NTV Telugu Site icon

Off The Record : అందుకే నారాయణస్వామి అజ్ఞాత వాసమా..?

Ycp Otr

Ycp Otr

ఏపీలో అధికారం మారాక ఆ మాజీ డిప్యూటీ సీఎం ఎందుకు కంటికి కనిపించడం లేదు? మాట వినిపించడం లేదు? అధికారంలో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన శాఖను చూసి, ఇప్పుడా వ్యవహారాల మీద ఏకంగా సీఐడీ దర్యాప్తు జరుగుతున్నా ఆయన కిక్కురుమనడం లేదు ఎందుకు? మేటర్‌ తనదాకా వస్తుందన్న భయమా? వస్తే ఏం చేయాలో అర్ధంకాని గందరగోళమా? నిజంగానే ఆయన ప్రమేయం బయటపడితే అజ్ఞాతంలో ఉన్నా వదులుతారా? ఇంతకీ ఎవరా లీడర్‌? ఎందుకా అజ్ఞాతవాసం? నారాయణస్వామి.. … ఏపీ మాజీ డిప్యూటీ సిఎం, ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి. ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన నారాయణస్వామి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తాను తప్పుకుని కుమార్తె కృపాలక్ష్మిని బరిలో దించారు. ఆమె ఓడిపోయాక పూర్తిగా కామైపోయారు మాజీ డిప్యూటీ సీఎం. అయితే పవర్లో ఉన్నప్పుడు, టిక్కెట్ల పంపిణీ సమయంలో కూడా నానా హంగామా చేసిన నారాయణ స్వామి అధికారం పోగానే… ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎందుకు కామ్‌ అయిపోరయారని ఆరా తీస్తున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు. అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ చాలానే ఉందన్న టాక్‌ సైతం నడుస్తోందట. గడిచిన ఐదేళ్ళలో టీడీపీ, జనసేన పార్టీ ముఖ్యుల్ని సైతం హద్దూ, అదుపూ లేకుండా విమర్శించారని, పరిధి దాటిన వాళ్ళని వదిలే ప్రసక్తేలేదని ప్రస్తుతం కూటమి వైపు నుంచి వస్తున్న సంకేతాలు ఆయన్ని భయపెడున్నాయన్నది లోకల్‌ టాక్‌. జిల్లాలో వరుసగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, భూమన, రోజా చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్న వార్తలతో నాకెందుకొచ్చిన గొడవ అన్నట్టుగా ఉంటున్నారట నారాయణస్వామి. అందుకే ఇప్పటిదాకా పార్టీ అధ్యక్షుడు జగన్‌నుగాని, జిల్లాకు చెందిన ఇతర నాయకుల్ని గానీ కలవకుండా దూరం పాటిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మామూలుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నారాయణస్వామి అత్యంత సన్నిహితుడన్న పేరుంది. కానీ… ఆయనకు క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పుడు కూడా అనుకూలంగా కనీసం నోరు విప్పకపోవడం ఆశ్చర్యంగానే ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

 

మొన్నటిదాకా ఆయా నేతలు చుట్టూ తిరిగిన వ్యవహారాలు ఇప్పుడు తనకెక్కడ చుట్టుకుంటాయోనన్న కంగారు మాజీ డిప్యూటీ సీఎంలో ఉందని, అందుకే టచ్‌ నాట్‌ అంటున్నారన్నది ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పటికే ఏపీ సర్కార్‌ లిక్కర్‌ కుంభకోణంపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. ఆ విషయంలో దూకుడుగా ఉంది సీఐడీ. ఇప్పటిదాకా అధికారుల చుట్టూ తిరుగుతున్న దర్యాప్తు… ఇక పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే నాటి ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా అది తనకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న కంగారుతో నారాయణ స్వామికి నిద్ర కూడా పట్టడం లేదంటున్నారు. మరీ ముఖ్యంగా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్నిప్రమాదం తర్వాత అక్కడ తీగ లాగితే లిక్కర్‌ లింకులు కూడా బయటపడ్డాయన్న సమాచారం ఇప్పటికే సోషల్‌ మీడియాలో తెగ తిరిగేస్తోంది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైన మాధవరెడ్డి, పీఏ శశికాంత్ నివాసాల్లో తనిఖీలు చేశాయి సీఐడీ బృందాలు. ఆ సమయంలోనే మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు ముఖ్యమైన లావాదేవీల వివరాలు వెలుగు చూసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎక్సైజ్ శాఖ మంత్రిగా పూర్తిస్థాయిలో అప్పటి పెద్దలు చెప్పినట్టు నడుచుకున్న నారాయణస్వామి చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్న టాక్ గట్టిగానే నడుస్తోంది. నాడు మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన సంతకాలకు తననే బాధ్యుడిని చేస్తూ… లిక్కర్‌ కేసు ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనని నారాయణస్వామి తెగ టెన్షన్‌ పడుతున్నట్టు చెప్పుకుంటున్నాయి జిల్లా రాజకీయవర్గాలు. లిక్కర్‌ స్కాం దర్యాప్తు పొలిటికల్‌ వైపునకు మళ్ళితే అందులో ముందు తనే ఉంటానన్న భయం ఆయన్ని బాగా వెంటాడుతోందట. అందుకే ఎక్కడా ఏం మాట్లాడకుండా, అస్సలు నోరు తెరవకుండా… పూర్తిగా ఇంటికే పరిమితం అవుతూ జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. పెద్దిరెడ్డి అండతో గత ప్రభుత్వంలో నారాయణస్వామి తన ప్రతాపం చూపించారని, తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆయనకు మింగుడు పడటంలేదని, అందుకే ఈ అజ్ఞాత వాసం అన్నది జిల్లా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరి కామ్‌గా ఉంటే కేసు తనదాకా రాకుండా ఉంటుందా? లేక ఒకవేళ వస్తే అప్పుడే మాట్లాడదామన్నట్టు వేచి చూస్తున్నారా అన్నది తేలాల్సి ఉంటుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.