Site icon NTV Telugu

Off The Record : నోరు అదుపులో పెట్టుకోండి..! కిషన్‌ రెడ్డి మాస్‌ వార్నింగ్

Kishan Reddy Otr

Kishan Reddy Otr

తెలంగాణ బీజేపీలో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? విషయం ఏదైనాసరే… ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్స్‌ చేసేస్తున్నారా? నోరు అదుపులో పెట్టుకోమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాయకులకు వార్నింగ్‌ ఇచ్చింది నిజమేనా? అదుపు.. అదుపు… మాట పొదుపని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారా? ఇంతకీ టీజీ బీజేపీలో ఏం జరుగుతోంది? కిషన్‌ ఆ స్థాయికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? పార్టీ లైన్ దాటొద్దు…., సొంత అజెండాలతో ఎవ్వరూ మాట్లాడవద్దు. సబ్జెక్ట్‌ ఏదైనా, మాట్లాడేది ఎవరైనా… పార్టీ వాయిస్‌ ఉండాలే తప్ప మీ పైత్యాలను పార్టీ మీద రుద్దవద్దని రాష్ట్ర నేతలకు వార్నింగ్‌ ఇచ్చారట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. బీజేపీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారాయన. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆఫీస్ బేరర్స్, అధికార ప్రతినిధులంతా ఆ టెలి కాన్ఫరెన్స్‌లో ఉన్నారట. ముఖ్యమైన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి…. కిషన్‌ గట్టిగానే చురకలేసినట్టు చెప్పుకుంటున్నారు. నోటికొట్టినట్టు ఏది పడితే అది మాట్లాడొద్దని క్లియర్ కట్ మేసేజ్ ఇచ్చారట ఆయన. ఎవ్వరూ పార్టీ లైన్ దాటొద్దని,నాతో సహా… ఎంతటి వారైనాసరే… సొంత అజెండాను పార్టీ అజెండాగా అనుకోవద్దని, ఆ బోర్డర్‌ లైన్స్‌ తెలుసుకుని మాట్లాడితే అందరికీ మంచిదని చెప్పేసినట్టు సమాచారం. ఒకే అంశం మీద ఒక్కో నేత ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. ఒకరు మాట్లాడినదాన్ని మరొకరు ఖండిస్తున్నారని, ఇందే పద్ధతి అంటూ… అందర్నీ నేరుగా ప్రశ్నించినట్టు తెలిసింది.

కొద్ది రోజులుగా పార్టీ నేతలు ఏం మాట్లాడుతున్నారన్న విషయమై…ఢిల్లీ పెద్దలకు నేరుగా ఫిర్యాదులు వెళ్తున్నాయట. దాన్ని దృష్టిలో ఉంచుకునే కిషన్‌రెడ్డి వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ విషయంలో ఒక్కొక్క నాయకుడు ఒక్కో రీతిన స్పందించారు. అలాగే…సొంత పార్టీ నేత ఈటల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం మీద కూడా ఎవరికి తోచినట్టు వారు స్పందించారట. అది ఇటు పార్టీకి, అటు వ్యక్తిగతంగా ఈటలకు ఇబ్బంది కలిగించిందని చెప్పుకుంటున్నారు. ఈ రెండిటి మేటర్‌ ఢిల్లీకి చేరడం, పార్టీ పెద్దలు సీరియస్‌ అవడంతో… సేమ్‌ అదే ఫోర్స్‌ను కిషన్‌రెడ్డి కిందికి అప్లయ్‌ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కొంత మంది నేతలు తాము ఒక జాతీయ పార్టీలో ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి… స్థాయికి తగని మాటలు మాట్లాడుతున్నారని, అస్సలు వెనుక ముందు ఆలోచించకుండా మాట్లాడేస్తున్నారన్న అభిప్రాయం ఉందట హైకమాండ్‌లో. చివరికి కొన్ని సందర్భాల్లో అలాంటి వ్యాఖ్యలకు వివరణలు ఇచ్చుకోలేక, కవర్‌ చేసుకోలేక నానా తంటాలు పడాల్సి వస్తోందని, ఇలాంటి వాటికి చెక్‌ పెట్టకుంటే మొత్తానికే ఇబ్బంది అన్న అభిప్రాయం పెరుగుతోందట తెలంగాణ బీజేపీలో. కిషన్‌రెడ్డి తాజా వార్నింగ్‌ ఎంతవరకు పని చేస్తుదో చూడాలంటున్నారు పరిశీలకులు.

Exit mobile version