NTV Telugu Site icon

Off The Record : నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేత టెన్షన్..

Brs Otr

Brs Otr

మనల్నెవడ్రా ఆపేది అంటూ పార్టీ ఆఫీసుని కట్టారు! తీరా చూస్తే దానికి అనుమతుల్లేవు! సర్కారు మనదే కదా అని కానిచ్చేశారు! తీరా ఓడిపోయాక బిల్డింగ్ ఏమైపోతుందో అన్న టెన్షన్ పట్టుకుంది! వదిలే ప్రసక్తే లేదని ఆ మంత్రి సీరియస్‌గానే ఉన్నారు! మరి ఆఫీసుని కూల్చేస్తారా? జనానికి పనికొస్తుందని స్వాధీనం చేసుకుంటారా? రెండూ కాకుండా పొలిటికల్ మైలేజీ కోసం వాడుకుంటారా? కొంతకాలంగా నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సెంటర్ పాయింటుగా కూల్చివేత రాజకీయం నడుస్తోంది. అనుమతులు లేని ఆఫీసుని కూల్చివేయాల్సిందేనని కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ పట్టుబడుతున్నారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున వందకోట్ల విలువైన స్థలంలో పార్టీ కార్యాలయాన్నిఅనుమతులేవీ లేకుండా నిర్మించారంటూ ఆయన ఫైట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా అక్కడి నుంచి పార్టీ ఆఫీసును తరలిస్తామని కూడా హెచ్చరించారు. అనుకున్నట్టే.. మంత్రి తన పంతాన్ని నెగ్గించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మించే భవనాలను కూల్చివేసే మున్సిపల్ అధికారులు.. పర్మిషన్ లేని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాత్రం ఎందుకు టచ్ చేయడం లేదని అధికారులను గట్టిగానే ప్రశ్నించారు. నిబంధనలు అందరికీ వర్తిస్తాయని హుకుం జారీ చేశారు. దీంతో నల్గొండలో బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసు భవితవ్యం గందరగోళంలో పడింది.

అప్పట్లో నిబంధనల ప్రకారం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించారు కానీ.. మున్సిపల్ అనుమతులు లేకుండా బిల్డింగ్ కట్టారు. ఇదే పాయింట్ మీద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తోంది. కార్యాలయాన్ని కూల్చివేయాల్సిందేనని మంత్రి పట్టుబట్టడంతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి ఆదేశాలతో ఫైనల్ నోటీసులు కూడా జారీ చేశారు మున్సిపల్ అధికారులు. నిబందనలకు విరుద్దంగా నిర్మించిన ఇతర పార్టీల కార్యాలయాలను కూడా కూల్చి… తమ ఆఫీసు మీదకి రండని మంత్రికి.. బీఆర్‌ఎస్ నేతలు పైపైన కౌంటర్ వేస్తున్నా.. లోపల్లోపల ఆఫీసుని ఎక్కడ కూల్చేస్తారో అన్న టెన్షన్ పట్టుకుంది. మళ్లీ అధికారంలోని వచ్చేది తామే కదా.. ఎవరడుగుతారన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌లో అనుమతులు లేకుండానే కట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని.. దీనికంతటికీ కారణం కొందరు నేతల తీరేనని గులాబీ పార్టీలో ఒక వర్గం భగ్గున మండుతోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల హెచ్చరికలు, అధికారుల దూకుడుతోనే గులాబీ నేతలకు గుబులు మొదలైందని లోకల్‌గా చర్చించుకున్నారు. ఈలోగా కొందరు హడావిడిగా అనుమతుల కోసం దరఖాస్తు చేయడం… అందుకున్న నోటీసులను పట్టుకుని కోర్టును వెళ్లడం.. చకచకా జరిగిపోయాయి. ఇంతదూరం తీసుకొచ్చి.. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని పార్టీ క్యాడర్ బాహాటంగా విమర్శలు చేస్తోంది.

అసలే కోమటిరెడ్డి! మాటంటే మాటే అనే రకం. పైగా అవలిపార్టీ బీఆర్‌ఎస్! పంతం నెగ్గించుకున్నా నెగ్గించుకుంటారని అందరూ చర్చించుకుంటున్నారు. మరి అనుకున్నట్టుగానే ఆఫీసుని కూల్చేస్తారా? లేదంటే భవనాన్ని స్వాధీనం చేసుకుని ప్రజాప్రయోజనాల కోసం వాడుకుంటారా? లేక విమర్శలు, ప్రతి విమర్శలతో కాలం వెళ్లదీస్తారా? ఈ మూడు పాయింట్ల మీద పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో!!