NTV Telugu Site icon

Off The Record : సమన్వయలేమితో ఎంపీ అభ్యర్థిపై ప్రభావం?

Bhadrachalam Otr

Bhadrachalam Otr

ఎమ్మెల్యే…. మాజీ ఎమ్మెల్యే…. మాజీ ఎమ్మెల్సీ… ఇదీ స్టోరీ. ఈ ముగ్గురి మధ్య ఆధిపత్య పోరుతో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మూడు చెరువుల నీరు తాగాల్సి వస్తోందట. చివరికి ఛీ…వీళ్ళతో కాదనుకుని కేడర్‌ని డైరెక్ట్‌ డీల్‌ చేయడం మొదలుపెట్టారా ఎంపీ క్యాండిడేట్‌. అది కూడా ప్రమాదమేనంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. ఇంతకీ ఏ లోక్‌సభ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎక్కడున్నాయా మూడు గ్రూప్‌లు? కాంగ్రెస్‌ పార్టీకి ఒకప్పుడు కంచుకోట భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్‌. కానీ… అనూహ్య పరిణామాల మధ్య ఈసారి ఇక్కడ ఓడిపోయింది పార్టీ. సిట్టింగ్‌ పొదెం వీరయ్యను ఓడించారు స్థానికులు. తన అనుచరులు కొందరు దళితబంధులో లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు రావడంతో… తన సొంత డబ్బులతో లబ్దిదారులకు ఆ మొత్తాన్ని ఇప్పించారన్న పేరొచ్చినా కనికరించలేదు ఓటర్స్‌. అయితే ఈసారి భద్రాచలంలో బీఆర్‌ఎస్‌ తరపున గెలిచిన తెల్లం వెంకట్రావు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్‌లోకి దూకుదామా అన్నట్టు ఆత్రంగా చూశారట. అసలు బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపు పత్రం అందుకున్న మరుక్షణం నుంచి ఆయన మనసు కాంగ్రెస్‌వైపునకు లాగిందట. కారులో ఉండేందుకు ఒక్క క్షణం కూడా ఇష్టపడని తెల్లం వెంకట్రావును సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి పొంగులేటి. తెల్లంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళంతా నియోజకవర్గంలో ఒక గ్రూప్‌లా తయారయ్యారు. మరోవైపు ఇక్కడ ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు వర్గం ఉంది. దాదాపు ముప్పై ఏళ్ల నుంచి భద్రాచలం నియోజకవర్గంలో రాజకీయం చేస్తూ పట్టు సాధించారు బాలసాని. ప్రధానంగా భద్రాచలం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఆయనకు గట్టి పట్టుంది.

ఒకప్పుడు టీడీపీలో, తర్వాత బీఆర్‌ఎస్‌లో బాలసానికి మంచి క్యాడర్ బేస్‌ ఉండేది. తాజాగా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే ఇప్పుడు పాత కాంగ్రెస్ వర్గం అంతా పొదెం వీరయ్య చేతిలో ఉండగా… బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వాళ్ళు, పొంగులేటి వర్గం అంతా ఎంఎల్ఎ తెల్లం వెంకట్రావు వెంట ఉంది. అటు బాలసాని లక్ష్మీనారాయణ అనుచరగణం మరో వర్గంగా చెలామణి అవుతోంది. ఇలా ముగ్గురి చేతిలో మూడు వర్గాలుఉన్నాయి. ఏ ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో ఆ ఎఫెక్ట్‌ ఎంపీ అభ్యర్థి మీద ఎక్కడ పడుతుందా అన్న టెన్షన్‌ పెరుగుతోందట నేతల్లో. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉంది భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్‌. దీంతో ఈ మూడు వర్గాల ముచ్చట ఎక్కడ కొంప ముంచుతుందోనన్న కంగారు పెరుగుతోంది పార్టీ వర్గాల్లో. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరినా… తమ పట్టు జారి పోకుండా జాగ్రత్త పడుతున్నారట బీఆర్ఎస్ నేత తాతా మధు. తమ క్యాడర్ లో భరోసా నింపే ప్రయత్నంలో సీరియస్‌గా ఉన్నారాయన. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ గెలవడానికి తాతా మధు రోల్‌ కీలకం అన్న వాదన స్థానికంగా బలంగానే ఉంది. ఈ పరిస్థితిలో ఇక్కడ కాంగ్రెస్‌ ఉన్న వర్గపోరు ప్రభావం పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి బలరామ్ నాయక్ మీద పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో పరిస్థితిని గమనిస్తున్న నాయక్‌… గ్రూప్‌లు, లీడర్స్‌తో పెట్టుకోకుండా నేరుగా కేడర్‌తో డీల్‌ చేస్తున్నట్టు తెలిసింది. అయితే అదే టైంలో మరో డౌట్‌ వస్తోంది. నియోజకవర్గంలో కీలకమైన నాయకుల్ని కాదని కేడర్‌తో డైరెక్ట్‌గా పెట్టుకుంటే… వర్కౌట్‌ అవుతుందా? ఎంతమందిని అని ఆయన సమన్వయం చేసుకుపోగలరన్న ప్రశ్నలు ప్రస్తుతానికి ప్రశ్నలుగానే మిగిలి ఉన్నాయి. మొత్తంగా భద్రాచలంలోని మూడు గ్రూప్‌లు మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థిని ముప్పు తిప్పలు పెట్టబోతున్నాయన్నది పరిశీలకుల మాట. మరి దీన్ని బలరామ్‌ నాయక్‌ ఎలా డీల్‌ చేస్తారో చూడాలి.