NTV Telugu Site icon

Off The Record: కొవ్వూరులో పేకాట క్లబ్బులపై పోలీస్ వార్ డిక్లేర్..కారణం ఏంటి ?

Otr Kovvur

Otr Kovvur

Off The Record: మేం ఆడుతాం అని వీళ్లు! మిమ్మల్ని ఆడనివ్వం వాళ్లు! పర్మిషన్ ఉందని వీళ్లు! అయినా సరే ఆటలు సాగనివ్వం అని వాళ్లు! అధికారపార్టీనే అడ్డుకుంటారా అని వాళ్లు! ఎవరైతే నాకేంటి అని వీళ్లు! ఇదీ అక్కడి క్లబ్బుల్లో జరుగుతున్న వార్! ఇంకా క్లారిటీ కావాలంటే.. ఛలో కొవ్వూరు!

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు! ఇక్కడ పేకాట క్లబ్బులు ఫేమస్. కాసినో హబ్‌గా మారిపోయందని జనం అంటుంటారు. ఇక్కడి లీటరరీ క్లబ్‌కు ఛైర్మన్‌గా వైసీపీ నేత పరిమి హరిచరణ్ కొనసాగుతున్నా.. అందులో పెత్తనమంతా టీడీపీ కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరిదే అని లోకల్ టాక్. కొవ్వూరు ఎమ్మెల్యే ఈ విషయంలో నామ్‌ కే వాస్తే అని చెప్పుకుంటారు. దీంతో ద్వీసభ్య కమిటీ సభ్యుల మాటే శాసనంలా అయిందంటారు అక్కడి జనం. ఎవరికి అందే ముడుపులు వారికి అందుతూ మూడు పేకలు.. ఆరు కట్టలుగా సాగుతోంది వ్యాపారం. అయితే, ఇటీవల తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పేకాట క్లబ్బులపై వార్ ప్రకటించారు. పేకాట ఆడే ఏ క్లబ్బయినా సరే తొక్కి పడేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. దాంతో జిల్లాలో అన్ని పేకాట క్లబ్బులన్నీ మూతపడ్డాయి. కానీ కొవ్వూరు క్లబ్బులు మాత్రం డోంట్ కేర్ అన్నాయి. ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లింది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. క్లబ్బులపై దాడులు చేశారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సమయంలో పోలీసులను చూసి భయంతో ఒకాయన బిల్డింగ్ పైనుంచి కిందికి దూకి పారిపోవడానికి ప్రయత్నించగా.. తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయన్ని రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఈ క్రమంలో పోలీసులకు క్లబ్ నిర్వాహకులకు మధ్య వాగ్వాదం జరిగింది. క్లబ్ రన్ చేయడానికి అన్ని అనుమతులు ఉన్నాయని నిర్వాహకులు వాదించారు. ఉంది కానీ, కేవలం రమ్మీ ఆడుకోవడానికే తప్ప, 52 ముక్కల ఆటకు పర్మిషన్ లేదని పోలీసులు చెప్పారు. క్లబ్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. దీంతో అధికార పార్టీ నేతల ఇగో హర్టయింది. హోం మంత్రితో ఫోన్ చేయించారు. అయినా ఎస్పీ నరసింహ కిషోర్.. సింహా సినిమా లెవల్లో డోంట్ కేర్ అన్నారు. పొలిటికల్‌గా ఎంత ప్రెజర్ చేసినా తగ్గేదే లేదని తెగేసి చెప్పారు. టీడీపీ నేతలు ఇంకో అడుగు ముందుకేసి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. క్లబ్ నిర్వహణకు అన్ని అనుమతులు ఉన్నా, పోలీసులు అన్యాయంగా దాడి చేశారని, వాళ్లకు భయపడి ఒక వ్యక్తి మేడపైనుంచి దూకడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనంతటికీ పోలీసులు దాడులే కారణమని ఆరోపించారు. మరోవైపు కోర్టు ద్వారా పోలీసులపై కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు.

ఈ వివాదంతో కొవ్వూరులో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య గ్యాప్ పెరిగింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ ఢీ అంటే ఢీ అంటున్నారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ దూకుడికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని తెలుగుదేశం నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. అధికార పార్టీల నేతల మాటల్ని పోలీసులే వినకుంటే నియోజకవర్గంలో పరువు ఏమైపోవాలని ఆవేదన చెందుతున్నారట. పోలీసులు మాత్రం తమ్ముడైనా సరే పేకాట ఆడితే.. కార్డులు విరిగిపోతాయని అల్టిమేటం జారీ చేస్తున్నారట. మొత్తంగా కొవ్వూరులో పేకాట కథకు ఎలా ఎండ్‌ కార్డు పడుతుందో చూడాలి!

 

 

Show comments