NTV Telugu Site icon

Off The Record : విజయనగరం ఎంపీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? ఆ నేత చేష్టలు ఎబ్బెట్టుగా ఉంటున్నాయా?

Appalnaidu

Appalnaidu

గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లారు. అయితే కలిసొచ్చి కుర్చీలో కూర్చున్నా…. దాన్ని ఎలా వాడుకోవాలో అర్ధంగాక తికమకలు, మకతికలు పడుతున్నారట ఆ ఎంపీసాబ్‌. పబ్లిసిటీ మోజులో తెగ పరేషాన్ అయిపోతూ…. అసలు తానేం చేస్తున్నానో… తన స్థాయి ఏంటో కూడా మర్చిపోయి సొంత పార్టీ ముఖ్యులకే అంతు చిక్కని పజిల్‌లా మారారాట. చివరికి చంద్రబాబు, లోకేష్‌ కూడా అతన్నెవరన్నా అపండర్రా….అని మొత్తుకోవాల్సి వస్తోందా? ఎవరా ఎంపీ? అంత తలనొప్పి పనులేం చేస్తున్నారు? కలిశెట్టి అప్పలనాయుడు….. విజయనగరం టీడీపీ ఎంపీ. ఇప్పుడాయనే పార్టీ పాలిట తిప్పల నాయుడుగా మారిపోయారట. జనరల్‌గా చేసేది తింగరి పనైనా… ఒకసారి అయితే ముద్దుగానే ఉంటుంది. సర్లే…..ఎవరి తిప్పలు వారివి, ఏదో డిఫరెంట్‌గా ట్రయ్‌ చేశారని అనుకుంటారు. కానీ…. అదే అలవాటుగా మారితే మాత్రం అందరికీ ఎబ్బెట్టుగా ఉంటుందని, ఇప్పుడు కలిశెట్టి అలాంటి ఎబ్బెట్టు వ్యవహారాలే నడిపిస్తున్నారని చెప్పుకుంటున్నారు. సాధారణంగా విజయనగరం టీడీపీ ఎంపీ అనగానే చాలామందికి ఠక్కున కళ్ళలో మెదులుతారు అశోక్‌గజపతి రాజు. నియోజకవర్గం మీద ఆయన వేసిన హుందా ముద్ర అలాంటిది. కానీ….ఈ విడత ఆయన స్థానంలో గెలిచిన అప్పల నాయుడి గురించి కాస్త డిఫరెంట్‌గా మాట్లాడుకుంటున్నాయట ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌. ఈయన…., ఈయనగారి ఎక్స్‌ట్రాలు అంటూ మెటికలు విరిచే బ్యాచ్‌ కూడా ఉందట. ఆయనకు కాలం కలిసొచ్చిందో, కూటమి వేవ్‌ కొట్టేసిందోగానీ… పెద్దగా పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌, చరిష్మాలాంటివి ఏమీ లేకుండానే.. ఫస్ట్‌ టైం ఎంపీ అయ్యారు అప్పల నాయుడు. అంతవరకు ఆల్‌ఈజ్‌ వెల్‌. అదృష్టం ఏ ఒక్కడికీ పరిమితం కాదు, అవకాశాలు ఎవడబ్బ సొత్తూకాదు. కానీ…. ఆ తర్వాత ఎంపీ ప్రవర్తన గురించే చర్చ అంతా. ఎంపీగా ఎన్నికయ్యాక జరిగిన తొలి లోక్‌సభ సమావేశాలకు సైకిల్‌ మీద వెళ్ళారు కలిశెట్టి. అక్కడితో ఆగితే ఫర్లేదు…. అంతకు మించి ఆయన చేస్తున్న వ్యవహారాలతో తోటి ఎంపీలు సైతం ఏం చెయ్యాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. అసలాయన అమాయకత్వంతో చేస్తున్నారో… అతివినయంతో చేస్తున్నారో గాని…. పార్టీ పరువు మాత్రం తీస్తున్నారంటూ మాట్లాడుకుంటున్నారట టీడీపీ ఎంపీలు.

స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు కూడా అప్పలనాయుడికి అక్షింతలు వేసినట్టు సమాచారం. ఎంపీగా తొలిసారి లోక్ సభకు ఆయన సైకిల్‌పై వెళ్ళడం మొదట్లో బాగానే ఉన్నా… అంతా దాని గురించి మాట్లాడుకున్నా…. ఆ తర్వాత ప్రహసనంగా మారిపోయింది. ప్రతి సెషన్‌లో ఆయన సైకిల్ మీదే లోక్‌సభకు వెళ్లడం, దాన్ని మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకోవడం పరిపాటి అయిపోయింది. మొదట్లో అప్పలనాయుడు సైకిల్ ప్రచారాన్ని ఆసక్తిగా చూసిన వాళ్ళు.. ఇపుడు అసహనానికి గురవుతున్నారట. మొదటిసారి ముద్దుగా ఉంటుందిగానీ… పదే పదే అదే వరస అయితే ఎబ్బెట్టుగా ఉండదా అన్నది క్వశ్చన్‌. పోనీ ఈయనగారేమన్నా…. నిరాడంబరుడా? ఎప్పుడూ సైకిల్‌ తప్ప వేరే వాహనం ఎక్కరా? అంటే అదీకాదు. కేవలం లోక్‌సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయనకు సైకిల్‌ గుర్తుకుస్తుంది. ఈ పబ్లిసిటీ యావతో ఛస్తున్నాం…రా… బాబూ అంటూ సాటి ఎంపీలు లోలోపల సణుక్కుంటున్నారట. అయ్యగారి ప్రచార యావ అక్కడితో ఆగలేదండోయ్‌. సభలో తోటి టీడీపీ ఎంపీలు మాట్లాడుతున్నప్పుడు ఈయనగారు తన సీట్లో నుంచి లేచి వెళ్లి మరీ వాళ్ళ పక్కవ కూర్చుటారట. అలా ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళ పక్కన కూర్చుంటూ…. లోక్‌సభ మ్యూజికల్ ఛైర్స్‌ ఆడే వన్‌ అండ్‌ ఓన్లీ ఎంపీ ఈయనేనని చెవులు కొరుక్కుంటున్నారట. ఎందుకయ్యా ఆ విన్యాసాలన్నీ అంటే…. లైవ్ ఫ్రేమ్‌లో కనిపించేందుకు తంటాలు బాబూ… అన్నది ఎక్కువ మంది సమాధానం. ఇక సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఢిల్లీ వచ్చినప్పుడైతే…. ఎంపీగారి విన్యాసాల గురించి చెప్పే పనేలేదట. వాళ్ళు కేంద్ర మంత్రులను కలిసే సందర్భాల్లో సైతం తాను కెమెరాలో ప్రముఖంగా కనిపించేలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఫ్రేమ్‌ సెట్‌ చేసుకుంటారట విజయనగరం ఎంపీ. అధినేత పక్కనే నిలబడటం, ప్రతి ఫోటోలో వచ్చేట్లు జాగ్రత్త పడటంలాంటివాటన్నిటినీ చూస్తున్న మిగిలిన ఎంపీలు తలలు పట్టుకుంటున్నారట. ఆయనకు ఎవరన్నా చెప్పండ్రా నాయనా…. ఇక్కడ ఢిల్లీ వీధుల్లో పరువు పోతోందని జోకులేసుకుంటున్నట్టు సమాచారం. ఈయన వ్యవహారశైలిపై తాజాగా చంద్రబాబు కూడా సీరియస్‌ అవడంతో ఇకనన్నా తగ్గుతారా? లేక నాదారి నాదేనని అంటారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.