బాలినేని శ్రీనివాసరెడ్డి… ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్ పొలిటీషియన్. నాడు వైఎస్ కేబినెట్‌లో, 2019 తర్వాత జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారాయన. ఎవరు అవునన్నా.. కాదన్నా.. నాడు మంత్రివర్గ విస్తరణలో జగన్ బాలినేనిని కేబినెట్ నుంచి తప్పించడంతోనే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని అంటారు. ఆ గ్యాప్ అంతకంతకూ పెరిగిపోయి…. చివరికి ఫ్యాన్ కింది నుంచి పక్కకు జరిగి గ్లాస్ పట్టుకున్నారు బాలినేని. అలా… ఆయన జనసేనలో చేరిపోయాక ప్రకాశం జిల్లా రాజకీయం ఒక్కసారిగా మారిపోతుందని భావించారు అంతా. వైసీపీలోని పలువురు కీలక నేతలు మాజీ మంత్రి వెంట నడుస్తారని అంచనా వేశారు. కానీ… ఆ అంచనాలు పూర్తిగా తల్లకిందులయ్యాయి. ఒంగోలు నగరానికి చెందిన 15 మంది వైసీపీ కార్పొరేటర్లు మాత్రమే కండువాలు మార్చారు. మిగతా వాళ్ళు ఎవ్వరూ పెద్దగా మారకపోవడంతో… శీనన్నమేజిక్ పనిచేయలేదా అన్న చర్చ జరుగుతోంది ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్‌లో. గతంలో కాంగ్రెస్‌కు, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటలాంటి జిల్లా ఉమ్మడి ప్రకాశం. కాంగ్రెస్, వైసీపీ… రెండు పార్టీల్లో కీ రోల్ ప్లే చేసిన బాలినేని ఒక దశలో ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించారు. జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఆయనకు అనుచరగణం ఉండేది. పలు నియోజకర్గాల్లో ఆయన చెప్పిన వారికే వైసీపీలో సీట్లిచ్చే పరిస్దితి ఉండేది. అలాంటి నాయకుడు జనసేనలోకి వెళ్లాక ఆయన వెంట పెద్దగా వలసలు లేకపోవడం ఆశ్చర్యంగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. అలా మాజీ మంత్రి వెంట అంతా క్యూ కట్టకుండా వైసీపీ అధిష్టానం తీసుకున్న చర్యలు కూడా పని చేసి ఉండవచ్చంటున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ శ్రేణులు జనసేన వైపునకు అడుగులు వేయకుండా ఆపగలిగినట్టు చెప్పుకొస్తున్నారు. వైసీపీ ఆవిర్బావం నుంచి జగన్ వెంటే ఉన్నారు బూచేపల్లి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్దల ఎన్నికల్లో ఆయన తల్లి బూచేపల్లి వెంకాయమ్మకు జడ్పీ ఛైర్‌పర్సన్ అవకాశం దక్కింది. ఇక గత ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసి గెలిచారు శివప్రసాదరెడ్డి. అలా మొదట్నుంచి పార్టీతో అనుబంధం, బలమైన రాజకీయ కుటుంబం కారణంగా బాలినేని వెళ్లిపోయాక జిల్లా పార్టీ పూర్తి బాధ్యతల్ని బూచేపల్లికి అప్పగించారట జగన్. ఒకరకంగా ఆయనకు కూడా అది పరీక్షా సమయంలో కావడంతో…రకరకాల మార్గాల్లో ప్రయత్నించి పార్టీ లీడర్స్, కేడర్ బాలినేని వెంట వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఒంగోలు సెగ్మెంట్‌తో పాటు పలు నియోజకవర్గాల్లోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ నుండి కదలకుండా కట్టడి చేయగలిగారని చెప్పుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. అయితే… ఇదే సమయంలో మరో చర్చ సైతం ఉంది. ఏదో కామ్‌గా ఉన్నారు కదా… అని బాలినేనిని తక్కువగా అంచనా వేయలేమని, ఆయన జనసేనలో కుదురుకున్నాక తన అసలు గేం మొదలు పెట్టవచ్చన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి ఒంగోలులో. ఇక ఆయనేం చేయలేరులే అని వైసీపీ లీడర్స్ లైట్ తీసుకుంటే… దెబ్బ తింటారన్న హెచ్చరికలు సైతం వస్తున్నాయట. దానికి బూచేపల్లి గేం ప్లాన్ ఏంటి.. జిల్లా వైసీపీలో
బూచేపల్లి బాలినేని స్థానాన్ని భర్తీ చేయగలరా? ప్రకాశం జిల్లా పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకోబోతున్నాయంటూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.
