NTV Telugu Site icon

Off The Record : జీహెచ్‌ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ దూరం

Mlc Elections

Mlc Elections

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌ పోటీ చేయడం లేదా? ఎందుకొచ్చిన రిస్క్‌ అనుకుంటోందా? అధికారంలో ఉండి కూడా రిస్క్‌ అనుకోవడం వెనక రీజనేంటి? ఏ విషయంలో హస్తం పార్టీ వెనక్కి తగ్గుతోంది? ఎక్కడ జరగబోతోందా ఎన్నిక? తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల టైం దగ్గర పడుతోంది. ఏప్రిల్ 4 తో నామినేషన్ గడువు ముగుస్తుంది. ప్రత్యేకించి ఇది జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్సీ సీటు కావడంతో… అన్ని వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. బరిలో నిలిచేది ఎవరు… దూరంగా ఉండేది ఎవరనే చర్చలు జోరుగా నడుస్తున్నాయి. వాటి సంగతి ఎలా ఉన్నా…. రాజకీయ వర్గాల్లో మాత్రం కాస్త పిక్చర్‌ క్లియర్‌ అవుతున్న సంకేతాలు కవిపిస్తున్నాయంటున్నారు. కాస్త టఫ్‌ సిచ్యుయేషన్‌ ఉన్నప్పుడు అధికార పార్టీ.. పోటీలో ఉంటుందా..? లేదంటే ఎవరికైనా మద్దతు ఇస్తుందా అని మాట్లాడుకోవడం కామన్‌. ఇక్కడ కాంగ్రెస్‌ పరిస్థితి కూడా అలాగే ఉందట. ఈ ఎన్నికలో ప్రధానంగా ప్రభావం చూపే ఓటర్లు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్స్‌. కానీ… ఈ పరిధిలో పార్టీకి అధికారికంగా ఇద్దరంటే ఇద్దరే కార్పొరేటర్స్‌ ఉన్నారు. ఇక ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు అనిల్, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేష్‌, ఎమ్మెల్సీ వెంకట్‌కు ఓటు హక్కు ఉంది. ఇక బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి 20 మంది కార్పొరేటర్స్‌ జంప్‌ అయ్యారు. అలా… ఇవన్నీ కలిపి ఎట్నుంచి ఎటు లెక్కేసుకున్నా… కాంగ్రెస్‌ బలం పాతిక ఓట్లకు మించదు. దాంతో పార్టీ పెద్దలు పోటీ ఆలోచన విరమించుకున్నట్టు తెలుస్తోంది. తాము నేరుగా పోటీ చేసి బద్నాం అయ్యే బదులు మిత్రపక్షం ఎంఐఎంకు మద్దతిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎంఐఎం కాంగ్రెస్‌ పార్టీకి అధికారికంగా మిత్రపక్షం కాదుగానీ…… మిత్రపక్షమే. రెండు పార్టీల మధ్య అలాంటి స్నేహం నడుస్తోంది.

ఇప్పుడు అసలు కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వకున్నా… సొంతగా గెలిచేంత బలం పతంగి పార్టీకి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా… ఫాల్స్ ప్రెస్టీజ్‌కు పోయి, బరిలో నిలిచి మిత్రుడితో శత్రుత్వం పెంచుకునే బదులు మద్దతివ్వడమే బెటర్‌ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎంఐఎం మినహా మిగతా ఏ పార్టీకి ఎమ్మెల్సీని గెలిపించుకునేంత బలం లేదు. అందుకే చేత్తో మాంజా పట్టుకుని పతంగిని ఎగరనిస్తే బెటర్‌ అని ఆలోచిస్తున్నారట. గతంలో కాంగ్రెస్, ఎంఐఎం సహజ మిత్రులు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి గ్యాప్‌ వచ్చింది.ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో మళ్ళీ ఎంఐఎం దగ్గరైంది. ఈ మైత్రి కంటిన్యూ చేయడంలో భాగంగానే కాంగ్రెస్‌… మజ్లిస్‌ పార్టీకి అండగా ఉండవచ్చంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.