Site icon NTV Telugu

Off The Record : మార్వాడి గో బ్యాక్ వెనుక అదృశ్య శక్తి..?

Marawdi

Marawdi

మార్వాడీ గో బ్యాక్ నినాదం వెనుక కుట్ర ఉందా? అదృశ్య శక్తులేవో వెనకుండి… కావాలని రెచ్చగొడుతున్నాయా? ఎవరో ఏదో.. ఆశించి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్‌ సిటీలో మంట పెడుతున్నారా? ఏవో వ్యక్తిగత వివాదాలకు పొలిటికల్‌ కలర్‌ పులిమేసి సెంటిమెంట్‌ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారా? అసలీ విషయంలో ప్రధాన రాజకీయ పార్టీల వైఖరేంటి? తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్‌ నినాదం ప్రకంపనలు రేపుతోంది. దీని మీద సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. తాము మాట్లాడుతున్నది సహేతుకమా? అహేతుకమా? అన్న దాంతో సంబంధం లేకుండా..ఎవరికి తోచిన వ్యాఖ్యలు వారు చేస్తూ… ఎగదోస్తున్నారు.

దీంతో… అసలీ వివాదం ఎక్కడ మొదలైంది? ఎందుకు పెరుగుతోంది? దీనివల్ల ఎవరికి లాభం? హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లో ఇలాంటి వివాదాలు పురుడుపోసుకోవడం మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అన్న చర్చలు నడుస్తున్నాయి వివిధ వర్గాల్లో. ప్రధాన రాజకీయ పార్టీలేవీ ఈ మార్వాడీ గో బ్యాక్‌ నినాదాన్ని సమర్ధించడం లేదు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అయితే… దీన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. బీఆర్‌ఎస్ కూడా అదసలు తమకు సంబంధం లేని వ్యవహారంగా చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీని మీద ఎవరికి ఇంట్రస్ట్‌ ఉంది? ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారని అంటే… అదంతా రాజకీయ నిరుద్యోగుల పని అన్న సమాధానం వస్తోంది.

ఇలాంటి లేనిపోని వివాదాలను రేకెత్తించి…తాము క్లిక్ అవ్వాలని అనుకుంటున్నారట కొందరు. అలాంటి వాళ్ళు సక్సెస్ కారని. ఒకరకంగా అది హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర అంటూ సరికొత్త వాదనను తెర మీదికి తెస్తున్నాయి హిందూ సంస్థలు. దీనికి మొదట్లోనే చెక్‌ పెట్టకుండా ఇలాగే కొనసాగనిస్తే…. హైదరాబాద్‌ మీద పెను ప్రభావం చూపెడుతుందన్న అభిప్రాయాలు సైతం బలంగా ఉన్నాయి. గంగా జమునా తెహజీబ్ లెక్క… అంతా కలిసి మెలిసి ఉంటున్నారని, ఇప్పుడు దానికి విఘాతం కలిగితే… శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని కూడా అంటున్నారు కొందరు.

మార్వాడీలు అయినా… మరే సమాజానికి చెందిన వారు అయినా… తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉండాలే తప్ప… ఇలా మూకుమ్మడిగా గో బ్యాక్ నినాదం అందుకుంటే… మహా నగరాల్లో ఎలా సాధ్యమన్న ప్రశ్న వస్తోంది. వ్యక్తిగత గొడవకు రాజకీయ రంగు పులిమి దాన్ని ఓ సెంటిమెంట్‌గా మార్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదని అంటున్నారు విశ్లేషకులు. అసలీ గో బ్యాక్ నినాదం… ఏదో ఆషామాషీగా చేసింది కాదని, దీని వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని, అర్బన్ నక్సల్స్ పాత్ర కూడా ఉందంటూ ఇటు బీజేపీతో పాటు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. చినికి చినికి గాలి వానగా మారక ముందే ఈ ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టకుంటే… హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌ దెబ్బ తింటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి కొన్ని వర్గాలు.

Exit mobile version