NTV Telugu Site icon

Off The Record : జనసేనలో ఏం జరుగుతుంది..? సీక్రెట్ సమావేశాలకు కారణం ఏంటి..?

Janasena Otr

Janasena Otr

ఏపీ కూటమిలో ఏదేదో జరిగిపోతోందా? జనసేన ఎమ్మెల్యేలు కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారా? సీక్రెట్‌ మీటింగ్‌ పెట్టుకుని మనకేంటీ ఖర్మ అంటూ… గోడు వెళ్ళబోసుకున్నారా? ఆ రహస్య సమావేశానికి ఓ మంత్రి కూడా హాజరయ్యారా? అసలు జనసేన ఎమ్మెల్యేల ఆవేదన ఏంటి? వాళ్ళు సీక్రెట్‌గా సమావేశం కావాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి జట్టు గట్టిగానే కనిపిస్తున్నప్పటికీ… కొన్ని సార్లు మాత్రం ఎక్కడో… తేడా కొడుతోందన్న టాక్‌ నడుస్తోంది రాజకీయవర్గాల్లో. సందర్భాన్ని బట్టి మూడు పార్టీల వైఖరులు మారుతున్నాయని, టీ కప్పులో తుఫాన్‌లా కనిపిస్తున్నా… ఒక్కోసారి మాటలు సీరియస్‌గా ఉండటాన్ని బట్టి చూస్తుంటే… సర్దుబాటు ధోరణి తగ్గుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గతంలో రెండు మూడు సందర్భాల్లో.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. అవసరమైతే హోం మంత్రిని అవుతానన్న ఆయన కామెంట్స్‌ అప్పట్లో కలకలం రేపాయి. తర్వాత తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి క్షమాపణ చెప్పారాయన. ఆ ఎపిసోడ్‌ తర్వాత కామ్‌గానే ఉన్నా…. సందర్భాన్ని బట్టి సొంత ప్రభుత్వం మీదే పవన్‌ సీరియస్‌ అవుతుండటంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే… జనసేన ఎమ్మెల్యేలు సీక్రెట్‌గా సమావేశమై పరస్పరం గోడు వెళ్ళబోసుకున్నారన్న ప్రచారం సంచలనం అవుతోంది. నియోజకవర్గాల్లో తమకు పనులు జరగట్లేదని, అధికారులు తమ మాట వినడం లేదని జనసేన ఎమ్మెల్యేలు కొంతమంది గోడు వెళ్ళబోసుకున్నారట. అసెంబ్లీ సమావేశాల ముగింపు సమయంలో విజయవాడలో ప్రత్యేకంగా సమావేశమై బాధ పంచుకున్నట్టు సమాచారం. పనులు జరక్కపోవడానికి, అధికారులు మాట వినకపోవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం నాయకులేనన్నది జనసేన ఎమ్మెల్యేల అభిప్రాయంగా తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యేలున్న కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి ఇన్ఛార్జ్‌లే పెత్తనం చేస్తున్నారని, అది శాసనసభ్యులకు ఇబ్బందిగా మారుతోందని చెప్పుకుంటున్నారు. పేరుకు ఎమ్మెల్యే అయినా… పరిస్థితి కష్టంగా ఉందని కొందరు వాపోయినట్టు తెలిసింది. అధికారులు మాట వినకుంటే ఇక జనంలో విలువేముంటుందని బాధపడ్డారట జనసేన ఎమ్మెల్యేలు.

ఏదో…. పవన్ సార్ కొన్ని సార్లు సీరియస్‌గా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ మాత్రం ఉందని, లేదంటే ఇంకెంత ఘోరంగా ఉండేదోనని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అన్నట్టు సమాచారం. పనుల కోసం చీటికి మాటికి తమ మంత్రులు నాదెండ్ల మనోహర్‌నో, లేక కందుల దుర్గేష్‌నో తీసుకెళ్లడం ఇబ్బందికరంగా ఉంటుందని, దీనికి ఏదో ఒక పరిష్కారం లేకపోతే గనుక కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నా లేనట్టేనన్న అభిప్రాయం వ్యక్తమైందట ఆ మీటింగ్‌లో. ఈ విషయాన్ని అవసరమైతే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నారట. పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టకుంటే సమస్యలు పరిష్కారం కావని కూడా మెజార్టీ జనసేన ఎమ్మెల్యేలు అభిప్రాయ పడ్డట్టు తెలిసింది.ఈ సీక్రెట్‌ మీటింగ్‌కు జనసేన కీలక మంత్రి కూడా హాజరైనట్టు తెలిసింది. ఆయన కూడా ఎమ్మెల్యేల బాధలన్నీ ఓపిగ్గా విన్నారని, చివరిగా పవన్ దృష్టికి తీసుకెళ్దామని ఆయనే అన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే సమయంలో ఇంకో వెర్షన్‌ కూడా వినిపిస్తోంది.జనసేనలో ఉన్న కొంత మంది ఎమ్మెల్యేల వైఖరిపై పవన్ సీరియస్ గా ఉన్నారట. వాళ్ళు గీత దాటుతున్నారంటూ ఆయన ఇబ్బందిగా ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో అసలు ఎమ్మెల్యేలు చెప్పే మాటల్ని పార్టీ అధ్యక్షుడు వింటారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట. తమ ఎమ్మెల్యేల మాట పవన్‌ వినడం, వినకపోవడం అన్నది జనసేన అంతర్గత వ్యవహారం. కానీ… కూటమిలో ఉండి, ఒక పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై చర్చించుకోవడం మాత్రం కీలక పరిణామమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ రహస్య సమావేశం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? ఎమ్మెల్యేల బాధలపై పవన్‌ ఎలా రియాక్ట్‌ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.