NTV Telugu Site icon

Off The Record: తెలంగాణలో కులగణన సర్వేతో లెక్కలు తేలిపోతాయా?

Otr Caste Census

Otr Caste Census

Off The Record: తెలంగాణలో కులగణన సర్వేతో అంతా తెలిపోతుందా ? కులగణన తేలిపోయాక…స్థానిక సంస్థల ఎన్నికల వరకే అమలు చేస్తారా ? రాజకీయంగా ఆయా వర్గాలకు అవకాశాలు అంది వస్తాయా ? జనాభా ప్రతిపాదికన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ సీట్లు కేటాయిస్తారా ? తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.

తెలంగాణలో కులగణన ప్రారంభమైంది. 20 నుంచి 25 రోజుల్లో ఈ కులగణనను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. నిర్దేశించిన గడువులోపు కులగణన పూర్తి చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. దీనికి తోడు హైకోర్టు కూడా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకనుగుణంగా సర్కార్ కమిటీ ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో కమిషన్ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు పెట్టింది. దీంతో తెలంగాణలో బీసీ కులగణన తేలిపోతుందనే స్పష్టత వచ్చింది. అయితే బీసీ కులగణనపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీ కులగణన పై రాహుల్ గాంధీ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 50% రిజర్వేషన్ స్లాబ్ ఉన్న దాన్ని తొలగించైనా సరే బీసీలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇంటింటి సర్వేలో కూడా ప్రజలేం కోరుకుంటున్నారో అదే చేయాలని ప్రభుత్వానికి దిశానిర్దేశం చేశారు. బీసీ కులగణన పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉంటుందనేది స్పష్టత ఇచ్చింది తెలంగాణ సర్కార్. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వరకే ఈ సర్వే నివేదిక అమలవుతుందా ? లేదంటే ఈ సర్వే ఆధారంగానే అన్ని రకాల పదవులను భర్తీ చేస్తారా ? అనే చర్చ కూడా నడుస్తోంది. తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ. దీంట్లో బీసీల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. సర్వే పూర్తయితే బీసీలు 50 నుంచి 52 శాతం వరకు తేలబోతుందనేది ఒక అంచనా . దీని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువమంది సర్పంచులు.. ఎంపీపీలు.. మున్సిపల్ చైర్మన్లు.. జెడ్పీ చైర్మన్లు.. బీసీలకే అవకాశం ఎక్కువ దక్కనుంది.

ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ…పదవుల్లో కూడా జనాభా ప్రాతిపదికనే కేటాయింపులు ఉంటాయా అనే చర్చ నడుస్తోంది. త్వరలోనే పిసిసి కమిటీ వేయబోతుంది. దీంట్లో బీసీలకే పెద్ద పీట వేస్తారా ..? కీలకమైన పదవులను ఒకరిద్దరికి బీసీలకు అప్పగిస్తే…మిగిలిన వ్యవహారమంతా ఎలా ఉంటుందనే వాదన మొదలైందట. ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. వాటిని సర్వే ఆధారంగానే భర్తీ చేస్తారా ? అనే క్లారిటీ కావాల్సి ఉంది. దీనికి తోడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో…నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందా..? నియోజకవర్గం జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు ఇస్తారా ..? అనేది మరో చర్చ మొదలైంది. అయితే ప్రభుత్వం చేసే సర్వే ఆధారంగానే అధికార పార్టీ సీట్ల కేటాయింపు…పదవుల భర్తీ చేయాలని ఒత్తిడి సహజంగానే ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలో కూడా దీన్ని కాంగ్రెస్ అమలు చేస్తుందా ..? అనేది చూడాలి. మిగిలిన ప్రతిపక్షాల రాజకీయ ఎత్తుగడకి అనుగుణంగా ఎన్నికలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లే వారి సంఖ్యని…అందులోనూ బీసీల వాటాని సర్వే ప్రకారం ఇస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. బీసీల్లో ఐక్యత ఉండదనే కారణంతో ఇన్నాళ్లు ఆయా వర్గాల పట్ల కొంత రాజకీయంగా ప్రాధాన్యత అనుకున్న స్థాయిలో రాలేదు. ఇప్పుడు ప్రభుత్వమే సర్వే చేస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా అవకాశాలు వస్తాయా అనేది చూడాలి. మొత్తానికి తెలంగాణలో కులగణన ప్రారంభమైంది. నివేదిక వస్తే ఆయా వర్గాలకి అన్నిట్లో వాటా దక్కుతుందనే ఫీలింగ్ మాత్రం జనాల్లోకి వెళ్లిపోయింది. ఇది అమలు ఎలా ఉంటుంది అనేది చూడాలి.