Site icon NTV Telugu

Off The Record : కడియం స్ట్రోక్ నుంచి బీఆర్ఎస్ తేరుకుందా..?

Kadiyam Srihari Otr

Kadiyam Srihari Otr

కడియం స్ట్రోక్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తేరుకుందా? వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా ఎవర్ని ఎంపిక చేయబోతోంది? ఇప్పుడు కొత్తగా తెర మీదికి వస్తున్న ఈక్వేషన్స్‌ ఏంటి? పార్టీ పరిశీలిస్తున్న పేర్లేవి? సామాజిక సమీకరణల లెక్కలు ఎలా ఉన్నాయి? మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య తిరిగి పార్టీలోకి వస్తారన్నది నిజమేనా? కడియం ఫ్యామిలీ ఇచ్చిన మాస్టర్‌ స్ట్రోక్‌తో మైండ్‌ బ్లాంక్‌ అయిన బీఆర్ఎస్‌… మెల్లిగా తేరుకుని వరంగల్‌ అభ్యర్థి ఎంపిక మీద దృష్టి పెడుతోందట. కడియం శ్రీహరి కుమార్తె కావ్య తప్పుకుని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతుండటంతో..

బలమైన కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ మొదలైంది. అంతే కాదు క్యాడర్‌లో జోష్‌ తీసుకువచ్చేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు నేరుగా వ్యవహారాన్ని పర్యవేక్షించబోతున్నట్టు తెలిసింది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆయనే నిర్వహించబోతున్నారట. ఆ మీటింగ్‌లోనే అభ్యర్థిని ఖరారు చేయవచ్చని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు. దీంతో పలు పేర్లు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ముందుగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న పేరు తెరపైకి వచ్చింది. అదే సమయంలో పార్టీకి రాజీనామా చేసి బ‌య‌ట‌కు వెళ్లిన మాజీ డిప్యూటీ సీఎం, క‌డియం శ్రీహ‌రికి చిర‌కాల రాజ‌కీయ ప్రత్యర్థి తాటికొండ రాజ‌య్య పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఆయన్ని తిరిగి బీఆర్ఎస్‌లోకి తీసుకువచ్చే యోచన కూడా ఉన్నట్టు తెలిసింది. పార్టీ ముఖ్యుడు ప‌ల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇప్పటికే రాజ‌య్యతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

ఇదే స‌మయంలో వ‌రంగ‌ల్ ఎంపీ అభ్యర్థిగా త‌మ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతూ తెలంగాణ‌ ఉద్యమ‌కారులు, మాజీ కార్పొరేట‌ర్లు కూడా క్యూ కడుతున్నారు. బోడ డిన్న, జోరిక ర‌మేశ్ తీవ్రంగా ప్రయ‌త్నం చేస్తున్నారు. వీరిద్దరు మొద‌ట్నుంచి క‌డియం కావ్య ఎంపిక‌ను బాహాటంగానే త‌ప్పుబ‌ట్టారు. పార్టీకి ఏమాత్రం సేవ చేయ‌ని కావ్యకు టికెట్ ఎలా ఇస్తారంటూ… ప్రశ్నించారు. ఆమెకు బదులు ఉద్యమ‌కారుల్లో ఒక‌రికి అవ‌కాశం క‌ల్పించాల‌నే డిమాండ్‌ను బ‌లంగా వినిపించారు. చివరికి అధిష్టానం కావ్యకే అవ‌కాశం క‌ల్పించ‌డంతో నారాజ్ అయ్యారు ఉద్యమకారులు. అయితే.. తాజాగా మారిన ప‌రిస్థితుల‌తో తిరిగి రేస్‌లోకి వచ్చేశారు. అలాగే హన్మకొండ జడ్పీ ఛైర్మన్‌ సుధీర్‌ కూడా ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటున్నారు. అయితే పార్టీ పెద్దలు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శన్‌రెడ్డి భార్య, వ‌రంగ‌ల్ రూర‌ల్ జడ్పీ ఫ్లోర్ లీడ‌ర్ పెద్ది స్వప్న పేరును సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. భిన్న కోణాల్లో ఆమె అభ్యర్థిత్వం పరిశీలనకు వచ్చినట్టు తెలిసింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, భర్త రెడ్డి, ఆమె ఎస్సీ సామాజికవర్గాలకు చెందినవారు కావడంతో…ఆ సమీకరణాలను కూడా లెక్కేస్తున్నట్టు తెలిసింది. మరో వైపు కడియం శ్రీహరికి బద్ద శత్రువని చెప్పుకునే రాజయ్య అయితే ఎలా ఉంటుందని కూడా అధిష్టానం పరిశీలిస్తోందట. కడియం సామాజిక వర్గానికే చెందిన వాడు కావడం, వరంగల్ పార్లమెంట్ స్థానంలో మాదిగల సంఖ్య ఎక్కువగా ఉండడం రాజయ్యకు కలిసొచ్చే అంశమన్న విశ్లేషణలున్నాయి. దీంతో రేస్‌లో రాజయ్య పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది.కడియం శ్రీహరి మీద కోపంతోనే రాజయ్య పార్టీ వదిలి వెళ్ళారు కాబట్టి…టికెట్ ఇస్తే ఖచ్చితంగా గుణపాఠం చెబుతారన్నది ఆయన వర్గం మాటగా వినిపిస్తోంది. రోగి కోరుకునేది, డాక్టర్‌ ఇచ్చేది ఒకే మందు అన్నట్టుగా… బీఆర్ఎస్‌ కావాలనుకుంటోంది, రాజయ్య రావాలనుకుంటున్నారు కాబట్టి ఆ ఈక్వేషన్‌ కూడా వర్కౌట్‌ కావచ్చన్నది పొలిటికల్‌ టాక్‌. చివరికి ఎవరి పేరు తెర మీదికి వస్తుందో చూడాలి మరి.

Exit mobile version