లక్షలాది ధరణి దరఖాస్తులు తిరస్కరణకు గురికావడానికి కారణం ఏంటి? ధరణిపై వస్తున్న ఆరోపణలు దృష్టిలో పెట్టుకుని అధికారులు కావాలనే తిరస్కరిస్తున్నారా? ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా దరఖాస్తులు పరిష్కారం కాకపోవడంతో.. ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ధరణి దరఖాస్తుల విషయంలో ఏమి జరుగుతోంది? తెలంగాణలో ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ధరణి పెండింగ్ దరఖాస్తులు దాదాపు 5 లక్షల వరకు.. తహసీల్దార్‌ల నుంచి కలెక్టర్‌ల వరకు తిరస్కరించగా, ప్రస్తుతం అదే వైఖరిని రెవెన్యూ అధికారులు కొనసాగించడం విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుతం చాలా జిల్లాలోనూ ధరణి పెండింగ్ దరఖాస్తులను అకారణంగా తిరస్కరిస్తున్నట్టు సిసిఎల్‌ఏకు, ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. రెండునెలలుగా ఇదే విషయమై సిఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిసిఎల్‌ఏ అధికారులు, రెవెన్యూ అధికారులు పలు సూచనలు చేశారు. ధరణి దరఖాస్తులను ఏ కారణంతో తిరస్కరించారో కూడా చెప్పాలని ఆదేశాలు జారీ చేసినా రెవెన్యూ అధికారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల విషయంలోనూ రెవెన్యూ అధికారులు అదే వైఖరిని అవలంభిస్తున్నారని.. కనీసం రైతులకు సమాచారం ఇవ్వడం లేదని పలు జిల్లాలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఈనెల15వ తేదీ లోపల ధరణి దరఖాస్తులు పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆర్డర్స్‌ను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ధరణిలో సుమారు రెండు లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 16వ తేదీన కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి.. ధరణి సమస్యలపై సమీక్షించారు. అంతకముందు రెండుసార్లు ధరణి సమస్యలపై సిఎం సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆగస్టు 15 నాటికి దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. త్వరితగతిన వాటిని క్లియర్ చేయాలన్న ఉద్ధేశ్యంతో.. అధికారులు వాటిని పరిశీలించకుండానే తిరస్కరిస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి.
దాదాపు రెండులక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. ఇందులో తహసీల్దార్ల వద్ద 53,800, ఆర్డీఓల వద్ద 38,950, అదనపు కలెక్టర్ల వద్ద 45,536, కలెక్టర్ల వద్ద 35,966 పరిష్కారం కావాల్సిన దరఖాస్తులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో 28,498, వికారాబాద్ కలెక్టరేట్ పరిధిలో 10,980, సంగారెడ్డి జిల్లాలో 10,943, నల్గొండ జిల్లాలో 7702, యాదాద్రి భువనగిరిలో 5,648, ఖమ్మంలో 5,584, నాగర్ కర్నూల్లో 5,544 లెక్కన ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇందులో చాలావాటిని తహసీల్దార్‌లు తిరస్కరించడంతో పాటు కనీసం వాటిని ఎందుకు తిరస్కరిస్తున్నారో కూడా కారణం తెలపలేదని తెలుస్తోంది. జిల్లాల పరిధిలో ప్రతిరోజు వెయ్యికిపైగా భూ సమస్యలు పరిష్కారం అవుతుండగా.. దాదాపు 600 వరకు కొత్తగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు అధికారులకు వస్తున్నాయి. కొందరు కలెక్టర్లు కూడా భూ సమస్యల పరిష్కార విషయంలో జాప్యం చేస్తుండడం వల్లే.. పెండింగ్ దరఖాస్తులు ఆలస్యం అవుతున్నట్లుగా తెలిసింది. మండల స్థాయిలో దరఖాస్తుల పెండింగ్‌కు.. రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేయకపోవడం, పనిఒత్తిడి కారణాలుగా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్లకు నివేదిక అందించకపోవడం.. ప్రభుత్వం ఇచ్చిన గడువు కారణంగా.. ఏదో విధంగా తహసీల్దార్‌లు తిరస్కరిస్తున్నట్టు తెలుస్తోంది.
