NTV Telugu Site icon

Off The Record: కరీంనగర్‌ మేయర్‌ వైఖరిపై గులాబీ అసంతృప్తి

Otr Brs

Otr Brs

Off The Record: నా రూటే సెపరేటు అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి…. కొంతకాలంగా మనిషొక దగ్గర మనసొక దగ్గర అన్నట్టుగా ఉంటున్నారట ఆ లీడర్…. పంటికింద రాయిలా మారిన ఆయన్ని ఎలా అటాక్ చేయాలా అని చూస్తున్న వారికి ఆయనే స్వయంగా ఆయుధం ఇచ్చేశారట. చుట్టూ సొంత మనుషులే చక్ర బంధం వేస్తున్న ఆ లీడర్‌ ఎవరు? ఏంటా పొలిటికల్‌ స్టోరీ?

రాజకీయాల్లో తేడా వస్తే తన పర భేదం చూడరు అనే నానుడిని నిజం చేస్తున్నారట కరీంనగర్ బీఆర్ఎస్ నేతలు. కొంత కాలంగా నగర మేయర్ సునీల్ రావు వైఖరి పార్టీని ఇబ్బంది పెడుతోందన్న అసంతృప్తిలో ఉన్నారు గులాబీ నేతలు… అధికారం కోల్పోయిన వేళ క్యాడర్ కు అండగా నిలవాల్సిన మేయర్ ఇతర పార్టీల్లో చేరేందుకు మంతనాలు చేశారన్నది ఆ అసంతృప్తికి కారణంగా చెప్పుకుంటున్నారు. తొలుత కాంగ్రెస్ అనుకున్నప్పటికీ మంత్రి పొన్నం నుంచి బ్రేక్ లు పడటంతో కమలం వైపు కదిలారట మేయర్‌… స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసేందుకు పడిగాపులు కాయడం… కార్పోరేటర్లను తీసుకుని పలుమార్లు సంజయ్‌తో సమావేశం అవడం కార్ పార్టీ నేతలకు ఇబ్బందిగా మారినట్టు చెబుతున్నారు. ఈ పద్ధతిని కొందరు పార్టీ నాయకులు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. అయితే పార్టీ పెద్దలే ఇలా మాట్లాడిస్తున్నారంటూ కొన్ని సమావేశాలకు దూరంగానే ఉంటున్నారట మేయర్…దీంతో అప్పట్లోనే ఆయన మీద అవిశ్వాసం పెట్టాలని భావించారట.
కానీ మారిన రాజకీయ పరిస్థితులతో ఆ ఆలోచనను విరమించుకున్నారు…. ఈ రేంజ్‌లో వ్యవహారం నడుస్తున్న తరుణంలోనే…. వారికి మేయర్ ఆయుధాలను ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు.

తన విదేశీ పర్యటన వివాదాస్పదం కావడంతో చిక్కుల్లో పడ్డారట సునీల్‌రావు.. తాజాగా అమెరికా వెళ్లారు మేయర్‌… అది ఆయన వ్యక్తిగత పర్యటన కాగా… నిబంధనల ప్రకారం నడుచుకోలేదంటూ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేసారు… మేయర్ సునీల్‌రావు ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 25 వరకు అమెరికా పర్యటన కోసం ఏర్పాట్లు చేసుకున్నారు… అందుకు అనుగుణంగానే రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు.. ఇక్కడే ప్రత్యర్థులకు దొరికిపోయారాయన. వాస్తవంగా మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్ల మేయర్లు, చైర్మన్‌లు రెండు వారాలకు మించి స్థానికంగా ఉండకపోతే… అనర్హులవుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు డిప్యూటీ మేయర్‌కు, లేదా వైస్‌ చైర్మన్‌కు బాధ్యతలను అప్పగించాలి. లేదంటే కలెక్టర్ కానీ సంబంధిత కమీషనర్‌గాని ఇంచార్జ్‌గా బాధ్యతలు తీసుకోవాలి. అలాంటిదేమీ చేయకుండానే మేయర్ అమెరికా పర్యటనకు వెళ్లారంటూ ఫిర్యాదు చేశారు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి. మరో కార్పోరేటర్ మెండి శ్రీలత, మాజీ కార్పోరేటర్ చంద్రశేఖర్‌ కలెక్టర్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.. బీసీ మహిళను కాబట్టే తనకు ఇంచార్జ్‌ మేయర్ గా బాధ్యతలు అప్పగించకుండా వెళ్లారని అంటున్నారు స్వరూపారాణి.

స్మార్ట్ సిటీ పేరుతో జరిగిన కుంభకోణం… మేయర్ అవినీతి పనులు బయట పడతాయనే భయంతోనే తనకు చార్జ్ ఇవ్వలేదని హాట్ కామెంట్స్ చేశారామె. అటు డిప్యూటీ మేయర్‌కు మద్దతుగా బీసీ సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ పరిణామాలతో కంగుతిన్న మేయర్‌…తన రిటర్న్ టికెట్లను ఆగస్టు ఆరో తేదీకి మార్చుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ చేయించారట… కలెక్టర్ వివరణకు కూడా జవాబునిస్తూ తన పర్యటన వివరాలను కమీషనర్‌కు చెప్పానని… రెండు వారాల లోపు తిరిగి వస్తానని చెప్పినట్టు తెలిసింది. అయితే మేయర్ పై అదను చూసి అటాక్ చేయడం వెనక పార్టీ పెద్దల వ్యూహం కూడా ఉందనే చర్చ సాగుతోంది గులాబీ సర్కిల్స్‌లో… కరీంనగర్ కార్‌ పార్టీలో ఈ రేంజ్‌లో నేతలు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు ఫిర్యాదు చేసింది గతంలో లేదు… ప్రస్తుతం పార్టీ పెద్దలకు తెలియకుండా ఇలా జరుగుతోందని కూడా అనుకోలేమంటున్నాయి రాజకీయ వర్గాలు. అటు మాజీ మేయర్, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ కూడా మేయర్‌ వైఖరిని తప్పుపట్టారు. రవీందర్ సింగ్ అధిష్టానం పెద్దలకు అత్యంత సన్నిహితుడన్నది లోకల్‌ టాక్‌. ఆయనే మాట్లాడారంటే… పెద్దోళ్ళే మాట్లాడించి ఉండవచ్చన్న టాక్‌ నడుస్తోంది. దీంతో ఇప్పుడు మేయర్ వైఖరి ఏ విధంగా ఉండబోతోంది… ఇది ఎట్నుంచి ఎటు వెళ్తుందన్న చర్చ జరుగుతోంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌ వ్యవహారం రసవత్తంగా మారుతోంది.