Site icon NTV Telugu

Off The Record : హైదరాబాద్లో BRS కి కొత్త షాక్ తగలబోతుందా..?

Off The Record

Off The Record

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు ఇంకో సూపర్‌ షాక్‌ తగులబోతోందా? గ్రేటర్‌ పరిధిలో ఉన్న మరో ఎమ్మెల్యే కారు దిగేసి కాంగ్రెస్‌ గూటికి చేరడానికి సిద్ధమైపోయారా? ఇక గేర్‌ మార్చడమే మిగిలి ఉందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయన కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకుంటారన్న సంగతి తెలిసే అక్కడి హస్తం నేతలు ఆందోళన పడుతున్నారా? లెట్స్‌ వాచ్‌. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బలాన్నిచ్చి పార్టీ పరువు కాపాడిన గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆ పార్టీకి ఇక వరుస దెబ్బలు తగలబోతున్నాయా? అంటే… జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. సిటీకి చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఇప్పటికే కాంగ్రెస్‌లోకి జంపై పోయారు. పద్మారావు గౌడ్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ సీటుకు బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి అయ్యారు. ఇక మిగిలి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు సనత్‌నగర్‌ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అంబర్‌పేట కాలేరు వెంకటేష్‌, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మాత్రమే. ఈ ముగ్గురిలో ఒకరు కాంగ్రెస్‌లోకి జంప్‌ అవుతున్నారనే ప్రచారం తాజాగా ఊపందుకుంది. ఒక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న లీకులు ఆ పార్టీ వైపు నుంచి కూడా వస్తున్నాయి. అయితే…. అలా లీకుల్లో పేరు వినబడుతున్న ఆ ఎమ్మెల్యే మాత్రం కేటీఆర్‌ సిటీ టూర్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాంగ్రెస్‌లోకి జంప్‌ అవుతున్నారని ప్రచారం జరిగిన ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలోనే లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేటీఆర్‌. ఆదివారంనాడే సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తారనుకున్న సదరు ఎమ్మెల్యే మాత్రం కేటీఆర్‌ టూర్‌లోనే ఉన్నారు.

దీంతో ఇదంతా కాంగ్రెస్‌ ఆడుతున్న మైండ్‌ గేమ్‌ అంటూ ఎమ్మెల్యేతో సహా బీఆర్‌ఎస్‌ నేతలు కొట్టిపారేశారు. మరోవైపు అంబర్‌పేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ లొల్లి షురూ అయింది. ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒకవైపు కేటీఆర్‌ టూర్‌లో చురుగ్గా పాల్గొంటున్న క్రమంలోనే స్థానిక కాంగ్రెస్‌ నేతలు ఆ పార్టీ సీనియర్‌ నేత వి.హన్మంతరావు ఇంట్లో సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తానన్నా చేర్చుకోవద్దంటూ ఆ మీటింగ్‌లో తీర్మానించారట. గతంలో కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్ గా గెలిచి పార్టీ తరపున జీహెచ్‌ఎంసీ ఫ్లోర్ లీడర్ గా కూడా పనిచేసి తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లిన వ్యక్తి కాలేరు అని, కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచిన లీడర్‌ని తిరిగి తీసుకోవద్దని పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నట్టు తెలిసింది. ఎలాంటి అవినీతి ఆరోపణలు, కేసులు లేని వ్యక్తులను మాత్రమే పార్టీలోకి తీసుకుంటామన్న నిర్ణయంపై పెద్దలు దృష్టి సారించాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌కు విజ్ఞప్తి చేశారు అంబర్‌పేట నేతలు. ఎమ్మెల్యే కాలేరు దమ్ముంటే పదవికి రాజీనామా చేసిన తరువాతే పార్టీలో చేరాలని డిమాండ్‌ చేశారు అంబర్‌పేట కాంగ్రెస్‌ నేతలు. ఒకవైపు కాలేరు వెంకటేశ్‌ బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటే… మరోవైపు అంబర్‌పేట కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఆయన్ని పార్టీలో చేర్చుకోవద్దని బహిరంగంగానే విజ్ఞప్తులు, డిమాండ్లు చేస్తుండటంతో… హస్తం గూటికి చేరబోయేది కాలేరు వెంకటేశేనా అన్న అనుమానాలు వస్తున్నాయట రాజకీయ వర్గాల్లో. దీనికి పెద్ద టైం పట్టదని, ఆ ఎమ్మెల్యే ఎవరో త్వరలోనే తేలిపోతుందని అంటున్నారు.

Exit mobile version