NTV Telugu Site icon

Off The Record : YCP పూర్వ వైభవం కోసం మాస్టర్ ప్లాన్!

Botsa Satyanarayana

Botsa Satyanarayana

 

బొత్స.. బౌన్స్ బ్యాక్! ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. విశాఖ కేంద్రంగా ఈ మాజీ మంత్రి చక్రం తిప్పనున్నారా..? వైసీపీకి పూర్వవైభవం కోసం ఇదే సరైన నిర్ణయం అని హైకమాండ్ భావిస్తోందా..? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ పరిణామాల వెనుక రీజనేంటి.? వైఫల్యం నేర్పిన పాఠమా లేక.. స్ధానిక నాయకత్వానికి పెద్దపీట వేసే వ్యూహమా…? వైసీపీ అంతర్గత పరిణామాలు వేగంగా మారుతున్నట్టే కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమిపై పోస్ట్ మార్టమ్ తర్వాత వైఫల్యాలను సరిదిద్దుకునే దిశగా కీలక మార్పులకు ఫ్యాన్ పార్టీ సన్నద్ధం అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ సంస్ధాగత నిర్మాణంలో భాగంగా టీడీపీ జోనల్ వ్యవస్ధను ఏర్పాటు చేసుకుంటే….వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లకు సమన్వయ బాధ్యతను అప్పగించింది. జిల్లాల అధ్యక్షుల ద్వారా ముఖ్యమైన నిర్ణయాల అమలు జరుగుతోంది. ఐతే, ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో భిన్న స్వరాలు మొదలయ్యాయి. ఓటమికి గల కారణాలపై నేతలు బహిరంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రారంభించగా…మరికొందరు రాజకీయ స్తబ్ధత పాటిస్తున్నారు. దీంతో వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సన్నద్ధం అయినట్టు తెలుస్తోంది. సీనియర్ల అనుభవాన్ని విస్త్రతంగా ఉపయోగించుకోవాలని భావిస్తుండగా… స్ధానికంగా వుండే బలమైన నాయకత్వానికే పెద్దపీట అనేది కీలకంగా మారిందట. తద్వారా సమన్వయం మరింత ఈజీ అవుతుందని.. రాజకీయంగా ఎదురయ్యే సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. సంస్ధాగత మార్పులు అనివార్యం అయితే తొలి అడుగు ఉత్తరాంధ్ర నుంచే పడుతుందని సీనియర్లు చర్చించుకుంటున్నారు.

విశాఖపై పట్టు సాధించాలనేది వైఎస్సార్ సీపీకి విఫల ప్రయత్నంగానే మిగిలిపోయింది. 2019లో రాష్ట్రం అంతటా సునామీ సృష్టించినా.. ఇక్కడ నాలుగు ఎమ్మెల్యే సీట్లను టీడీపీనే గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో సుమారు 4వేల ఓట్ల తేడాతో ఎంపీ సీటుని కోల్పోయింది. సరిగ్గా ఐదేళ్ళు తిరిగే సరికి ఉత్తరాంధ్రలో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టించింది. ఉత్తరాంధ్రలో 32అసెంబ్లీ…నాలుగు పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుని కంచుకోట కట్టేసింది కూటమి. రాష్ట్రంలోనే రికార్డు స్ధాయి మెజారిటీలు విశాఖ జిల్లాలోనే నమోదయ్యాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన సీనియర్లకు ఘోర పరాభవం ఎదురైంది. ఈ రిజల్ట్స్ షాక్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఇప్పట్లో కోలుకునే దాఖలాలు కనిపించడం లేదు. దీంతో వచ్చే ఐదేళ్ళు పార్టీ పటిష్టత, ప్రభుత్వ విధానాలను ఎదుర్కోవడం ప్రతిపక్షానికి పెద్ద చాలెంజ్. మరోవైపు, వైసీపీని బలహీనపరిచేందుకు కూటమి పార్టీల ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే 15మంది కార్పోరేటర్లు సహా స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు గేటు దాటేశారు. ఈ క్రమంలో గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా చేసుకున్న టీడీపీ.. స్ధాయి సంఘం ఎన్నికల్లో అత్యంత నాటకీయ పరిణామాలు మధ్య 10కి 10 స్ధానాలు కైవసం చేసుకుంది. ఇదే ఊపులో స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లోనూ గెలిచేయాలని వ్యూహం పన్నగా.. మాజీమంత్రి బొత్సను అభ్యర్ధిగా పెట్టి ఈ ప్రయత్నాలకు చెక్ చెప్పింది వైసీపీ.

బొత్స సత్య న్నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సరిగ్గా ఇక్కడి నుంచే వైసీపీలో సమీకరణాలు మారుతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. విశాఖ, విజయనగరం జిల్లాలకు సంబంధించిన పార్టీ బాధ్యతలు పూర్తిగా బొత్స చేతుల్లో పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అంతర్గత వర్గాల సమాచారం. త్వరలో జిల్లాల అధ్యక్షుల మార్పు అనివార్యమని భావిస్తున్నారు. ఈ దిశగా అనకాపల్లి, విశాఖ జిల్లాల బాధ్యతలను మాజీ మంత్రులు అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడికి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీకి పెద్దదిక్కుగా బొత్స సత్యన్నారాయణ వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది. బొత్స కూడా అందుకు సన్నద్ధం అయ్యారని.. విశాఖలో క్యాంప్ కార్యాలయం కేంద్రంగా రాజకీయాలు నడిపేందుకు రెడీ అయ్యారని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు.

విజయనగరం జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇప్పుడు వైజాగ్ పై ఫోకస్ పెట్టారు. బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మిని విశాఖ ఎంపీగా అధిష్ఠానం పోటీకి దింపింది. సామాజికవర్గం, సీనియారిటీ ఆధారంగా ఆమెను అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. నెగెటివ్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ బొత్స నాయకత్వంపై అధిష్టానానికి గురి తప్పలేదని.. ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా మరోసారి రుజువైంది. సంఖ్యాబలం, నైతికత ఆధారంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండిపోయింది టీడీపీ. రాజకీయంగా ఇది కరెక్టే అయినా….తెరవెనుక బొత్స చాణక్యం బాగా వర్కవుట్ అయిందని….అందుకే ఏకగ్రీవం సాధ్యపడిందనేది మరో చర్చ. వాస్తవానికి ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీకి సీనియర్ నాయకులు ఉన్నారు. కన్నబాబురాజు, ధర్మశ్రీ, ముత్యాల నాయుడు, రాజ్య సభ ఎంపీ గొల్లబాబూరావు వంటి సీనియర్లు….మాజీమంత్రులు గుడివాడ అమర్నాథ్, పసుపులేటి బాలరాజు వంటి నేతలు…ఒక్కసారే పనిచేసినప్పటికీ ఎనర్జటిక్ పాలిటిక్స్ నడిపిన మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది వున్నారు. కానీ, వీళ్ళంతా నియోజకవర్గాలకు లేదా ఒక తరహా రాజకీయాలకు పరిమితం అయ్యారనే అభిప్రాయం వుంది. ఈనేపథ్యంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ పనిచేయగలిగిన బొత్సకు బాధ్యతలు అప్పగించడం కీలకం అనేది డిస్కషన్‍. త్వరలోనే ఇది సాధ్యం అవుతుందని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తన లోకల్ ఐడెంటిటీపై కూటమి పార్టీలు సంధిస్తున్న ప్రశ్నలకు గట్టిగానే సమాధానం చెబుతున్నారు బొత్స. ఇవన్నీ చూస్తుం టే విశాఖ వైసీపీకి ట్రబుల్ షూటర్‍ బాధ్యతలను బొత్స తీసుకోవడం ఎంతో దూరంలో లేదనే భావించాల్సి వుంటుంది.