి బాధ్యతల్లో ఉన్నా సరే ఉపేక్షించలేదట. ప్రతి విషయాన్ని పట్టించుకుని పట్టి పట్టి చూసి ఫాలోఅప్ చేశారని చెప్పుకుంటున్నారు కార్యకర్తలు. అందుకే…ఎన్నికల తర్వాత కొంత గ్యాప్ వచ్చినా… అభయ్ పాటిల్ మళ్ళీ రాష్ట్రానికి రావడం కొందరు సీనియర్ లీడర్స్‌కు సైతం రుచించడం లేదట. అందుకే ఆయన్ని ఇన్ఛార్జ్‌గా గుర్తించనట్టు నటిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో ఎవ్వరి గుర్తింపులతో నాకు పనిలేదు, నేను మోనార్క్‌ని చేయాల్సింది చేసుకుని పోతానన్నట్టుగా అభయ్ వ్యవహారం ఉండటంతో… ముందు ముందు తెలంగాణ బీజేపీలో ఏం జరగబోతోందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.
