NTV Telugu Site icon

Off The Record : తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న వలసలు

Congress Otr

Congress Otr

మీరు క్యూలో ఉన్నారు…. దయచేసి కొద్ది రోజులు వేచి ఉండండి. మళ్ళీ ప్రయత్నించాలంటే మీకు అవకాశం దొరక వచ్చు, దొరక్కపోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు వినిపిస్తున్న ఫోన్‌ సందేశాలివి. ఎప్పుడు ఎవరు జంప్‌ చేస్తారో…. ఏ టైంలో కండువా మార్చేస్తారోనన్నంత ఉత్కంఠగా మారాయి పరిస్థితులు. ఇంతకీ గాంధీభవన్‌ క్యూలో ఉన్న ఆ గులాబీ ఎమ్మెల్యేలు ఎవరు? కొందరి విషయంలో వస్తున్న అభ్యంతరాలేంటి? బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వరుబెట్టి కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. ఎవరు ఎప్పుడొచ్చి ఠక్కున కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే… అసలీ వలసల పర్వం ఎందాకా వెళ్తుందోనని ఉగ్గబట్టి… ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇటు కాంగ్రెస్ కూడా వస్తున్నవాళ్ళందర్నీ.. వ్యూహాత్మకంగా ఎలాంటి షరతులు లేకుండా చేర్చుకుంటోంది. అదే సమయంలో సొంత సమస్యలకు పరిష్కారం చూపడానికి సిద్ధంగా ఉందట. కానీ ఆర్థికంగా పార్టీ నుంచి సాయం చేసే పరిస్థితి మాత్రం లేదంటున్నారు. అదే సమయంలో రాజకీయంగా బీఆర్‌ఎస్‌ని గట్టి దెబ్బ కొట్టాలన్న పట్టుదలగా ఉన్నారట సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కొందరు, కూలుస్తామని మరి కొందరు గులాబీ నేతలు ఇచ్చిన స్టేట్మెంట్స్‌నే ఆయుధంగా మలుచుకుని ఆయన చేరికలకు తెర తీశారన్నది కాంగ్రెస్‌ వర్గాల మాట. ఇప్పటికే 9 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా మరో 10 మంది క్యూలో ఉన్నారట.

ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద ప్రధానంగా ఫోకస్ చేసింది కాంగ్రెస్. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ రూట్‌లోనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీటితోపాటు మరో ఇద్దరి పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి.. అయితే కాంగ్రెస్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే చేరికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్‌ని మోసం చేసి పోయిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం సరికాదన్న వాదన వినిపిస్తోందట. దీనికి తోడు ఎల్బీనగర్ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి ఉన్నారు. జగిత్యాల చేరిక విషయంలోనే రచ్చ జరిగిన క్రమంలో ఎల్బీనగర్‌ సుధీర్ రెడ్డిని చేర్చుకొని మరో రచ్చ కొని తెచ్చుకుంటారా అనే చర్చ కూడా జరుగుతోంది కాంగ్రెస్‌ వర్గాల్లో. సిఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు వెళ్లి కలిశారు. అది కూడా కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌కి చెందినవారు కావడంతో అప్పట్లో చర్చ జరిగింది. పార్టీ మార్పును అప్పట్లో సదరు ఎమ్మెల్యేలు ఖండించినా… ప్రస్తుతం వాళ్ళ చేరిక దాదాపు ఖరారైనట్టు ప్రచారం ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు క్యూలో ఉన్నారన్నది పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. మహిపాల్ రెడ్డి చేరిక ఫైనల్ అయిందని, మిగిలిన ముగ్గురు క్యూ లో ఉన్నారన్నది సమాచారం. చేరడం ఖాయమేగానీ…ఎప్పుడన్నది క్లారిటీ రావాల్సి ఉందంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. ఇదంతా చూస్తున్నవాళ్ళు మాత్రం మీరు క్యూలో ఉన్నారు….. దయచేసి వేచి ఉండండి. యు ఆర్‌ ఇన్‌ క్యూ… ప్లీజ్‌ వెయిట్‌ అంటూ సెటైర్స్‌ వేస్తున్నారు. ఈ సెటైర్స్‌ సంగతి ఎలా ఉన్నా… పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదేనంటూ చమత్కరిస్తున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.