NTV Telugu Site icon

Off The Record : బీఆర్‌ఎస్‌ ఆఫీసులకు ముంపు ముంచుకొస్తుందా ? HYDRA బుల్డోజర్ దూసుకెళ్తుందా ?

Brso Tr

Brso Tr

అట్టహాసంగా కట్టుకున్న బీఆర్‌ఎస్‌ ఆఫీసులకు ముప్పు ముంచుకొస్తోందా? నాడు అధికార బలంతో మనల్ని అడిగేది ఎవ్వడన్నట్టుగా నిర్మించిన పార్టీ కార్యాలయాల మీదికి ఇప్పుడు నిబంధనల బుల్డోజర్స్‌ దూసుకొస్తున్నాయా? పార్టీకి కొత్తగా ఇదో తలనొప్పిగా మారిందా? అసలు పార్టీ ఆఫీసుల నిర్మాణాలు ఎలా జరిగాయి? వాటికి ఏ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది? ప్రతి జిల్లాలో పార్టీకి శాశ్వత కార్యాలయం ఉండాలన్న టార్గెట్‌తో… తాము అధికారంలో ఉన్నప్పుడు భారీ భవంతులు నిర్మించింది బీఆర్‌ఎస్‌. అయితే అప్పుడు పవర్‌ మనదేకదా అన్న ధీమాతో నిబంధనలను సరిగా పట్టించుకోలేదని, అదే ఇప్పుడు శాపంగా మారిందన్న వాదన వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. అలా నిబంధనలు పాటించని భవనాలే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి టార్గెట్‌ అయినట్టు చెప్పుకుంటున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించారు. ఇందులో కొన్ని ప్రారంభమవగా కొన్నిటిని ఇంకా ప్రారంభించలేదు. మూడోసారి కూడా అధికారం మనదేనన్న ధీమాతో… అప్పట్లో అనుమతుల విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదట. అలా రూల్స్‌కు విరుద్ధంగా ఉన్న వాటి చుట్టూనే ఇప్పుడు వివాదాలు రేగుతున్నాయంటున్నారు. ఈ క్రమంలోనే… నల్లగొండ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చేయాలని ఏకంగా హైకోర్టు ఆదేశాలు రావడం కలకలం రేపుతోంది. నల్గొండ నడిబొడ్డున నిర్మించిన జిల్లా పార్టీ ఆఫీస్‌ భవిష్యత్‌ ఇప్పుడు ప్రశ్నార్ధకమైంది. టీఎస్‌ ఆగ్రోస్‌కు చెందిన రెండు ఎకరాల స్థలాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని… సీసీఎల్ఏ నుంచి కేవలం మూడున్నర లక్షలకే పార్టీ ఆఫీసు కోసం కట్టబెట్టారనేది కాంగ్రెస్ ఆరోపణ. అలాగే డీటీసీపీ అప్రూవల్ తీసుకోకుండానే పార్టీ ఆఫీస్ నిర్మించారని కూడా ఆరోపించారు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి.

ఈ వివాదం ముదరటంతో మున్సిపల్ యాక్ట్ ప్రకారం టీఎస్ బిపాస్‌కు అప్లై చేసింది బీఆర్ఎస్. నిబంధనలకు విరుద్ధమైతే… ఎంత పెనాల్టీ చెల్లించాలో చెప్పండి అంత కడతామంటూ కలెక్టర్, స్టేట్ కమిషనర్‌కు లేఖలు రాసింది. ఈ స్థలాన్ని సీసీఎల్ఎ రూల్స్ ప్రకారం కొన్నామని… ఆఫీసు నిర్మాణం విషయంలోనే పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి టీఎస్ బీపాస్ లో పెనాల్టీ చెల్లిస్తామని..లేదంటే కోర్టుకు వెళ్తామని తెలిపింది గులాబీ నాయకత్వం. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. కానీ హైకోర్టులో ఆ పార్టీకి చుక్కెదురు అయింది. బిల్డింగ్‌ కట్టాక ఏ రకంగా అనుమతిస్తారని ప్రశ్నించింది హైకోర్ట్‌. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చడం తో పాటు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా బీఆర్ఎస్‌ను ఆదేశించింది. ఇలా ఈ లొల్లి ఒక్క నల్గొండకే పరిమితం కాలేదు. అటు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నిర్మించిన బిఆర్ఎస్ కార్యాలయం పైనా రగడ నడుస్తోంది. ఈ విషయంలో వరంగల్ వెస్ట్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మధ్య వార్ నడుస్తోంది. పార్కు స్థలం కబ్జా చేసి పార్టీ కార్యాలయం నిర్మించారని, దాన్ని బుల్డోజర్ తో కూల్చేస్తామని చాలాసార్లు అన్నారు నాయిని రాజేందర్ రెడ్డి. ప్రస్తుతం ఈ అంశం కూడా కోర్టు పరిధిలో ఉంది. ఇలా పలు జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా బిఆర్ఎస్ నిర్మించిన కార్యాలయాలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టిందట. దీంతో ప్రధాన ప్రతిపక్షంలో అలజడి మొదలైందంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నల్గొండ పార్టీ ఆఫీస్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పార్టీ అధిష్టానం న్యాయ నిపుణులతో చర్చిస్తోందట. దీంతో గులాబీ పార్టీ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

Show comments