NTV Telugu Site icon

Off The Record : ఆ నాయకుడు రాజకీయాలకు స్వస్తి చెప్పేశారా..?

Dharmana Prasad Rao

Dharmana Prasad Rao

ఆ సీనియర్ నేత తీరు సొంత పార్టీ నేతలకే అర్ధం కావడం లేదట. ఎన్నికల ఫలితాల వచ్చాక ఎవ్వరికీ అందుబాటులో లేరు సరికదా… ఇప్పుడసలు రాజకీయాల్లో ఉంటారా? లేక ఆల్రెడీ పెట్టేబేడా సర్దేసుకున్నారా అన్న డౌట్స్‌ వస్తున్నాయి. సొంత కేడర్‌కు సైతం కనిపించడం లేదు, గతంలో తాను నిర్వహించిన శాఖపై తీవ్ర ఆరోపణలు వచ్చినా స్పందించడం లేదు. ఇంతకీ ఏంటాయన అంతరంగం? ఎవరా మాజీ మంత్రి? వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అంతరంగం ఏంటో అర్థంగాక సతమతం అవుతున్నారట ఆయన సన్నిహితులు. ఎన్నికల ఫలితాలు వచ్చి, కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు కావస్తున్నా…బయట ఎక్కడా ఆయన కనిపించడం లేదు. ప్రభుత్వ వ్యవహారాల మీద ఎక్కడా స్పందించడం లేదు. టీడీపీ ప్రభుత్వం రద్దు చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ ప్రధానంగా గతంలో తాను నిర్వహించిన శాఖ పరిధిలోనిదే అయినా… ప్రసాదరావు నోరు మెదపకపోవడం ఏంటో అంతుబట్టడం లేదట వైసీపీ శ్రేణులకు. గతంలో కార్యకర్తలు, నేతలతో కళకళలాడిన ధర్మాన క్యాంపు కార్యాలయం ఇప్పుడు మూతపడింది. ఎప్పుడూ రాకపోకలతో హడావిడిగా కనిపించే మాజీ మంత్రి ఇల్లు సైతం ఇప్పుడు బోసిపోతోందంటున్నారు. అటు ఆయన మీద గెలిచిన యువ ఎమ్మెల్యే గొండు శంకర్ అవాహయామి అంటూ… వైసీపీ క్యాడర్ ను కలుపుకుపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే వైసిపి‌ హయాంలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపుతున్నారట. అయినా సరే..మాజీ మంత్రి నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించుకుంటున్నారట వైసిపి నేతలు.

పది కిలోమీటర్లు రోడ్డు వేయలేక పోయారనడంతోపాటు స్టేడియం నిర్మాణంపై కూడా కూటమి నేతలు మాటల తూటాలు పేలుస్తున్నా… స్పందించడం లేదు ధర్మాన. ఇప్పుడు సిక్కోలు వైసీపీలో ఇదే హాట్‌ సబ్జెక్ట్‌ అయింది. ఈ క్రమంలో అంతకు ముందు ఆయన అన్న మాటల్ని గుర్తు చేసుకుంటున్నారట. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి లేదని , రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని గత ఎన్నికల సభలు, సమావేశాల్లో సెలవిచ్చారు ధర్మాన. జగన్‌ బలవంతంతోనే రాజకీయాల్లో ఉన్నానని కూడా చెప్పారట ఆయన. ఆ క్రమంలో జిల్లాలో భారీ తేడాతో ఓడిపోయింది కూడా ఆయనే. ఆ స్థాయి ఓటమి ప్రసాదరావులో నైరాశ్యం నింపిందా లేక ప్రత్యక్ష రాజకీయాలకు శాశ్వతంగా దూరం కావాలని నిర్ణయించుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. దీంతో ఏం చేయాలో అర్ధంగాక కేడర్‌ గందరగోళంలో ఉందట. మరోవైపు అధికారం ఉంటే తప్ప ధర్మాన ప్రసాదరావు బయటకు రారన్న టాక్‌ కూడా ఉంది. ఘోర పరాజయం పాలైన పార్టీకి… సీనియర్‌గా తన అనుభవం ఉపయోగించి రిపేర్‌ చేయాల్సిన ప్రసాదరావు ఇలా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్ళడం ఏంటో అర్ధంగాక తలలు పట్టుకుంటున్నారట స్థానిక నాయకులు. పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించి ఓడిపోయాక ఇలా నాకేం పట్టదన్నట్టు ముఖం చాటేసి ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా అన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి వైసీపీ కేడర్‌ నుంచి. తన ఇంటికి కూతవేటు దూరంలోనే పార్టీ కొత్త ఆఫీసు ఉంది. ఆక్రమణలు అంటూ ఆ ఆఫీస్‌కు నోటీసులు అంటించినా నోరు మెదపలేదు మాజీ మంత్రి. దీంతో ఆయన అసలు రాజకీయాల్లో కొనసాగుతారా? ఇప్పటికే చాలాఎక్కువ చేసేశాం… ఇక చాలు అనుకుంటూ శాశ్వతంగా రాజకీయాలకు స్వస్తి అంటారా అన్నది హాట్‌ టాపిక్‌ అయింది శ్రీకాకుళం రాజకీయవర్గాల్లో.

Show comments