NTV Telugu Site icon

Off The Record : మేమిక్కడ.. మీరెక్కడ..? హిందూపురంలో ఏం జరుగుతుంది..?

Otr Ycp

Otr Ycp

మొన్నటి వరకు బాలయ్యా… నువ్వు ఎక్కడయ్యా..? అంటూ తెగ ర్యాగింగ్ చేశారు వైసీపీ లీడర్స్‌. కానీ ఇప్పుడదే సీన్‌ రివర్స్‌ అవుతోందట. వైసీపీ లీడర్స్‌ టార్గెట్‌గా రివర్స్ పంచ్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. మేమిక్కడ… మీరెక్కడ అంటూ ట్రోల్‌ చేస్తున్నారట. ఇంతకీ ఏం జరుగుతోంది హిందూపురంలో. కొత్తగా వచ్చిన మార్పేంటి? నోరుందికదా అని ఏదిపడితే అది మాట్లాడకు రా… నాయనా… రేపు అది మనకు కూడా తగలొచ్చంటుూ జాగ్రత్తలు చెబుతుంటారు పెద్దలు. ఇప్పుడు ఇవే మాటల్ని రిపీట్‌ చేసుకుని మరీ వింటున్నారట హిందూపురం వైసీపీ లీడర్స్‌. ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ వరుసగా మూడుసార్లు గెలిచారు. హ్యాట్రిక్ విజయంతో మంచి జోష్ మీదున్నారు బాలయ్య. ఈ క్రమంలో అంతకు ముందు బాలయ్య మీద హిందూపురం వైసిపి నాయకులు చేసిన ట్రోల్స్, విమర్శలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. అప్పట్లో బాలకృష్ణ నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని, అంతా పీఏల పాలన జరుగుతుందని, అసలాయన గెస్ట్‌ లీడర్‌ అంటూ విపరీతంగా ట్రోల్‌ అయ్యారు. కానీ.. జనంలో మాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారన్న ఫీలింగ్‌ ఉందట. ఆ ఎఫెక్ట్‌తోనే వరుసగా మూడోసారి గెలిచారాయన. అయితే ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా జరిగాయి. బాలకృష్ణని గతంలో ఎప్పుడూ లేనివిధంగా టార్గెట్ చేశారు వైసీపీ లీడర్స్‌. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు.. ఆయన ఏరోజైనా హిందూపురంలో ఉన్నారా..? మీకు అందుబాటులో ఉంటారా..? అంటూ ఓటర్లలో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. కానీ… చివరికి పోలింగ్‌ బూత్‌లో బాలయ్య వైపే మొగ్గారు జనం. పైగా మెజార్టీ కూడా పెరిగింది. 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో బాలకృష్ణ ఎక్కువ మెజార్టీతో గెలిచారు. ఈసారి 14, 19 కంటే డబల్ మెజారిటీ దాటి హ్యాట్రిక్ కొట్టారాయన.

ఓవైపు వైసీపీపై ఉన్న వ్యతిరేకత, మరోవైపు బాలకృష్ణ గ్రాఫ్ ఏమాత్రం తగ్గకపోవడంతోనే ఈ విజయం సాధ్యమైందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆ గెలుపు తర్వాత స్థానిక వైసీపీ నాయకులు పూర్తిగా షాక్‌తిన్నారట. ప్రస్తుతం ఇక్కడ ఇన్చార్జిగా కురుబ దీపిక ఉన్నారు. మరోవైపు కీలక నేతగా నవీన్ నిశ్చల్ పనిచేస్తున్నారు. హిందూపురంలో బాలకృష్ణని అటాక్ చేయడంలో ముందుంటారు నిశ్చల్‌. పైగా ఇప్పుడు ఆయన శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీపిక దాదాపు తొమ్మిది నెలలపాటు హిందూపురం ఇన్చార్జిగా కొనసాగి బాలకృష్ణ పై పోటీ చేసి ఓడిపోయారు. కానీ… ఓటమి తర్వాత ఈ నేతలంతా ఇప్పుడు నియోజకవర్గం నుంచి మాయమైపోయారట. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి.. అప్పటినుంచి హిందూపురం వైసీపీ ఇన్చార్జిగా ఉన్న కురుబ దీపిక కాని, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నవీన్ నిశ్చల్‌గానీ పూర్తిగా స్తెలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారట. అటు బాలకృష్ణ ఇప్పటికే పలుమార్లు హిందూపురం వచ్చి వెళ్లారు. ప్రజలుక అందుబాటులో ఉంటున్నారట. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఇప్పటివరకు యాక్టివ్‌ కాలేదంటున్నారు స్థానికులు. ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం తప్ప కనీసం కార్యకర్తల్ని కూడా పలకరించిన పాపాన పోలేదట. కురుబ దీపిక ప్రస్తుతం బెంగళూర్‌కే పరిమితమయ్యారు. ఆమె భర్త మాత్రం అప్పుడప్పుడు హిందూపురంలో కనిపిస్తున్నారు. ఇలా వైసీపీ నాయకులంతా ప్రస్తుతం హిందూపురానికి చుట్టాలైపోయారని ట్రోల్‌ చేస్తున్నారు టీడీపీ లీడర్స్‌. దీంతో నాడు బాలకృష్ణ మీద చేసిన ట్రోల్స్‌ నేడు వైసీపీకి రివర్స్ అయ్యాయన్న టాక్‌ నడుస్తోంది నియోజకవర్గంలో.