NTV Telugu Site icon

Off The Record : మానుకోట మహాధర్నాలో BRS సంగతేంటి..?

Manukota Brs

Manukota Brs

మానుకోట మహాధర్నాలో బీఆర్‌ఎస్‌ పాసా? ఫెయిలా? ఆ కార్యక్రమం చుట్టూ వివాదాస్పద చర్చలు ఎందుకు జరుగుతున్నాయి? భూ కబ్జాదారుల్నే పక్కన పెట్టుకుని పేద రైతులకు న్యాయం చేస్తామని ఎలా అంటారన్న ప్రశ్న ఎందుకు వస్తోంది? ఎవరి కార్యక్రమంలో ఎవరు పెత్తనం చేస్తున్నారన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? లెట్స్‌ వాచ్‌.

మహబూబ్‌నగర్‌ జిల్లా లగచర్ల భూ వివాదంలో గిరిజనులపై దాడి జరిగిందని అంటూ… అందుకు నిరసనగా గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్‌లో ధర్నా నిర్వహించింది బీఆర్‌ఎస్‌. గిరిజనులకు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా మేం అండగా ఉంటామని భరోసా ఇచ్చేందుకే కార్యక్రమం నిర్వహించామన్నది పార్టీ వర్గాల మాట. ఈ మహా ధర్నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ముఖ్య నాయకులు హాజరై కాంగ్రెస్‌ సర్కార్‌ గిరిజనులకు అన్యాయం చేస్తోందంటూ మాట్లాడారు. అంతవరకు బాగానే ఉందని అనుకున్నా…ఈ మహా ధర్నాలో ఇద్దరు నేతల వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశం అయింది. గిరిజనుల కోసం నిర్వహించిన మహా ధర్నాలో ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీరు హాట్‌ టాపిక్‌ అయింది.

అధికార కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టే ఉద్దేశంతో చేసిన ధర్నా సక్సెస్‌ అయిందా లేదా అన్న సంగతి పక్కనబెడితే… ఈ ఇద్దరు నాయకుల తీరుతో మాత్రం అభాసుపాలయ్యారన్న అభిప్రాయం పెరుగుతోందట. అగ్రవర్ణాలకు చెందిన రవీందర్‌రావు, గిరిజనుడే అయినా….. భూ కబ్జా ఆరోపణలున్న శంకర్‌ నాయక్‌లు అంతా తామై నిర్వహించడంతో… ఆ కబ్జాల పర్వాన్ని మరోసారి చర్చకు పెట్టినట్టు అయిందని అంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి గిరిజన నేతలుగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ .. మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ , శంకర్ నాయక్ మహబూబాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోతు కవిత లాంటి నాయకులు ఉన్నా… ఉన్నా సభ నిర్వహణ బాధ్యత అంతా ఎమ్మెల్సీ రవీందర్రావు చూడటం చర్చకు దారి తీసింది. సభాధ్యక్షురాలుగా మాలోత్‌ కవితను మొదట ప్రకటించినా…చివరికి ఇవ్వకుండా రవీందర్ రావు నిర్వహించడం చర్చకు కారణమైంది. కవిత, సత్యవతి రాథోడ్, రెడ్యా నాయక్ లంబాడి భాషలో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు చేస్తోందని చెప్పడంతో… వాళ్ళ ప్రసంగాలకు మంచి స్పందన వచ్చింది. ఇలాంటి సమయంలో సభ నిర్వహణ బాధ్యతను గిరిజన నేతలకే ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరోవైపు ఎమ్మెల్సీ రవీంద్రరావు ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో అహంకార పూరితంగా మాట్లాడారన్న విశ్లేషణలు పెరుగుతున్నాయట. ధర్నాలో ఆయన చేసిన హడావిడి, పెత్తనం మీద గిరిజనుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక శంకర్‌నాయక్‌కు ప్రాధాన్యంతో ఆయన భూ కబ్జాల వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చినట్లయిందని అంటున్నారు. శంకర్‌ నాయక్ కన్నుపడిందంటే ఎలాంటి భూమైనా ఖతమే అన్న ప్రచారం గతంలో ఉంది. పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబందించి గతంలో బాధితులు ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని పేద రైతులకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్న టాక్‌ నడుస్తోంది జిల్లాలో. ఇలా మొత్తంగా బీఆర్‌ఎస్‌ మహా ధర్నా చుట్టూ పలు పొలిటికల్‌ క్వశ్చన్‌ మార్క్‌లు పెరుగుతున్నాయి.