Site icon NTV Telugu

Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

Congress

Congress

కేక్‌ కోసం కాంగ్రెస్‌ నాయకులు కొట్టుకున్నంత పని చేశారా? ఏకంగా జిల్లా పార్టీ ఆఫీస్‌లోనే రచ్చ రంబోలా అయిందా? మేటర్‌ ముదిరి ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌, సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసుకునేదాకా వెళ్లిందా? ఏ జిల్లాలో జరిగిందా విచిత్రమైన గొడవ? అందుకు కారణం కేవలం కేకేనా? లేక అంతకు మించి ఉందా? నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు , రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్​​ ఛైర్మన్​ మానాల మోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు రచ్చ కెక్కింది. అదీ కూడా… అలాఇలా కాదు…కాంగ్రెస్ భవన్ సాక్షిగా రెండువర్గాలు చెలరేగిపోయాయి. నిజామాబాద్ డీసీసీ ఆఫీస్‌లో కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. అదే సమయంలో.. జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి వర్గీయులు.. ఆయన పుట్టిన రోజు వేడుకల్ని పార్టీ ఆఫీస్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేశారట. కటింగ్‌ కోసం కేక్ కూడా తెప్పించారు. అంతా ఓకే అనుకునే టైంకి అక్కడికి వచ్చిన ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి… పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల జన్మదిన వేడుకలు మాత్రమే నిర్వహించాలంటూ మాజీ ప్రెసిడెంట్‌ మనుషుల్ని అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జన్మదిన వేడుకలు మాత్రమే పార్టీ ఆఫీస్‌లో నిర్వహించాలని హుకుం జారీ చేశారట. దీంతో చిర్రెత్తుకొచ్చిన మోహన్ రెడ్డి వర్గీయులు.. వాదనకు దిగడంతో… మాటా మాటా పెరిగి.. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరింది గొడవ.

అయినా సరే… వెనక్కి తగ్గని మానాల అనుచరులు.. నగేష్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లగానే.. కాంగ్రెస్ కార్యాలయంలోనే తమ నాయకుడి బర్త్‌డే కేట్ కట్‌ చేశారు. దీంతో నామాటనే పట్టించుకోరా… అంటూ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణ, కేట్ కటింగ్ చేసిన ఎన్.ఎస్.యు.ఐ. నేతలు వేణురాజ్, సాయికుమార్, నరేన్ దీప్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు డీసీసీ ప్రెసిడెంట్‌. కానీ… రాతపూర్వక ఉత్తర్వుల్లో మాత్రం ఏకంగా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఉండటంతో మోహన్ రెడ్డి వర్గం షాకైంది. తన అనుచరులను అలా ఎలా బహిష్కరిస్తారంటూ…. మోహన్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. దాంతో… నిజామాబాద్‌ కాంగ్రెస్ భవన్ వివాదం కాస్తా.. హైదరాబాద్‌ గాంధీ భవన్‌కు చేరింది. ఇప్పుడు ఈ కేక్ కటింగ్ గోల గురించి హస్తం పార్టీలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోందట. పార్టీ ఆఫీస్‌లో జరుగుతున్న యూత్ కాంగ్రెస్ కార్యక్రమ నిర్వహణకు ఆటంకం కల్పిస్తూ..బర్త్ డే వేడుకలు నిర్వహించారని, అందుకే చర్యలు తీసుకున్నారన్నది డీసీసీ అధ్యక్షుని వర్గం వాదన. కానీ… మాజీ డీసీసీ అధ్యక్షుడు మాత్రం తన వర్గీయులను పార్టీ నుంచి బహిష్కరించడంపై గుర్రుగా ఉన్నారట. పీసీసీకి ఫిర్యాదుతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి డీసీసీ అధ్యక్షునిపై కంప్లయింట్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అటు ఇద్దరు నేతలు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి అనుచరులు కావడంతో ఆయన సైతం సముదాయిస్తున్నట్టు తెలిసింది. ఇటు పీసీసీ, అటు ఏఐసీసీ నేతలు సైతం కేక్ పంచాయతీ పై ఆరా తీసినట్టు తెలిసింది. అయితే ఈ గొడవకు కేక్‌ కటింగ్‌ ఒక్కటే కారణం కాదని, బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ వేరే ఉందని అంటున్నారు.

కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోహన్ రెడ్డి డీసీసీ అధ్యక్షునిగా 9 ఏళ్లు పనిచేశారట. అధికారంలోకి వచ్చాక కూడా ఆయనే కొనసాగినా…. ఇటీవలి మార్పుల్లో భాగంగా నగేష్ రెడ్డిని నియమించారు. డీసీసీ అధ్యక్షునిగా మోహన్ రెడ్డి ఉన్న సమయంలో.. తన వర్గీయులకు ప్రాధాన్యం ఇవ్వలేదని, పైగా… అణగదొక్కారని కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వలేదని నగేష్ రెడ్డి లోలోపల రగిలిపోతున్నారు. అలా… ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందట. అదే కేక్ కటింగ్ రూపంలో వీధికెక్కిందన్నది నిజామాబాద్‌ కాంగ్రెస్‌ వాయిస్‌. ఇద్దరి మధ్య పెరిగిపోయిన ఇగో ఫీలింగ్ కూడా గొడవలకు కారణమన్న అభిప్రాయం ఉంది.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. సొంత జిల్లాలో జరుగుతున్న ఈ పరిణామాలు ఎటువైపుకు దారితీస్తాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది కాంగ్రెస్‌ వర్గాల్లో. మానాల మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి వర్గీయుడన్న పేరుంది. ఇటు డీసీసీ అధ్యక్షుడు నగేష్ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కు సన్నిహితుడు. రెండు బలమైన శక్తుల మధ్య ఈ వివాదం ఎలా సెటిల్‌ అవుతుందో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.

Exit mobile version