NTV Telugu Site icon

Off The Record : రసవత్తరంగా కడప జెడ్పి చైర్మన్ ఎన్నిక..ఒక్కొక్కరికి 25 లక్షల ఆఫర్.?

Ysrcp

Ysrcp

కడప జిల్లాలో జడ్పీటీసీలకు ఆఫర్ల మీద ఆఫర్లు….. బంపరాఫర్లు తగులుతున్నాయా? మీ పంట పండింది పోండి… ఇక పండగ చేస్కోండి… మంచి తరుణం మించిన దొరకదంటూ వాళ్ళని ఉద్దేశించి ఎందుకు అంటున్నారు? అసలు కడప జిల్లా పరిషత్లో ఏం జరుగుతోంది? జడ్పీటీసీలకు ఆఫర్స్‌ ఎందుకు వస్తున్నాయి? ఖాళీ అయిన కడప జిల్లా పరిషత్ చైర్మన్ సీటు దక్కించుకునేందుకు అటు టిడిపి ఇటు వైసీపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. జడ్పీలో టిడిపికి బలం లేకున్నా…వలసల్ని నమ్ముకుని రాజకీయం చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అసంతృప్తిగా ఉన్న వైసీపీ జడ్పిటిసిలకు వివిధ రూపాల్లో గాలం వేస్తున్నట్టు సమాచారం. ఇందులో వాస్తవావాస్తవాల సంగతి ఎలా ఉన్నా…ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల దాకా బంపరాఫర్‌ ఇచ్చినట్టు గుసగుసలాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. నియోజకవర్గ స్థాయి లీడర్లకు సైతం జడ్పిటిసిలతో వస్తే కూటమిలో తగిన ప్రాధాన్యత ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారట. అలాగే బద్వేల్ నియోజకవర్గంలో ఓ నేతకు రెండు కోట్ల ఆఫర్ వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. బద్వేల్ వైసీపీ ఇన్చార్జి పై అసంతృప్తిగా ఉన్న ఆ నేత కూటమి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి ఐదుగురు జడ్పిటిసిలు ఎన్డీఏ కూటమిలో చేరారు. రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం జడ్పిటిసి వైసీపీ నుంచి బిజెపిలో చేరారు. మరి కొంతమందిని టిడిపి లోకి రావాలంటూ చర్చలు జరుపుతున్నారట. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆకే పాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలవడంతో ఇక్కడ జడ్పీ చైర్మన్ స్థానం ఖాళీ అయింది. దీనితో పాటు ఒంటిమిట్ట జడ్పిటిసి పదవికి ఆయన రాజీనామా చేశారు. పులివెందుల జడ్పిటిసి చనిపోవడంతో రెండు జడ్పీటీసీ స్థానాలు ఖాళీ అయ్యాయి.

ఉమ్మడి కడప జిల్లాలో 50 జెడ్పిటిసి స్థానాలు ఉండగా ప్రస్తుతం వైసీపీకి 42 మంది సభ్యుల బలం ఉంది. అందులో పది నుంచి 12 మంది అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఇటీవల విజయవాడలో జెడ్పిటిసిలతో భేటీ అయ్యారు జగన్‌. ఆ సమావేశంలో బ్రహ్మంగారిమఠం జడ్పిటిసిని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారాయన. దీంతో అప్రమత్తమైన టిడిపి.. వైసిపి జడ్పిటిసిలకు గాలం వేస్తున్నట్టు సమాచారం. ఎన్డీఏ కూటమిలోకి వస్తే డబ్బుతో పాటు మండల స్థాయిలో పనులు కూడా ఇస్తామని ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారన్నది ఇంటర్నల్‌ టాక్‌. ఇది అధ్యక్షుడు జగన్‌ సొంత జిల్లా కావడంతో… వైసీపీ కూడా ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందట. మేమేం తీసిపోమన్నట్టు… తమ పార్టీ జడ్‌పీటీసీలు అయినా…. ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున అడ్వాన్స్ ఇస్తోందన్నది ఇంటర్నల్‌ టాక్‌. టిడిపి ఒక రేటు ఫిక్స్‌ చేశాక దానికి మించి ఇస్తామంటున్నట్టు తెలుస్తోంది.

అయితే… జగన్‌ సొంత ఇలాకాలో జడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకుని తమ బలం ఏమిటో చూపించాలని టిడిపి భావించడంతో వ్యవహారం రసవత్తరంగా మారుతోందని అంటున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో అత్యధికంగా ఏడు సీట్లను ఎన్డీఏ కూటమి గెల్చుకుంది. వైసీపీకి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలే మిగిలారు. అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకున్న ఎన్డీఏ జిల్లాలో అభివృద్ధి పనులు జరగాలంటే జిల్లా పరిషత్ ను కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న భావనతో ఆ దిశగా పావులు కదుపుతోందన్నది ఇంకో వెర్షన్‌. మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో జడ్పీటీసీల పంట పండిందని అంటున్నారు. జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత ఉందోగానీ… అదే నిజమైతే మాత్రం స్థానిక ప్రజా ప్రతినిధులకు బంపరాఫరేనన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ.