NTV Telugu Site icon

Off The Record : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Vs రోజా: ఎవరిది పైచేయి..?

Roja Otr

Roja Otr

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఫైర్‌ మీద సొంత పార్టీ నేతలే నీళ్ళు చల్లుతున్నారా? రాష్ట్రం మొత్తం రీ సౌండ్‌లో వాయిస్‌ వినిపిస్తున్నా… సొంత నియోజకవర్గంలోనే ఆమెకు ఎర్త్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? పరిస్థితిని తాత్కాలికంగా సెట్ చేసుకున్నా… ఆ మాజీమంత్రి ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదా? ఎవరా ఫైర్‌ బ్రాండ్‌? ఆమెకు వచ్చిన తాజా కష్టం ఏంటి? ఆర్కే రోజా…. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మాజీమంత్రికి ఇప్పటికీ పాలిటిక్స్‌లో సినిమా కష్టాలు మాత్రం తప్పటం లేదని అంటున్నారు. రాష్ట్రమంతటా… ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ తెచ్చుకోగలిగినా… సొంత నియోజకవర్గం నగరిలో మాత్రం ఆ ఫైర్ లేదనే టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే… నియోజకవర్గ వైసీపీలోకి మరో ముఖ్య నేత ఎంట్రీని తాత్కాలికంగా ఆపగలిగినా… ఆమె తన ప్రయత్నంలో పూర్తిగా సఫలమవుతారా అన్నది లేటెస్ట్‌ హాట్‌ సబ్జెక్ట్‌. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి మంత్రిగా పనిచేసిన రోజాకు.. నగరిలో కొత్త కుంపటి టెన్షన్ పట్టుకుందట. అంతకు ముందు రోజా పార్టీకి చేసిన సేవల్ని గుర్తుంచుకున్న జగన్‌… 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలోనే పార్టీ కీలకనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆమెకు గ్యాప్ ఏర్పడినట్లు చెప్పకుంటారు. గత ఎన్నికల్లోనూ ఆమెకు నగరి వైసీపీ టికెట్ లేదని, సామాజిక సమీకరణల్లో భాగంగా ఆమెను మరో చోటకు ట్రాన్స్ఫర్ చేయవచ్చని తొలుత ప్రచారం జరిగింది. చివరికి నానా తంటాలుపడి జగన్ ను ఒప్పించి సీటు తెచ్చుకోగలిగినా…. గెలుపు సాధ్యం కాలేదు. ఫలితాల తర్వాత కాస్త రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిన రోజా ఆ తర్వాత పార్టీ లైన్ లోకి వచ్చేశారు.. అడపాదడపా వాయిస్ వినిసిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు టీడీపీ దివంగతనేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు రెండో కొడుకు, నగరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే భానుప్రకాష్‌ తమ్ముడు గాలి జగదీష్‌ వైసీపీలో చేరబోతున్నారన్న ప్రచారం రోజాను తీవ్రంగా కలవరపెట్టిందట.

 

అదే జరిగితే తాను తీవ్ర నిర్ణయం తీసుకుంటానని పార్టీ కీలక నేతలకు తెగేసి చెప్పి ఫోన్‌లో కూడా అందుబాటులో లేకుండా పోయారట రోజా. దీంతో జగదీష్‌ చేరికకకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు చెప్పుకుంటున్నారు.. గాలి జగదీష్ ను వైసీపీ లోకి తీసుకొచ్చి తనకు చెక్ పెట్టేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నిస్తున్నారన్నది రోజా డౌట్‌ అట. గాలి జగదీష్‌ ఎపిసోడ్‌ మొత్తాన్ని తెర వెనకుండి పెద్దిరెడ్డి నడిపించారని, ఇప్పుడు ఏ మాత్రం తగ్గినా… ఇక రాజకీయ భవిష్యత్‌ ఉండదన్నది మాజీ మంత్రి అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే అంత స్ట్రాంగ్‌గా ఉన్నారట. ఈ ఎపిసోడ్ అలా సాగుతున్న క్రమంలోనే రెండు రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు జగన్‌ను కలిశారు రోజా. గంటకు పైగా ఆయన నివాసంలో వన్‌ టు వన్‌ మీటింగ్‌ జరిగిందట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నగరిలో తనకు వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషిస్తూ… తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు తప్ప తనకు అక్కడ ఇబ్బందేమీ లేదని రోజా జగన్‌కు నేరుగా చెప్పినట్లు సమాచారం. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవల్ని ఉపయోగించుకుంటామని అధిష్టానం చెప్పినా… ఇప్పటికిప్పుడు నో ఛాన్స్‌ అని రోజా చెప్పినట్టు తెలిసింది. ఏదైనాసరే… ఇంకో మూడు నెలల తర్వాతనేనని అన్నారట రోజా.ఇక నియోజకవర్గాల పునర్విజనలో గెలుపు అవకాశాలు గట్టిగా ఉన్న సెగ్మెంట్‌ టిక్కెట్‌ ఇస్తానన్నా… అవేం వద్దు… తనకు నగరి మాత్రమే కావాలని కుండబద్దలు కొట్టేసినట్టు అంతర్గత సమాచారం. ఈ పరిస్థితుల్లో రోజా నెక్స్ట్‌ స్టెప్‌ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజుల తర్వాతైనా గాలి జగదీష్‌ వైసీపీలో చేరితే రోజా ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ ఎపిసోడ్ లో ఆమెపై పెద్దిరెడ్డి పైచేయి సాధిస్తారా.. లేక రోజా పంతం నెగ్గించుకుంటారా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.