NTV Telugu Site icon

Off The Record : ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పొలిటికల్ నైరాశ్యం..

Konduri

Konduri

ఆ టీడీపీ ఎమ్మెల్యే తనను ఎన్నుకున్న నియోజకవర్గానికి గెస్ట్‌ ఆర్టిస్ట్‌ అయిపోయారా? తనకున్న ఏవేవో రాజకీయ అసంతృప్తుల్ని సెగ్మెంట్‌ మీద చూపిస్తున్నారా? దొరికిందే ఛాన్స్‌ అన్నట్టుగా….. ఆయనగారి తమ్ముడు గారు చెలరేగిపోతున్నారా? ఎమ్మెల్యే కాదు… అంతకు మించి అన్నట్టు అనధికారిక దర్పం ఒలకబోస్తున్నారా? ఎవరా ఎమ్మెల్యే? ఆయన షాడో? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ సంపాదించుకున్నారు మాజీ మంత్రి కొండ్రు మురళీమెహన్. ప్రస్తుతం తాను సిట్టింగ్‌గా ఉన్న రాజాంతోపాటు గతంలో పోటీ చేసిన ఎచ్చెర్లలో కూడా ఆయనకంటూ వర్గం ఉంది. పవర్‌ పాలిటిక్స్‌ నడిపించడంలో దిట్ట అయిన ఈ ఎమ్మెల్యే… ఇటీవలి కాలంలో తీవ్ర నైరాశ్యంలో ఉన్నారట. అంతా…భ్రాంతియేనా అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉందని అంటున్నారు దగ్గరగా గమనిస్తున్నవారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అధికారం వచ్చాక ఎస్సీ కోటాలో మంత్రి పదవి ఆశించారు కొండ్రు. కానీ… ఆ ఛాన్స్‌ రాకపోవడంతో…. అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే…. అసలు నియోజకవర్గ రాజకీయాల్ని పట్టించుకోవడం మానేశారట. సరిగ్గా ఇక్కడే లోకల్‌ వ్యవహారాలు కొత్త టర్న్‌ తీసుకున్నాయని అంటున్నారు. అన్న నైరాశ్యం ఆయన తమ్ముడి పాలిట వరంగా మారిందట. అక్క పెత్తనం-చెల్లెలి కాపురం అన్న సినిమా టైటిల్‌ని కాస్త రివర్స్‌ చేసి ఇక్క తమ్ముడి పెత్తనం యమా జోరుగా నడుస్తోందట. ఇదంతా చూస్తున్న వారికి అసలిప్పుడు రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళినా? లేక ఆయన తమ్ముడు జగదీషా అన్నది అర్ధం కావడం లేదట. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యే… వైజాగ్‌లో సెటిలైపోయి… సొంత వ్యాపారాల్లో బిజీగా ఉన్నారట. ఇదే అదనుగా మురళి తమ్ముడు జగదీష్… నియెజకవర్గంలో అధికారుల బదిలీల మెదలు, కాంట్రాక్ట్‌ పను కేటాయింపు, నామినేటెడ్‌ పదవుల దాకా అన్నిట్లో వేలుపెట్టి విశ్వరూపం ప్రదర్శిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో నేనే సర్వం అన్నట్టుగా జగదీష్‌ వ్యవహరిస్తుండటంతో… అధికారులు కూడా అసలు ఎమ్మెల్యేని మర్చిపోయి ఆయనకే వంతపాడుతున్నట్టు సమాచారం. ముఖ్యమైన ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే ఎమ్మెల్యే మురళీమోహన్‌ ఇలావచ్చి అలా వెళ్ళిపోతున్నారని, మిగతా వ్యవహారాలు మొత్తాన్ని ఆయన తమ్ముడే నడిపిస్తుండటంతో… పార్టీ కేడర్ కూడా జగదీష్‌ వెంటే నడుస్తోందట. కొన్ని అధికారిక కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, ఇతర రిబ్బన్‌ కటింగ్స్‌, కొబ్బరికాయలు కొట్టడాల్లాంటి వాటన్నిటినీ తమ్ముడే నడిపించేస్తున్నారట.

ప్రోటోకాల్‌ లేకున్నా…. ప్రభుత్వ కార్యక్రమాల్లో పెత్తనం చేస్తూ… షాడోలా మారిపోయాడన్న విమర్శలు పెరుగుతున్నాయి నియోజకవర్గంలో. ఇక అధికారులతో మాట్లాడటం, క్యాంప్‌ ఆఫీస్‌కు పిలిపించి ఆదేశాలివ్వడం లాంటి విషయాల్లో అయితే… ఎమ్మెల్యే కంటే ఒక ఆకు ఎక్కువే చేస్తున్నారట ఆయన తమ్ముడు. రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టడంతో పాటు… కొన్ని సార్లు నేరుగా గవర్నమెంట్‌ ఆఫీసులకువెళ్ళి…. సమీక్షలు నిర్వహించడం, అధికారుల సీట్లో కూర్చుని దర్పం ఒలకబోస్తూ…. ఆదేశాలు ఇవ్వడం లాంటి వ్యవహారాలతో యంత్రాంగంలో గుబులు పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే అధికారుల విధులకు, పౌర సేవలకు షాడో ఎమ్మెల్యే ఆటంకాలు కలిగిస్తున్న సందర్భాలు కోకోల్లలుగా ఉంటున్నాయట. తనకు నచ్చినట్టు అంతా ఉండాల్సిందేనని, చెప్పినట్టు పని చేయాల్సాందేనని, లేదంటే… రాజాం నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని వెళ్ళిపోవచ్చని కరాఖండీగా చెప్పేస్తున్నారట ఎమ్మెల్యే తమ్ముడు. స్కూల్స్‌కు వెళ్ళడం, మధ్యాహ్నం భోజనం అమలు తీరును ప్రశ్నించడంతోపాటు.. నియోజకవర్గంలో గోకులం షెడ్ల ప్రారంభోత్సవాలు, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు, అమ్మవారి జాతర ఏర్పాట్ల లాంటి విషయాల్లో ఆయన హడావిడి అంతా ఇంతా కాదంటున్నారు. గట్టిగా మాట్లాడుకుంటే… ఒరిజినల్‌ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా ఈ రేంజ్‌లో హంగామా చేయరు బాబోయ్‌…. అని రాజాం ప్రజలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. షాడో తీరుతో మున్సిపల్, రెవెన్యూ, విద్యాశాఖతో పాటు వివిధ విభాగాల మండల స్థాయి అధికారులు లబోదిబోమంటున్నట్టు సమాచారం. ఎన్నుకున్న నాయకుడు ఎగనామం పెడితే…., తమ్ముడితో తంటాలు తప్పవు మరి యెటకారంగా అంటున్నారట నియోజకవర్గ ప్రజలు, టిడిపి కార్యకర్తలు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే…. అన్నకు రాజకీయలపై ఆసక్తి లేదా? లేక తమ్ముడి పెత్తనాన్ని కాదనలేకపోతున్నారా అన్నది అర్ధం కావడం లేదన్న చర్చ నడుస్తోంది లోకల్‌గా.ఇలా రకరకాల వ్యవహారాలతో షాడో ఎమ్మెల్యేగా మారిన కొండ్రు జగదీష్‌ తీరు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతోంది. మేటర్‌ని కొందరు స్థానిక టీడీపీ నాయకులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలిసింది. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతారా? లేక ఎవరైతేనేం వాళ్ళింట్లో వాళ్ళేగా అని వదిలేస్తారా అని చూడాలంటున్నారు పరిశీలకులు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం రాజాంలో మొదటికే మోసం రావడం ఖాయం అన్నది టీడీపీ లోకల్‌ లీడర్‌షిప్‌ అభిప్రాయం.