NTV Telugu Site icon

Off The Record : దువ్వాడ ఇంటిపోరు YCP పార్టీని బజారున పడేసిందా?

Duvvada Otr

Duvvada Otr

ఎద్దులు కుమ్ములాటలో లేగదూడలు బలైనట్లు ..ఈ సామెత టెక్కలి వైసిపి కార్యకర్తలకు సరిపోతుంది. నేతల మధ్య గ్రూపుల గోల ఎన్నికల్లో పరాజయం పాలు చేస్తే.. దువ్వాడ ఇంటి పోరు నేడు పార్టీని బాజారున వేసిందట. దీంతో తమ భవిష్యత్ ఏంటని ఆందోళన చెందుతున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో దువ్వాడ శ్రీనివాస్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రజా జీవితంలో ఒటమి తప్ప గెలుపు రుచి చూడని నేత. స్దానిక సంస్దలు మినహా పోటీ చేసిన ప్రతి ఎన్నికలో పరాజయం మూట కట్టుకున్నారు. టిడిపికి వ్యతిరేకంగా సుధీర్ఘ కాలం రాజకీయాలు చేశారు. రాజకీయంగా ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. కొన్ని పరిపక్వతలేని నిర్ణయాలతో పార్టీలు మారారు. కాంగ్రెస్ , ప్రజారాజ్యం , టిడిపి , వైసిపి ఇలా అన్ని చోట్ల కాలుపెట్టి వచ్చేసారు. స్వపక్షంలో విపక్షంగా ఉండటంతో.. కాంగ్రెస్ హయంలో తృటిలో పదవులు చేజారాయి.

ఎంత లేదన్నా, ఎవరు కాదన్నా నేడు దువ్వాడ శ్రీనివాస్ అనుభవిస్తున్న రాజకీయ జీవితానికి నేపథ్యం భార్య వాణి తండ్రి సంపతరావు రాఘవరావు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు రాఘవరావు, వాణి. చరిష్మా, దూకుడు ఉన్న ఇల్లరికం అల్లుడు దువ్వాడ శ్రీనును ప్రోత్సహించింది రాఘవరావు కుంటంబం. తాము సాధించలేని విజయం దక్కించుకుంటారని ఆశించారు. ప్రత్యర్థులుగా బలమైన కింజరపు ప్యామిలీ ఉండటం , వైసిపిలో గ్రూపు రాజకీయాలు వెరసి వరుస ఓటములు చవిచూశారు దువ్వాడ. పేరాడ తిలక్ , దువ్వాడ శ్రీనివాస్ , మాజీ కేంధ్ర మంత్రి కిల్లి కృపారాణి ఒకే ఒరలో ఇమడలేక ఇబ్బందులు ఎదుర్కోంది పార్టీ. టెక్కలిలో కాలింగ సామాజికవర్గానికి చెందిన ఈ ముగ్గురు నేతలు.. టిక్కెట్ల కోసం సిగపట్లు పడ్డారు. కారాణాలు ఏమైనా ఓటమి మూటగట్టుకోవడం దువ్వాడకు పరిపాటిగా మారింది. అంతా సవ్యంగా ఉందనుకున్నా.. భస్మాసుర హస్తం మాదిరి దువ్వాడ వ్యవహారం కూడా ఎన్నికలలో బెడసికొట్టేది. క్యాడర్ పై రుసరుసలు, గ్రూపులను కలుపుకుపోలేని వైఖరి ఆయనకు మైనస్ గా మారేది.

వైఎస్సాఆర్ పార్టీ ఆవిర్భావం తరువాత దువ్వాడ శ్రీనివాస్ మరింత ఫోకస్‌ అయ్యారు. అచ్చెన్నాయుడిపై ఒంటికాలితో లేవడం, నాటి సిఎం జగన్ పై ఎవరు విమర్శలు చేసినా విరుచుకుపడటంతో వైసీపీలో కీలక నేతగా పేరుపడ్డారు దువ్వాడ. వైసిపి లీడర్స్, క్రీయాశీలక కార్యకర్తలలో దువ్వాడ అంటే ఓ పైర్ బ్రాండ్ . కానీ జనాలలో మాత్రం ఆయన వైఖరి, తిట్లపురాణం పాపులర్‌ అయ్యాయి. ఇప్పడు ప్యామిలీ ఇష్యూలో మరింతగా పరువు రోడ్డున పడింది. దీంతో చాలాకాలంగా దువ్వాడ, వాణిలను నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకల మాదిరి తయారైందట. కరవ మంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకి కోపం చందాన ఫ్యామిలీలో ఎవరి ఇగోలకు వారు పోతున్నారు. మాధురి ఎంట్రీతో తాము బజారున పడ్డామంటున్నారట కార్యకర్తలు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామంటున్నారు దువ్వాడ ఫ్యామిలీ అనుచరులు. సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా దువ్వాడ వెనుక ఉండటంతో.. కింజరపు కుటుంబానికి టార్గెట్ గా నిలిచిపోయామంటున్నారు. దువ్వాడ వెంట దశాబ్దాలుగా ఉన్న తమకు.. ఇప్పుడు జరగుతున్న పరిణామాలు తల దించుకునేలా చేసాయంటూ మదనపడుతున్నారట. పెళ్లియై.. భార్య బిడ్డలు ఉన్న దువ్వాడకు లేటు వయసులో ఈ ఘాటు ప్రేమలేంటో అర్దం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అధికారంలో ఉన్నప్పుడు.. జిల్లా నేతలతో పోసగని దువ్వాడ.. గత ఐదేళ్లలో కార్యకర్తలు , స్దానిక నేతలకు చేసింది శూన్యం అంటున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌కు ఇంకా దాదాపు మూడేళ్ల పదవీకాలం ఉంది. అలాంటిది ఆయన కుటుంబ సమస్యలను పరిష్కరించుకొని కార్యకర్తల గురించి ఆలోచించాల్సింది పోయి.. అనవసరంగా అన్‌పాపులర్‌ కావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు.