NTV Telugu Site icon

Off The Record: బెల్లంపల్లిలో కేంద్రం మావోయిస్టుల వరుస లేఖలు

Otr Maoist

Otr Maoist

Off The Record: మావోయిస్టు పార్టీ లేఖలు…ఆ ఒక్క నియోజకవర్గంలోనే ఎందుకు వస్తున్నాయి ? వరుస లేఖలు నిజంగానే మావోయిస్టులు విడుదల చేస్తున్నారా ? లేదంటే వాటి వెనుక ఎవరైనా ఉన్నారా ? నేతలను, పోలీసులను…కలవరానికి గురిచేస్తున్న ఆ లేఖల సారాంశం ఏంటి ? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి…? వరుస లేఖలతో రాజకీయ నేతల్లో వణుకు మొదలైందా ?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో…వరుస మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. కేవలం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం నాయకులే టార్గెట్‌గా లేఖలు విడుదలౌతున్నాయి. ఓ ఎమ్మెల్యే అనుచరులు కబ్జాలతోపాటు ఇతర చట్టవ్యతిరేఖ పనులతో రెచ్చిపోతున్నారంటూ…ఇటీవల మావోయిస్టుల పేరుతో లేఖ వచ్చింది. మీ విధానాలు మార్చుకోకపోతే బుద్ధి చెప్తామంటూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరులపై లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అటు ఎమ్మెల్యే, ఆయన అనుచరులు హైరానా పడుతున్నారట. రెండోసారి లేఖ రావడంతో…ఆందోళన పెరిగిపోయిందట. బెల్లంపల్లి నియోజకవర్గం కేంద్రంగానే ఇప్పటికీ పదిసార్లు…ఇలాంటి లేఖలు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆయన అనుచరులను సైతం హెచ్చరిస్తూ…మావోయిస్టు అనుబంధ సంఘం సికాస నేత ప్రభాత్ పేరుతో లేఖలు వచ్చాయి. దుర్గం చిన్నయ్య…పని కోసం వచ్చే మహిళలను లొంగదీసుకుంటున్నాడని, రౌడీయిజం చేస్తున్నాడని అప్పట్లో లేఖలు విడుదలయ్యాయి. భూకబ్జాలకు పాల్పడుతూ…ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని వచ్చిన లేఖలు అప్పట్లో వణుకు పుట్టించాయి. తాజాగా గడ్డం వినోద్, ఆయన పీఏ ప్రసాద్, ఎమ్మెల్యే అనుచరుల పై వివిధ ఆరోపణలు, అంశాలతో లేఖ విడుదలైంది. భూ కబ్జాలకు, అక్రమాలకు అరాచకాలకు పాల్పడుతున్నారని లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖలో పోలీసుల పేర్లు కూడా ప్రస్తావించడం మరింత చర్చకు దారితీస్తోంది. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ దేవయ్య…అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమించిన భూములను పేద ప్రజలకు, కార్మికులకు, రైతు కూలీలకు పంచాలని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు.

తరచూ బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంగా మావోయిస్టు లేఖలు వెలువడుతుండటం కలకలం రేగుతోంది. అధికార పార్టీ నేతలే లక్షంగా చేసుకుని లేఖలు వస్తుండటంతో…పోలీసులకు సవాల్‌గా మారుతోందట. అయితే ఇవి అసలు వాళ్లు విడుదల చేసినవేనా ? లేదంటే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు…నకిలీ మావోయిస్టులు విడుదల చేశారా అన్నది అంతుచిక్కడం లేదట. మావోయిస్టులు లేఖ విడుదల చేస్తే మితిమీరిన ఆరాచకాలు చేసిన వారిని లేదా సమాజానికి కీడు కలిగించే వారిని హెచ్చరిస్తారు. చోటా మోటా లీడర్లను సైతం లేఖల్లో ప్రస్తావించడంతో…స్థానికులే ఎవరైనా అలా చేస్తున్నారా ? మావోయిస్టు సానుభూతిపరులు ఎవరైనా…తరుచు లేఖలు విడుదల చేస్తున్నారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారట. మావోయిస్టులు కూడా లేఖలను ఖండించడం…లేదా ఓన్ చేసుకోవడం లాంటివి ఏం చేయడం లేదట. గతంలో విడుదల చేసిన కొన్ని లేఖల విషయంలో ఎవరో కావాలని చేశారని కొంతమంది పోలీసులు కొట్టిపారేశారట. కొన్నేళ్లుగా బెల్లంపల్లి నేతలనే టార్గెట్‌ చేసుకోవడంతో…వాస్తవానికి మావోయిస్టులు ఇలాంటి పద్దతిలో వార్నింగ్ ఇస్తారా ? ఈ చోట మోటా నాయకులను సైతం అలా టార్గెట్ చేస్తారా అనేది చర్చ జరుగుతోంది. బెల్లంపల్లిలో జరిగే ప్రతి అంశంపై మావోయిస్టుల పేరిట వచ్చిన లేఖల్లో ప్రస్తావించడం అనుమానాలకు తావిస్తోందట. అయితే అవి అసలో…నఖిలినో అనేది పోలీసులు సైతం క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ లేఖలు మావోయిస్టులు విడుదల చేశారా…? లేక మరెవరైనా ఉన్నారా…? అనే కోణంలో సైతం ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే లేఖలు ఎందుకు విడుదల అవుతున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది.

Show comments