NTV Telugu Site icon

Off The Record : ఎన్నికల ఫలితాల తర్వాత అజ్ఞాతంలోకి భూమన..

Bhumana Karunakar Redd

Bhumana Karunakar Redd

పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు పవర్‌ఫుల్‌గా కనిపించారు ఆ వైసీపీ సీనియర్‌. అబ్బో… ఆయన పరపతి అరచేతి మందం అనుకున్నారు. తండ్రీ కొడుకులిద్దరీ పార్టీ పవర్‌ని బాగానే ఎంజాయ్‌ చేశారట. కానీ జస్ట్‌… అలా అధికారం పోయిందో లేదో… ఇలా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శాటిలైట్‌ సెర్చ్‌లో సైతం దొరకడం లేదన్న సెటైర్స్‌ పడుతున్నాయి. సాటి సీనియర్స్‌ని ఫిక్స్‌ చేస్తున్న కేసుల భయం ఆయన్ని కూడా వెంటాడుతోందా? ఎవరా నాయకుడు? ఏంటాయన అజ్ఞాతవాసం కహానీ? భూమన కరుణాకర్‌రెడ్డి, వైసీపీ నేత. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పొలిటీషియన్‌. రెండు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన భూమనకు వైఎస్‌ ఫ్యామిలీతో అనుబంధం కూడా ఎక్కువేనంటారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి సెగ్మెంట్‌ నుంచి తనకు బదులు కొడుకు అభినయ్ రెడ్డితో పోటీ చేయించారు భూమన. అభినయ్‌ ఓటమి తర్వాత కరుణాకర్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న చర్చ జోరుగా జరుగుతోంది తిరుపతి పొలిటికల్ సర్కిల్స్ లో. ఎన్నికల్లో పోటీకి దూరమేగానీ, రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉంటానని గతంలోనే చెప్పారు కరుణాకర్‌రెడ్డి. అలాంటి వ్యక్తి కొడుకు ఓటమి తర్వాత ఎందుకు పూర్తిగా ముఖం చాటేశారన్నది తాజా చర్చ. ఓటమి తర్వాత పార్టీ నేతలంగా జగన్‌ను కలుస్తున్నా… భూమన మాత్రం తాడేపల్లి పరిసరాలకు కూడా వెళ్ళలేదట. ఈ క్రమంలో తండ్రీ కొడుకులిద్దరూ తమను పట్టించుకోవడం లేదన్న అసహనం పార్టీ కేడర్‌లో పెరుగుతోందని వైసీపీ నేతలే అంటున్నారు. అదే సమయంలో భూమన ఫ్యామిలీ మౌనరాగం వెనక పెద్ద కారణమే ఉందన్న వాదన బలపడుతోంది. జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, నాని, వంశీ ఇలా చాలామంది సీనియర్ నేతలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వరుస పరిణామాలను గమనిస్తున్న కరుణాకర్‌రెడ్డి ఇప్పుడే మనం బయటపడి అనవసరంగా టార్గెట్‌ అవడం ఎందుకని అనుకుంటున్నట్టు తెలిసింది. ఎన్నికలకు ముందు ఈ కుటుంబం మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు కూటమి నేతలు. తిరుపతి మాస్టర్ ప్లాన్, టీడీఆర్‌ బాండ్ల లో దాదాపు 4 వేల కోట్ల రూపాయల అవినీతి లాంటి అంశాలపై ఇప్పటికే సీడీకి ఫిర్యాదు చేశారు టీడీపీ లీడర్స్‌. ఇందులో భూమన అభినయ రెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. ఇక కరుణాకర్‌రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, అవసరం లేకుండా నూతన భవనాలు ఏర్పాటు పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని, దాని మీద దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కూటమి నేతలు. ఆఖరికి టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. వీటన్నిటినీ బేరీజు వేసుకున్న భూమన కావాలనే కామ్‌ అయ్యారన్న టాక్‌ నడుస్తోంది తిరుపతిలో. ఇక భూమన శిష్యుడుగా భావించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆయన కొడుకు మోహిత్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినానిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇప్పటికే 41ఎ నోటీసు అందుకోవాల్సి వచ్చింది. అలాగే… పార్టీలో కొందరు సీనియర్ నేతలు సైతం భూమన ఫ్యామిలీపై ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఇక తిరుపతి వైసీపీ కార్పొరేటర్లు చాలామంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. కానీ… ఇప్పటి వరకు వాళ్ళను పిలిచి మాట్లాడిన వాళ్ళు లేరు. ఉంటే ఉంటారు, పోతే పోతారు అన్నట్టుగా ఉందట వ్యవహారం. జిల్లాలోగానీ, సిటీలోగాని జరుగుతున్న పరిణామాలతో నాకేం సంబంధం లేదన్నట్టుగా భూమన వ్యవహార శైలి ఉందంటూ చర్చ జరుగుతోందో తిరుపతి వైసీపీలో. మొత్తంగా ఆరోపణలు, కేసుల వ్యవహారాలే భూమనను మ్యూట్‌ మోడ్‌లోకి నెడుతున్నాయన్నది తిరుపతి వైసీపీ టాక్‌. అదే సమయంలో పవర్‌ ఉన్నప్పుడు పదవులు అనుభవించి పోగానే కామ్‌ అయిపోతే ఎలాగన్న వాయిస్‌ సైతం వినిపిస్తోంది. మొత్తంగా భూమన ఎప్పుడు అజ్ఞాతం వీడతారో చూడాలి మరి.