పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు మస్త్ మస్త్ ఎంజాయ్ చేసిన ఆ లీడర్స్ ఇప్పుడెందుకు ముఖం చాటేస్తున్నారు? చివరికి బీఆర్‌ఎస్ అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలకు సైతం ఎందుకు డుమ్మా కొడుతున్నారు? వాళ్ళను వెంటాడుతున్న భయం ఏంటి?ఇంకా మన టైం మొదలవలేదంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? లేక వేరే ఆలోచనలో ఉన్నారా? ఎవరా లీడర్స్? ఎక్కడ జరుగుతోందా తంతు? పదేళ్ల పాటు అధికారంలో ఉండి, పవర్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ లీడర్స్… ఇప్పుడు మాత్రం పోరాటానికి నై అంటున్నారట. కనీసం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు నిర్వహించేందుకు సైతం ఇష్టపడడం లేదంటున్నారు. క్రింది స్థాయి కార్యకర్తల్ని ముందుకు తోసి కానివ్వండి అంటున్నారే తప్ప… మొన్నటిదాకా అధికారాన్ని అనుభవించిన వాళ్ళు మాత్రం ఆందోళనల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదు. అలా ఎందుకంటే ఇప్పుడు ఆందోళనలు, ఉద్యమాలని అంటూ లేనిపోని కేసుల్లో ఇరుక్కోవడం ఎందుకని అనుకుంటున్నట్టు చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయ వర్గాల్లో. చివరికి ధర్నాలో పాల్గొన్న మహిళా నేత మీద కేసు పెడితే స్పందించే దిక్కు లేకుండా పోయిందట ఉమ్మడి ఖమ్మం బీఆర్‌ఎస్‌లో. ఆ పదేళ్ళు… ప్రత్యేకించి చివరి ఐదేళ్ళు ఓ రేంజ్‌లో పవర్‌ని అనుభవించిన బీఆర్‌ఎస్ నాయకులు చాలామందే ఉన్నారు జిల్లాలో. ఆ సమయంలో రకరకాల కేసులు పెట్టి ప్రత్యర్థుల్ని వేధించారన్న ఆరోపణలున్నాయి. అది ఎంతలా అంటే… మేం ఎవ్వరి మీద కేసులు పెట్టలేదు, వేధించలేదంటూ అసెంబ్లీ ఎన్నికల టైంలో పదే పదే వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చిందట. చివరకు వాళ్ళ అనుచరులు ల్యాండ్ సెటిల్ మెంట్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి వేధించారన్న ఆరోపణలు సైతం తీవ్రంగానే వచ్చాయి.
కట్ చేస్తే….అప్పుడు అలా రెచ్చిపోయిన వారంతా… ఇప్పుడు అవే కేసులు తమకు బౌన్స్ అవుతాయన్న భయంతో అసలు పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాల్లో సైతం పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదన్నది జిల్లా రాజకీయవర్గాల్లో నడుస్తున్న టాక్. హైదరాబాద్‌లోగాని, జిల్లాలోగాని పెట్టే పార్టీ మీటింగ్స్‌కు ఠంచన్‌గా హాజరవుతున్న నాయకులు… ఆందోళనలంటే మాత్రం బెంబేలెత్తిపోతున్నారట. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో రంగంలోకి దిగాల్సి వస్తే… మమ అనిపిస్తున్నట్టు సమాచారం. ఇటీవల కొత్తగూడెంలో బీఆర్ఎస్ సమావేశం జరిగింది. దీనికి రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు తాతా మధు, రేగా కాంతారావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. పార్టీ కోసం పోరాడుతాం… ఇక దున్నేస్తాం… దూకేస్తామంటూ… వీర లెవల్లో లెక్చర్లు ఇచ్చేశారు. కానీ… మరుసటి రోజు రైతు భరోసాపై పార్టీ వర్కింగ్ ప్రెసిడె్ట్ కేటీఆర్ ఆందోళనలకు పిలుపునిస్తే మాత్రం పత్తా లేకుండా పోయారు అంతా. చివరికి రెండు జిల్లాల అధ్యక్షులు సైతం ముఖం చాటేయడాన్ని ఎలా చూడాలన్నది కేడర్ క్వశ్చన్. నాడు మంత్రిగా ఓ వెలుగు వెలిగిన పువ్వాడ అజయ కుమార్ సైతం ఏ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడంలేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే సమస్య ఉందట. మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ బాధ్యులు ఎవ్వరూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే… మాజీ ఎంఎల్ఎ హరిప్రియ నాయక్ ఇల్లెందులో ధర్నా నిర్వహించారు. అందుకామె మీద కేసు బుక్ అయింది. హరిప్రియతో పాటు 30 మంది మీద కేసులు పెట్టినా… పట్టించుకున్న పార్టీ నాయకుడు లేరట. కనీసం పార్టీ తరపున ఖండన కూడా రాకపోవడం ఏంటని మాజీ ఎమ్మెల్యే వర్గం ఆవేదనగా ఉన్నట్టు తెలిసింది. వాతావరణం ఇలాగే ఉంటే… ఇక పార్టీ కోసం ఏం పోరాడతామన్న మాటలు సైతం వినిపిస్తున్నాయట.ఈ పరిస్థితుల్లో జిల్లా పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఏముందిలే అని లైట్ తీసుకుంటున్నారా? లేక వాళ్ళ వేరే మార్పు ఆలోచనలున్నాయా అని కూడా మాట్లాడుకుంటున్నాయట జిల్లా రాజకీయ వర్గాలు. ముందు ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి మరి.