NTV Telugu Site icon

Off The Record : వైసీపీ అధికారం కోల్పోగానే ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారు?

Amzad Bash Otr

Amzad Bash Otr

అధికారంలో ఉన్నప్పుడు హడావుడి అంతా ఆ నేతదే. జిల్లాలో పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసినా.. అదృష్టం మాత్రం ఆయననే వరించింది. కొందరికి మూడేళ్లకే పదవి పోయినా.. ఆ మంత్రికి మాత్రం ఫుల్‌టైమ్‌ లభించింది. అయినా ఏం లాభం..? పార్టీ అధికారం కోల్పోగానే.. ఆయన సైలెంట్‌ అయ్యారు. ఫ్రేమ్‌లో కనిపించకుండా సైడ్‌ అయిపోయారు. దీంతో కూటమి నేతలు.. అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. ఆయన మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆయన ఎవరు ?

2019 ఎన్నికల్లో కడప జిల్లాను క్లీన్‌ స్వీప్‌ చేసింది వైసీపీ. మొత్తం పదింటిలో ఏడు స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గం, రెండు స్థానాల్లో ఎస్సీ సామాజిక వర్గం, ఒక్క స్థానంలో మైనార్టీ వర్గానికి చెందిన నేతలు గెలుపొందారు. వారందరినీ కాదని మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన అంజద్ భాషాకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు జగన్‌. గత ప్రభుత్వ హయాంలో చాలామంది మంత్రులకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే మంత్రివర్గంలో స్థానం దక్కగా, కడప జిల్లాకు చెందిన అంజద్ భాషాకు మాత్రం ఐదు సంవత్సరాలపాటు మంత్రివర్గంలో స్థానం దక్కింది. గత ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా ఆయన జిల్లాలో చక్రం తిప్పారు. గత ఎన్నికల్లో మాధవిపై ఓటమిపాలుకావడంతో కనుమరుగైపోయారు.

కడప మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు అత్యధికంగా గెలుపొందారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా ఒంటెద్దు పోకడలు నచ్చక చాలామంది కార్పొరేటర్లు అలకపాన్పు ఎక్కారట. మరికొందరు ఇతర పార్టీలలో చేరడానికి పావులు కదుపుతున్నారట. ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేసిన సమయంలో ఓ సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారి పట్ల చిన్నచూపు చూడడం వల్ల క్రింది స్థాయి కేడర్ ఆయనపై గుర్రుగా ఉందట. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ డిప్యూటీ సీఎం.. క్యాడర్ కు అందుబాటులో లేకుండా పోయారట. అధికారంలో ఉన్నప్పుడు బిజీ బిజీగా ఎక్కడ చూసినా ఆయనే కనపడేవారు. మైనార్టీ సామాజిక వర్గంలో కూడా మాజీ డిప్యూటీ సీఎం పై అసంతృప్తి ఎక్కువగా ఉందట. ఆయన సామాజిక వర్గానికి చెందిన దాదాపు 9 మంది కార్పొరేటర్లు ఆయనపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ఎన్నికలకు ముందు కడప నియోజకవర్గంలో అభివృద్ధిపై ప్రతిపక్షాలకు సవాళ్లు విసిరిన ఆయన.. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. ఆయన సవాళ్లను.. ఛాలెంజ్‌గా తీసుకున్న టిడిపి ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై కూపి లాగుతున్నారట. కడప కార్పొరేషన్ లో మొత్తం 50 స్థానాలలో ఒక్క స్థానంలో మాత్రమే టిడిపి గెలుపొందింది. ప్రస్తుత ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే.. మున్సిపల్ కార్పొరేషన్ రెజిల్యూషన్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నేతలు కొందరు కార్పొరేటర్లకు గాలం వేస్తున్నారట. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష పై అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్ లను తమవైపు తిప్పుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. వైసీపీ క్యాడర్ లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎన్డీఏ కూటమి ఎత్తుకు పైఎత్తులు వేస్తోందట. దాదాపు 22 మంది కార్పొరేటర్లు ఎన్డీఏ వైపు చూస్తున్నారట. ఇంత జరుగుతున్నా.. మాజీ డిప్యూటీ సీఎం అటువైపుగా దృష్టి సారించకపోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా వైసీపీ అధిష్టానం.. దీనిపై దృష్టి పెట్టాలని ఆ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. అసంతృప్తిగా ఉన్న క్యాడర్‌ను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఏ మాత్రం సఫలీకృతం అవుతుందో వేచి చూడాలి.