Site icon NTV Telugu

Off The Record : నల్లమిల్లి కూటమి కొంప ముంచుతాడా..?

Otr Over Nallimilli

Otr Over Nallimilli

ఆ నియోజకవర్గంలో టిక్కెట్టు రాక అసంతృప్తితో ఉన్న ఆ టీడీపీ నేత కూటమి కొంప ముంచుతాడా? సీట్ రాని వాళ్లు రెండ్రోజులు అరిచి సైలెంట్ అవుతుంటే ఆ నేత మాత్రం ఎందుకు దారికి రావడం లేదు…? ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఎందుకు రంగంలోకి దిగాయి…? అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. పొత్తులో భాగంగా సీటును బీజేపీకి వదులుకోవాల్సి రావడంతో అలకపాన్పు ఎక్కిన నల్లమిల్లి… పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతేనా… నాకు అన్యాయం జరిగింది అంటూ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డెక్కారు. ఇంటింటికీ తిరుగుతూ పాదయాత్ర చేస్తున్నారు. నల్లమిల్లికి న్యాయం చేయాలి… టీడీపీని రక్షించాలనేది ఆయన నినాదం. ఇదే కూటమిలో కలవరం రేపుతోంది. నల్లమిల్లి ఎక్కడ తమ కొంప ముంచుతారోనని భయపడిపోతున్నారు.

బీజేపీకి అనపర్తి సీటు ఇవ్వడం తమకు కలసి వస్తుందని వైసీపీ సంబరపడిపోతోందట. కూటమిలో కుంపట్లు తమకు అనపర్తి సీటును బంగారుపళ్లెంలో పెట్టి ఇచ్చినట్లే అన్నది అధికారపార్టీ భావన. 2019 ఎన్నికల్లో వైసీపీ నేత, సిట్టింగ్‌ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డికి 55వేల మెజారిటీ వచ్చింది. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి శివకృష్ణంరాజు రేసులో ఉంటే తమకు రెట్టింపు మెజారిటీ వస్తుందని అంచనా వేస్తోంది అధికారపార్టీ. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్‌కు కూడా ఇది కలసి వస్తుందని, కూటమి బీజేపీ అభ్యర్థి పురందేశ్వరికి మైనస్‌ అని లెక్కలు వేస్తోంది. నల్లమిల్లి సహకరించకపోతే ఇక్కడ బీజేపీకి కష్టమేనన్న భయం టీడీపీ, బీజేపీలో కూడా ఉంది. అందుకే ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది టీడీపీ హైకమాండ్. పార్టీ పెద్దలు వెళ్లి కలిసినా, అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం మెట్టుదిగలేదు. బెట్టు వీడలేదు. కనీసం చంద్రబాబును కలవమన్నా కూడా గ్రామాల పర్యటన తర్వాతే అని కుండబద్దలు కొట్టారు నల్లమిల్లి. ఆయన శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ టీడీపీలో వున్న ఒకే ఒక రెడ్డి సామాజికవర్గం నాయకుడు. పైగా 42 ఏళ్లుగా ఆ కుటుంబం టీడీపీలోనే ఉంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తండ్రి మూలారెడ్డి హయాం నుంచి టీడీపీతో అనుబంధం కొనసాగుతోంది.

అనపర్తిలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు తమను దెబ్బతీసేలా ఉందని బీజేపీలో టెన్షన్ మొదలైంది. దీంతో అసలు నల్లమిల్లి టార్గెట్‌ ఏంటి…? ఆయన ఏం చేయబోతున్నారన్నది రాష్ట్ర, కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆరా తీస్తున్నాయట. ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుంది…? ఏం చేస్తే దారికొస్తారు వంటి వివరాలపై ఫోకస్ పెట్టారంటున్నారు.

బీజేపీ టీమ్‌లు నాలుగు మండలాల్లో రెండు రోజులుగా ఓ సర్వే కూడా చేయించినట్లు తెలుస్తోంది. వారి సర్వేలో కూడా నల్లమిల్లి మద్దతు లేకపోతే బీజేపీ అభ్యర్థి కనీస పోటీ ఇవ్వలేరని స్పష్టమైందట. దీంతో పాటు ఎంపీ అభ్యర్థికి కూడా ఎక్కువ నష్టం జరుగుతుందన్న అంచనాకు వచ్చారు. కొందరు బీజేపీ పెద్దలు నల్లమిల్లిని బీజేపీలో చేర్చుకుని పోటీ చేయించాలన్న ప్రతిపాదన కూడా చేసినట్లు చెబుతున్నారు. అయితే 42ఏళ్లుగా తమ కుటుంబం టీడీపీలోనే ఉందని ఎప్పుడూ పార్టీ మారే ఆలోచన చేయలేదని నల్లమిల్లి సమాధానం ఇచ్చారంటున్నారు. ముందు టీడీపీ తనకు సీటు ఇచ్చింది కాబట్టి తనకు దాన్ని వదిలేయాలని ఆయన బీజేపీ నేతలను కోరారు. టీడీపీలోని ఆయన అనుచరులు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నల్లమిల్లిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బీజేపీ పెద్దలు అసలు అనపర్తిలో ఏం జరుగుతోందని ఆరా తీశారు. పైకి సైలెంట్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నా…ఏం చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో అసలు అనపర్తి కూటమిలో రాజకీయపరిణామాలు ఎలా మారతాయోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. నల్లమిల్లిని ఎలా దారికి తెస్తారు లేక ఆయనే వేరే నిర్ణయాలు తీసుకుంటారా అన్నది మరో నాలుగురోజుల్లో తేలొచ్చంటున్నారు.

Exit mobile version