Site icon NTV Telugu

Off The Record : బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ లో భిన్న స్వరాలు

Brs

Brs

ఒకే అంశంపై బీఆర్‌ఎస్‌లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయా? పార్టీ వైఖరి కూడా ఎప్పటికప్పుడు మారుతోందా? బీసీ రిజర్వేషన్స్‌ ఆర్డినెన్స్‌ విషయంలో గులాబీ పార్టీ గందరగోళంలో ఉందా? ఏంటా భిన్న స్వరాలు? తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై గులాబీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఎమ్మెల్సీ కవిత మరోసారి పార్టీని గట్టిగా ఇరుకున పెట్టారా? లెట్స్‌ వాచ్‌. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు బీసీ అజెండాతో ముందుకు వెళ్లాయి. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది కాంగ్రెస్‌. అదే పార్టీ అధికారంలోకి వచ్చినందున బీసీ రిజర్వేషన్స్‌ సంగతేంటని ఇన్నాళ్ళు నిలదీశారు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ లీడర్స్‌. హామీ ఇచ్చినట్టుగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందేనని పట్టుబట్టడంతోపాటు… అప్పట్లో పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్‌ ఫాల్స్‌ హామీ ఇచ్చిందని కూడా విమర్శించారు కొందరు బీఆర్‌ఎస్‌ లీడర్స్‌. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న టైంలో ఇప్పుడు మరోసారి రిజర్వేషన్స్‌పై చర్చ మొదలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌ ఇచ్చాకే… ఎన్నికలకు వెళ్లాలని బీఆర్‌ఎస్‌ సహా..మిగతా పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. గులాబీ పార్టీ అయితే… ఒక అడుగు ముందుకేసి రిజర్వేషన్స్‌ అమలు తర్వాతనే ఎన్నికలు పెట్టాలని, లేదంటే ఉద్యమం చేస్తామని కూడా వార్నింగ్‌ ఇచ్చింది.

అవసరమైతే… అందుకు సంబంధించి ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చి, పార్లమెంట్‌లో బిల్ పాసయ్యేలా చూడాలని ఇన్నాళ్ళు డిమాండ్‌ చేస్తూ వచ్చింది గులాబీ దళం. ఆ తర్వాతనే అసలు ట్విస్ట్‌ మొదలైంది. బీఆర్‌ఎస్‌ డిమాండ్‌తో సంబంధం ఉందా లేదా అన్న సంగతి పక్కనపెడితే… ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. 42 శాతం కోసం ఆర్డినెన్స్ ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్‌. ఆర్డినెన్స్‌ ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని కూడా ప్రకటించింది సర్కార్‌. అంతా ఓకే అనుకుంటుండగానే… కారుకు రివర్స్‌ గేర్‌ పడింది. ఇప్పుడు కేబినెట్‌ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు గులాబీ నాయకులు. రిజర్వేషన్స్‌ విషయంలో ఆర్డినెన్స్ తెచ్చినా… అది కోర్ట్‌లో నిలబడదని, కచ్చితంగా చట్టబద్ధత కల్పించాల్సిందేనన్నది గులాబీ స్వరం. పార్టీకి చెందిన కీలక బీసీ నేతలు సమావేశమై ఈ విషయాన్ని ప్రకటించారు. ఆర్డినెన్స్‌కు చట్టబద్దత కల్పించాకే…. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నది బీఆర్ఎస్‌ లేటెస్ట్‌ డిమాండ్‌. అయితే ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్‌ వెర్షన్‌ మరోలా ఉంది.

చట్టబద్దత కల్పించాలంటే… ముందు ఆర్డినెన్స్‌ని తీసుకురావాలికదా… ఆ ప్రయత్నం చేస్తుండగానే… మెలికలు పెట్టి మాట్లాడుతున్నారంటే… దీన్ని రాజకీయం కాక మరేం అనాలన్నది హస్తం పార్టీ నాయకుల ప్రశ్న. అసలు బీసీలకు 42 శాతం వాటా విషయంలో బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ది ఉందా? నిజంగానే ఉంటే… ఇలా ముందరి కాళ్ళకు బంధాలు వేస్తారా అంటూ ప్రశ్నిస్తోంది కాంగ్రెస్‌. దీనిపై అటు గులాబీ దళంలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించాకే… ఎన్నికలకు వెళ్ళాలని, అప్పటిదాకా మేం గుర్తించబోమని గులాబీ నాయకత్వం అంటుంటే…. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత మాత్రం డిఫరెంట్‌గా రియాక్ట్‌ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ… సంబరాలు కూడా చేసేసుకున్నారు కవిత. కేబినెట్‌ నిర్ణయానికి సంబందించిప్రకటన వెలువడ్డాక… అర్ధరాత్రే సెలబ్రేట్‌ చేశారామె. తాము తెలంగాణ జాగృతి తరపున కొట్లాడడం వల్లనే ఇలా జరిగిందని, ఇది తమ విజయం అంటూ హ్యాపీగా చెప్పారు ఎమ్మెల్సీ. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా…. తన ఇంటి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు కవిత. ఇలా… ప్రభుత్వ నిర్ణయంపై ఒకే పార్టీలో భిన్న స్వరాలు వినిపించడంపై కొత్త చర్చ మొదలైంది. బీసీ రిజర్వేషన్స్‌పై వీళ్ళలో ఎవరికి చిత్తశుద్ధి ఉందంటూ మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇదంతా తెలంగాణ బీసీల మీద ప్రేమా? లేక రాజకీయ ప్రయోజనాల ఆరాటమా అన్న డౌట్స్‌ వస్తున్నాయట.

Exit mobile version