NTV Telugu Site icon

Off The Record : బియ్యం మాఫియాతో కొత్త ముఠాల రాయబేరాలు?

Pds Rice

Pds Rice

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలని అంటారు. ఓ పక్క రాష్ట్రంలో జడలు విప్పిన రేషన్‌ మాఫియాను కట్టడి చేయడానికి ఏపీ సర్కార్‌ ప్రయత్నిస్తుంటే… తెలివి మీరిన ముఠాలు కొత్త దారులు వెదుకుతున్నాయట. మాలెక్క తేలిస్తే… మీ లెక్కలు సెటిల్‌ చేస్తామంటూ… సరికొత్త బేరగాళ్ళు మార్కెట్‌లో తిరుగుతున్నారట. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఏకంగా మాఫియాకే ఆఫర్స్‌ ఇస్తున్న ఆ ముఠాలేంటి?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా వేళ్ళూనుకుని పోయింది. ఇది ఎవరో దారిన పోయే దానయ్య చెప్పిన మాట కాదు. సాక్షాత్తు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నోటి నుంచి వచ్చిన కఠోర వాస్తవం. పల్నాడు జిల్లాలో మంత్రి ఆకస్మిక దాడులు చేస్తే… టన్నుల కొద్దీ రేషన్ బియ్యం రైస్‌ మిల్లుల్లో పట్టుబడింది. పేదోళ్ళకి సబ్సిడీకి అందాల్సిన బియ్యం… రేషన్ మిల్లుల్లో ఆ స్థాయిలో కనబడటంతో… ఒకరకంగా మంత్రే షాకయ్యారట. రేషన్‌ మాఫియా ఉందని,… బియ్యం దారిమళ్లుతోందన్న సమాచారంతో ఏదో… కాస్తో కూస్తో… ఉండవచ్చనుకున్న మంత్రికి సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఓ మిల్లుల్లో ఉన్న నిల్వలు చూసి మతిపోయినంత పనైందట. ఆ బస్తాలను అప్పటికప్పుడు సీజ్‌ చేయించిన మంత్రి మనోహర్‌… అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఇక్కడ అసలు పాయింట్‌. నేరుగా మంత్రి రెయిడ్‌ చేసి సీజ్‌ చేశాక అధికారులు ఏం చేశారు? అసలా మాఫియా వెనక ఎవరున్నారన్న విషయమై పెద్ద చర్చే జరుగుతోంది జిల్లాలో. నేరుగా మంత్రి వచ్చేదాకా ఈ విషయం అధికారులకు తెలియదా అంటే… తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అసలా రోజు మంత్రి సీజ్‌ చేయించినంత మొత్తం ఇప్పటికీ ఉందా? లేక ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా సగం బస్తాలను చేరవేసి ఉంటారా అంటే… వాళ్ళు ఏదైనా చేయగల సమర్ధులు అన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా తెలుస్తోంది. అంటే సీజ్‌ అయిన బియ్యంలో కొంత వెళ్ళిపోయి ఉంటాయన్నది ఎక్కుడ మంది డౌట్‌ అట. అదే సమయంలో కొత్త రకం బేరాలు మొదలైనట్టు తెలుస్తోంది. మంత్రిగారు ఇలా ప్రతి నియోజకవర్గంలో దాడులు చేసుకుంటూ పోతే ఎలా..? ఇక మనమేం వ్యాపారం చేయగలుగుతాం. ముందు మా లెక్కేంటో చెప్పండి… తర్వాత మంత్రి సంగతి మేం చుసుకుంటాం అంటూ… బేరమాడే బ్యాచ్‌ కూడా తయారైపోయిందట ఉమ్మడి గుంటూరు జిల్లాలో.

మంత్రితో సంబంధం లేకుండానే… ముందు మా లెక్క చెప్పండి, ఆయన సంగతి మేం చూసుకుంటాం అంటూ సదరు ముఠా రాయబారాలు పంపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎవరు ఎక్కడ తనిఖీ చేసినా…, బియ్యాన్ని సీజ్ చేసినా… చర్యలు తీసుకోవాల్సింది స్థానికంగా ఉన్న అధికారులు, ప్రజా ప్రతినిధులే. అందుకే ముందు మా లెక్క సెట్‌ చేస్తే… మిగతా లెక్కలు మేం చూసుకుంటామంటూ వ్యవహారాలు నడుపుతున్నారట కొందరు. కావాలంటే చెక్ చేసుకోండి, గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రి సీజ్ చేసిన బియ్యం, ఇప్పుడు ఎక్కడ ఉందో, ఎవరు తీసుకువెళ్ళారో అంటున్నట్టు తెలిసింది. సీజ్ చేసిన బియ్యాన్ని ఎలా దారికి తెచ్చుకోవాలో, తెప్పించాలో మాకు తెలుసు, ఆ లెక్కలు మేం చూసుకుంటామంటూ రేషన్ మాఫియాకు అభయం ఇచ్చే నాయకులు కూడా తయారైపోయినట్టు ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్ల నుంచి గుంటూరు జిల్లాలో క్షేత్రస్థాయికి వెళ్లిపోయింది రేషన్‌ మాఫియా. కొన్ని విపరీత పోకడలు కూడా జరిగాయట. అలాంటి మాఫియా ఇప్పుడు మంత్రి తనిఖీలు చేసినంత మాత్రాన చేతులు కట్టుకుని కూర్చుంటుందా? వాళ్ళ మార్గాలు వాళ్ళకు ఉండవా అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి జిల్లాలో. చెప్పుకోవాలంటే…అది నెత్తురు రుచి మరిగిన పులిలాంటిదని, దాన్ని కట్టడి చేయాలంటే… కింది నుంచి గట్టి చర్యలు ఉండాలే తప్ప… తూతూ మంత్రపు పనులు చాలవన్నది విస్తృతాభిప్రాయం. మంత్రి రూపంలో కాస్త వత్తిడి తగిలేసరికి జిల్లాలోని రేషన్‌ మాఫియా తాజాగా నియోజకవర్గాల్లోని నాయకులను సామాజిక వర్గాల వారిగా టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం. మాకు సాయం చేయండి, మీకు కావాల్సిందేంటో మేం చూసుకుంటాం…. ఆ మాత్రం సాయం చేయకుంటే మీరు ఆ పార్టీలో ఉండటం ఎందుకంటూ కూటమి నేతలకు ఎక్కడో తగిలేటట్టు మాట్లాడుతున్నారట ముఠా నాయకులు.

ఇప్పటికే నియోజకవర్గానికి ఐదు నుంచి పది లక్షల రూపాయలు టార్గెట్‌ పెట్టుకొని నెల నెలా పంపాల్సిన వాళ్ళకు పంపుతున్నట్టు చెప్పుకుంటున్నారు జిల్లాలో. దీంతో రేషన్ మాఫియాను అణిచివేసేందుకు ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా, పనిచేస్తున్నా..,మంత్రి నేరుగా రంగంలో దిగినా… ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయట. బాధ్యులు ఎవర్నీ ఇంతవరకు అరెస్ట్‌ చేయకపోవడాన్ని బట్టే వాళ్ళు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో అర్ధం అవుతోందంటున్నారు కొందరు. పాత లెక్కలు పక్కాగా తీసి.. కొత్తగా చర్యలు చేపడితే తప్ప… జిల్లాలో రేషన్ మాఫియాను కట్టడి చేయడం సాధ్యం కాదన్న టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో మాఫియా కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలంటున్నారు పరిశీలకులు.