Site icon NTV Telugu

Off The Record : మీనాక్షి నటరాజన్ పదవి ఇప్పించగలరా ? అంత పవర్ ఉందా ?

Meenakshi Natarajan

Meenakshi Natarajan

రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ కేబినెట్‌ మంత్రి పదవులు ఇప్పించగలుగుతారా? గాంధీభవన్‌లో ఆమె టిక్‌ పెడితే… ఏఐసీసీ ఆఫీస్‌లో ఓకే చేసేస్తారా? తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్ఛార్జ్‌కు అన్ని పవర్స్‌ ఉన్నాయా? లేకుంటే ఆశావహులు ఆమె చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు? కలుస్తున్న వాళ్ళకి ఆమె ఎలాంటి భరోసా ఇస్తున్నారు? మంచి తరుణం మించిన దొరకదు… నౌ ఆర్ నెవ్వర్‌ అన్నట్టుగా ఫీలవుతున్నారట తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు. త్వరలోనే కేబినెట్ విస్తరణ జరగబోతున్నందున…ఆశావహులంతా… ఎవరికి వారు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు గనుక కేబినెట్‌ బెర్త్‌ దక్కుంటే… ఇక ఈ టర్మ్‌లో ఛాన్స్‌ ఉండబోదని, ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో… ఉండేదెవరో ఊడేదెవరూ అనుకుంటూ… గాడ్‌ ఫాదర్స్‌ని ఆశ్రయిస్తున్నట్టు సమాచారం. ఇక మనసులో పెట్టుకుంటే కుదరదు. ఎక్కడో ఒకచోట పెద్దలకు చెప్పుకుని మంత్రి పదవి కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలని ఎక్కువ మంది డిసైడయ్యారట. మరోవైపు ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ వరుసగా రాష్ట్ర పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. నేతలతో ముఖాముఖి చర్చలు జరపడంతో… నాయకులు కొంత స్వేచ్ఛగా ఇంచార్జ్‌ దగ్గర తమ గోడు వెళ్ళబోసుకుంటున్నట్టు సమాచారం. అలాగే తమ మనసులోని కోరికల చిట్టా విప్పుతున్నారట. ఎమ్మెల్సీలకు మీనాక్షి నటరాజన్ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో…వెళ్ళి కలుస్తున్నారు. కొందరు నేతలు డిసిసి అధ్యక్ష పదవులు అడిగితే… మరికొందరు మంత్రి పదవుల్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ ఆదివారంనాడు ఇన్ఛార్జ్‌ని కలిశారు. తెలంగాణ ఉద్యమంలో పని చేశా, కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉంటున్నా… కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వండి… పార్టీకి అక్కరకు వస్తానని మనసులో మాట చెప్పేశారట. ఈ క్రమంలోనే… మరో ఎమ్మెల్సీ… విజయశాంతి కూడా మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. 15 నిమిషాలు ఇద్దరూ భేటీ అయ్యారు. బీసీ,.. మహిళా కోటాలో తన పేరును మంత్రి పదవికి సిఫార్సు చేయాలని మీనాక్షిని విజయశాంతి కోరినట్టు తెలిసింది. వారం క్రితం.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా ఇన్ఛార్జ్‌ని కలిశారు. తమ జనాభా లెక్క ప్రకారం… ఇప్పుడు ఖాళీ ఉన్న ఆరు మంత్రి పదవుల్లో ఒకటి మాదిగలకు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లో మీనాక్షికి లెటర్‌ ఇవ్వడంతోపాటు ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ వెళ్ళి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని కలిశారు. ఇలా… వీళ్లందరిదీ ఒకటే ఆలోచగా చెప్పుకుంటున్నారు.

అధిష్టానం ఎలాగూ కేబినెట్‌ విస్తరణకు కసరత్తు చేస్తోంది. వస్తే వచ్చింది… పోతే పోయింది… మనం కూడా ఓ ట్రయల్‌ వేస్తే… తప్పు లేదుకదాఅన్నదే ఎక్కువ మంది నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది. కానీ… ఇక్కడే అసలైన డౌట్‌ వస్తోందట కొందరికి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ని అడిగితే.. మంత్రి పదవులు ఇప్పిస్తారా? పదవులు ఎవరికి ఇవ్వాలో ఇన్ఛార్జే పార్టీ పెద్దలకు సూచిస్తున్నారా? ఆమెకు ఆ స్థాయి పవర్‌ ఉందా అని చర్చించుకుంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. పార్టీ పదవులంటే… నేరుగా పిసిసి అధ్యక్షుడికో, ఏఐసీసీలోనో చెప్పి రికమెండ్ చేయొచ్చు. కానీ… కేబినెట్‌ బెర్త్‌ల పవర్‌ని కూడా మీనాక్షి నటరాజన్‌కు ఇచ్చారా అలా లేనప్పుడు వీళ్ళంతా వెళ్ళి ఆమెను ఎందుకు కలుస్తున్నారన్నది పార్టీలోని కొన్ని వర్గాలను వేధిస్తున్న ప్రశ్న. కేబినెట్‌ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో ఇప్పటికీ ఒక డేట్‌ అంటూ ఫిక్స్‌ అవలేదు. కానీ.. ఈ మీటింగులు, నాకు ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అన్న పోటా పోటీ విన్నపాలతో తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయం వేడెక్కుతోంది. అదే సమయంలో కేడర్లో సైతం గందరగోళం పెరుగుతోందట.

Exit mobile version