Site icon NTV Telugu

Off The Record : కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ మాస్టర్‌ ప్లాన్‌

Brs Otr

Brs Otr

తెలంగాణలో కాంగ్రెస్‌కు ఊహించని ఝలక్‌ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ ప్లాన్‌ చేస్తోందా? నిఘా వర్గాలు హెచ్చరించకుంటే… నిజంగానే ఆ షాక్‌ తగిలి ఉండేదా? ఇప్పటికైనా అధికార పక్షం అలర్ట్‌ అయిందా? లేక అయితే ఏముందిలే అన్నట్టుగా ఉందా? ఇంటెలిజెన్స్‌ వార్నింగ్‌ లేకుంటే అసలేం జరిగి ఉండేది? లెట్స్‌ వాచ్‌. ఈ నెల 27న రజతోత్సవ వేడుకలు జరుపుకోబోతోంది బీఆర్‌ఎస్‌. ఆ సందర్భంగా కాస్త వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తోందట ఆ పార్టీ అదిష్టానం. అధికార కాంగ్రెస్‌ డిఫెన్స్‌లో పడేసేలా తమ రజతోత్సవ వేడుకలు ఉండాలన్న గులాబీ పెద్దల వ్యూహాన్ని ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టి ప్రభుత్వ పెద్దల చెవిన వేసినట్టు సమాచారం. ఇంతకీ ఏం జరుగుతోందంటే…. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలకు గాలం వేసి తమ రజతోత్సవ సభలో కండువాలు మార్చాలని అనుకుంటోందట బీఆర్‌ఎస్‌. తమ ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో… పాత కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని, అలాంటి వాళ్ళని పిలిచి కారెక్కిస్తే… అధికార పార్టీకి గట్టి ఝలక్‌ ఇచ్చినట్టు ఉంటుందన్నది పింక్‌ పెద్దల ఆలోచనగా పసిగట్టాయట నిఘా వర్గాలు. తమను సీఎం రేవంత్‌రెడ్డిగాని, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్‌గాని పిలిచి మాట్లాడలేదని, కొత్త వాళ్ళతో వచ్చిన సమస్య ఏంటో తెలుసుకోలేదని తీవ్ర అసహనంతో ఉన్నారట కొందరు కాంగ్రెస్‌ నాయకులు. అలాంటి వాళ్ళకు గాలం వేయాలన్నది బీఆర్‌ఎస్‌ ప్లాన్‌గా తెలుస్తోంది. ఈ విషయంలో ప్రతిపక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పసిగట్టిన ఇంటెలిజెన్స్‌ వింగ్‌….. అధికార పార్టీని అలర్ట్‌ చేసినట్టు తెలిసింది. ఈ దిశగా ఇప్పటికే… బీఆర్‌ఎస్‌ కీలక నేత…అసంతృప్తుల దగ్గరికి రాయబారం పంపినట్టు సమాచారం.

పార్టీ ఫిరాయించిన వాళ్ళను మళ్ళీ బీఆర్‌ఎస్‌లోకి తీసుకోబోమని, ఆయా నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, అప్పుడు మీరే అభ్యర్ధులు అన్నది ఆ రాయబారం సారాంశంగా తెలిసింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా టికెట్స్ మీకే అని నచ్చజెప్పే పనిలో ఉన్నారట సదరు బీఆర్‌ఎస్‌ కీలకనేత. వాస్తవంగా కూడా… గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారు పాత కాంగ్రెస్‌ నాయకులు. కనీసం పీసీసీ అధ్యక్షుడు పిలిచి మాట్లాడలేదన్న బాధ ఉందట వాళ్ళలో. కనీసం అధికారిక కార్యక్రమాల సమాచారం ఇవ్వడంలేదని, ఇన్నేళ్లు పార్టీ కోసం పడిన కష్టాన్ని అయినా గుర్తించాలి కదా..? అనే ఆవేదనతో వాళ్ళలో పెరుగుతోందని అంటున్నారు. మొత్తం పది నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందట. వాళ్ళలో చాలా మంది బలమైన నేతలే. దాంతో ఇదే అదునుగా ప్రతిపక్షం అడ్వాంటేజ్‌ తీసుకోబోతున్నట్టు పసిగట్టాయి నిఘా వర్గాలు. ఏకంగా నాయకుల ఇళ్ళకు సొంత మనుషులను పంపి … రజతోత్సవ వేదిక మీదే కండువా కప్పేందుకు సిద్ధమవుతోందట బీఆర్‌ఎస్‌. దీంతో… ఇప్పుడు అధికార పార్టీ ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి..? అసంతృప్తుల్ని పిలిచి మాట్లాడతారా..? లేదంటే కీలకంగా పని చేసిన వారికైనా ప్రాధాన్యత ఇస్తూ బుజ్జగిస్తారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. ఇప్పటికైనా కాంగ్రెస్ దూకుడుగా లేకుంటే… వ్యూహాత్మక తప్పిదమే అవుతుందని అంటున్నారు.

Exit mobile version