ఆ ఎమ్మెల్యే కుటుంబంలో కుంపట్లు అంటుకున్నాయా? వారసత్వ పోరు అగ్గి రాజేసిందా? ఇన్నాళ్ళు పాలు నీళ్ళలా కలిసిమెలిసిపోయి రాజకీయం చేసిన అన్నదమ్ముల మధ్య వాళ్ళ కొడుకుల రూపంలో వార్ మొదలైందా? మోసే వాళ్ళు ఎప్పుడూ మోతగాళ్ళుగానే మిగిలిపోవాలా? పైకెక్కే ఛాన్స్ ఇవ్వరా? అంటూ శాసనసభ్యుడిని నిలదీస్తున్నదెవరు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏమా కుటుంబ వారసత్వ కథా చిత్రమ్? వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు.. కాకినాడ సిటీ టిడిపి ఎమ్మెల్యే. ఆరు సార్లు పోటీ చేసి మూడు విడతలు గెలిచారాయన. పార్టీ వేవ్ ఉన్నప్పుడే కొండబాబు గెలుస్తారనేది ఓపెన్ టాక్. అదంతా డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు జరుగుతున్న కథలో ఊహించని మలుపులు పెరుగుతున్నాయట. కొండబాబు, ఆయన అన్న సత్యనారాయణ.. 2019 ఎన్నికల వరకు కలిసి పని చేశారు. 2024 ఎలక్షన్స్‌లో మాత్రం… సత్యనారాయణ తన ఫ్యామిలీలో ఒకరికి సీటు కోసం చివరి వరకు ప్రయత్నం చేశారు. పార్టీ కూడా తీవ్ర తర్జన భర్జనల మధ్య కొంత కాలం ఆగింది. చివరి నిమిషంలో కొండబాబుకే ఫైనల్ అయింది టిక్కెట్. ఒక దశలో ఐవిఆర్ఎస్ ద్వారా సత్యనారాయణ కోడలు పేరును కూడా ప్రతిపాదించింది పార్టీ… కానీ…తనకు చివరి అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యే పార్టీ పెద్దలకు విన్నవించుకోవడంతో ఓకే చేసేశారట. సత్యనారాయణ కొడుకు ఉమాశంకర్, కొండబాబు కొడుకు మోహన్ వర్మ. ఉమా శంకర్ 2019 ఎన్నికల నుంచి పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు.. అయితే 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి కొండబాబు కుమారుడు మోహన్ వర్మ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తన మార్కు కోసం రాజకీయాలు మొదలు పెట్టేశారట. ఇక తండ్రి పోటీ చేసే అవకాశం దాదాపు లేకపోవడంతో తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట మోహన్‌వర్మ. అందుకు ఆయన తండ్రి కమ్ ఎమ్మెల్యే కూడా కోరస్ పలుకుతున్నట్టు సమాచారం. అక్కడే తేడా కొడుతోందట ఫ్యామిలీలో. గతంలో కొండ బాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ… సత్యనారాయణ షాడోలా పనిచేసేవారని చెప్పుకుంటారు. లోకల్‌గా అధికార, అనధికార వ్యవహారాలను అన్నే చక్క పెట్టేవారట. కానీ… ఈసారి ట్రెండ్ మారింది. కొడుకుల మధ్య జరుగుతున్న పంచాయతీలతో తండ్రుల మధ్య కూడా వైరం మొదలైనట్టు తెలుస్తోంది. తాను లేకపోతే అసలు కొండబాబు ఎక్కడున్నాడంటూ… అనుచరుల దగ్గర ప్రస్తావిస్తున్నారట సత్యనారాయణ. ఇద్దరం కలిసే కష్టపడ్డామని, పార్టీ ఇప్పటివరకు వాళ్లకి అవకాశం ఇచ్చింది.
ఇకనైనా మాకు అక్కర్లేదా? మళ్ళీ వారసులను హైప్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అటు కొండ బాబు మాత్రం తెరవెనక జరపాల్సిన తతంగం జరిపించేసి పైకి… అబ్బే… నాకేం తెలియదంటూ కార్యకర్తలకు చెబుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కుటుంబంలో ఆధిపత్య చీలికలు మొదలయ్యాయని చెవులు కొరుక్కుంటున్నారు తమ్ముళ్ళు. పార్టీ పరంగా, సామాజిక వర్గ పరంగా సత్యనారాయణకి సత్ససంబంధాలు ఉన్నాయి. ఆ బలంతో ఆయన కొత్త రాజకీయాలను నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేనకు కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ఎవరూ లేరు. దాంతో ఒకవైపు జనసైనికులను చేరదీసి మరో వైపు టిడిపిలో తన వర్గంతో పెత్తనం కోసం కొత్తగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కూటమి పార్టీలు కాబట్టి అధికారులు అందరికీ ప్రయారిటీ ఇచ్చి తీరాలని క్లారిటీగా చెప్పేస్తున్నారట సత్యనారాయణ. మరోవైపు కొండబాబు కుమారుడు మోహన్ వర్మ కూడా వారసత్వంగా అధికారం అనుభవించాల్సింది మనమేనని ఓపెనైపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. తండ్రి తర్వాత కొడుకు… ఇందులో కొత్తగా చర్చించడానికి, పెద్దగా మాట్లాడుకోవడానికి ఏముందని ప్రశ్నిస్తున్నారట. అటు సత్యనారాయణ, ఉమాశంకర్ మాత్రం కొండబాబు కోసం ఎంతో చేశాం… తాము ఎప్పటికీ పల్లకీ మోస్తూనే ఉండాలా? పైకెక్కి కూర్చునే అవకాశం ఇవ్వరా అంటూ రుసరుసలాడిపోతున్నట్టు సమాచారం. అందరూ ఒకే ఇంట్లో, ఒకే పార్టీలో ఉంటున్నా ఎవరి ప్రయారిటీ కోసం వాళ్లు కొత్త పాలిటిక్స్ ప్లే చేస్తున్నారట. మొత్తానికి ఇప్పటివరకు రామలక్ష్మణుల్లా ఉన్న వనమాడి బ్రదర్స్…కొడుకుల ఎంట్రీ తో డివైడ్ అయిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పరస్పరం చెక్ పెట్టుకోవడానికి ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే వర్గం హైలెట్ అవుతున్న రాజకీయాలు ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయోనని ఉత్కంఠగా చూస్తున్నారు పరిశీలకులు. అన్నదమ్ములిద్దరిలో ఎవరో ఒకరిది పైచేయి అవుతుందా? లేక ఆ టైం వచ్చేసరికి పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీరుస్తుందా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.