NTV Telugu Site icon

Off The Record : కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా.. అక్కడ కార్యకర్తలను నడిపించే దిక్కే లేదా?

Otr Congress

Otr Congress

అక్కడ కాంగ్రెస్‌ పార్టీకి లీడర్స్‌ ఫుల్లుగా ఉన్నారు. కానీ… కేడర్‌ని నడిపే దిక్కు మాత్రం లేదు. నలుగురు నాయకులు పార్టీ టిక్కెట్‌ కోసం పోటీలు పడ్డారు. కానీ… ఇప్పుడు వాళ్ళలో ఒక్కరూ కనిపించడం లేదు. పైగా అప్పట్లో హంగామాగా ఎవరికి వారు ఓపెన్‌ చేసిన ఆఫీస్‌ల అడ్రస్‌లు ఇప్పుడు గల్లంతైపోయాయి. పార్టీ పవర్‌లో ఉన్నా…. అక్కడ ఎందుకా పరిస్థితి ఉంది? అసలేదా సెగ్మెంట్‌? కాంగ్రెస్‌ పార్టీకి మొదట్నుంచి కంచుకోట భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం. అడపా దడపా ఓడిపోయినా… స్వయంకృతాలవల్లేనని అంటారు. కాంగ్రెస్‌కు లెఫ్ట్‌తో పొత్తు కుదిరితే చాలు… ఈ సీటు వదులుకోవాల్సిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. పొత్తులో భాగంగా సిపిఐకి వెళ్ళిపోయింది కొత్తగూడెం సీటు. ఊహించినట్టుగానే గెలిచి పాగా వేసింది కమ్యూనిస్ట్‌ పార్టీ. అంతేకాదు… ఇక పాతుకు పోయేందుకు ప్లాన్‌ చేస్తోందట. నిన్నటి వరకు మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడెం ఇప్పుడు కార్పొరేషన్‌ అయింది. దానితో పాటు మెజార్టీ పంచాయితీల్లో ఆధిపత్యం కోసం పావులు కదుపుతోందట సీపీఐ. దీంతో ఇక్కడ మళ్లీ కాంగ్రెస్‌కు పుట్ట గతులు ఉంటాయో లేదోనని కేడర్‌ కంగారు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ముందుకొచ్చి పార్టీ బాధ్యతల్ని భుజానికెత్తుకునే నాయకుడు కనిపించడం లేదట. ఎన్నికలకు ముందు మేమంటే మేమంటూ టిక్కెట్‌ కోసం పోటీలు పడ్డ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తలో దిక్కుకు వెళ్లిపోయారట. వారంతా పార్టీ మారకున్నా… అంత యాక్టివ్‌గా లేరు. అప్పట్లో టిక్కెట్‌ కోసం పోటీ పడ్డ నలుగురు నాయకులు నాలుగు కాంగ్రెస్ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ కొత్తగూడెం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనకు భట్టి విక్రమార్క ఆశీస్సులున్నట్టు చెప్పుకున్నారు. పొత్తులో కుదరకపోవడంతో ఇప్పటికీ ఏదో ఒక కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారాయన. ఇకపోతే ఇక్కడ పార్టీనే నమ్ముకుని మొదటి నుంచి కార్యక్రమాలు చేపట్టిన మోతుకూరి ధర్మారావు అడపా దడపా కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతకు మించి అధికార పార్టీ నాయకుడి తీరులో ఉండటంలేదని అంటున్నారు. ఈయన కూడా అప్పట్లో టిక్కెట్‌ ప్రయత్నాలు గట్టిగానే చేశారు. ఇకపోతే మరో బీసీ నేత నాగ సీతారాములు సైతం సీటు ఆశించి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఇప్పుడు ఆయన ఆఫీస్‌ మూసేసి పొంగులేటి క్యాంపు కార్యాలయానికి అందుబాటులో ఉంటున్నారట. ఇకపోతే మరోనేత యడవెళ్లి కృష్ణ గత నాలుగు విడతల నుంచి ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా మొన్న సొంతగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం ఆ ఆఫీస్‌ కూడా కనిపించడం లేదు. వనమా వెంకటేశ్వరరావుకు తోడల్లుడైన యడవెల్లి కృష్ణ గతంలో పీఆర్పీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసిపి నుంచి సీటు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ ట్రయల్స్‌ కోసం ఆయన పెట్టిన ఆఫీస్‌ కూడా ఇప్పుడు మాయమైంది. ఇలా… ఇంతమంది నాయకులతో అప్పుడు కళకళలాడిన కొత్తగూడెం కాంగ్రెస్‌ ఇప్పుడు వెలవెలబోతోంది. ఇక్కడ ఇప్పుడు డిసిసి కార్యాలయం మాత్రమే దిక్కు అయ్యింది. పార్టీ ఆఫీస్‌కు ఎవ్వరు ఎప్పుడు వస్తారో అర్ధం కాని పరిస్థితి. అడపా దడపా మాత్రమే అందరు నేతలు ఈ డిసిసి కార్యాలయానికి వస్తున్నట్టు చెబుతోంది కేడర్‌. ఇకపోతే.. ఈ కార్యాలయానికి తోడుగా మంత్రి పొంగులేటి కార్యాలయం ఉంది. మంత్రి వచ్చిన సందర్బంగా నేతలు వచ్చి పోతుంటారు. కొసమెరుపు ఏమిటంటే ఎన్నికల ముందు కలెక్టర్ కార్యాలయం ముందు , బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ధర్ానలకు కాంగ్రెస్ కు పిలుపు నిస్తే నలుగురు నాలుగు టెంట్ లు వేసి నిరసనలు కార్యక్రమాలు చేసే వారు.. కానీ ఇప్పుడు సిపిఐ కి సీటు ఇచ్చి గెలిపించిన తరువాత ఆ కాస్త హడావిడి కూడా కనిపించడం లేదు.