NTV Telugu Site icon

RED BOOK Effect?: వైసీపీని షేక్ చేస్తున్న ‘ఇతరులు’ అనే పదం.. ఆదర్స్ అంటే అదిరిపోతున్నారా?

Yco Otr

Yco Otr

అదర్స్….. ఇతరులు… భాష ఏదైనా దాని భావం మాత్రం ఒక్కటే. ఆ పదమే ఇప్పుడు వైసీపీని షేక్‌ చేస్తోందట. ఏపీ పాలిటిక్స్‌లో దాని చుట్టూనే పెద్ద చర్చ జరుగుతోందంటున్నారు. కొందరు ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలైతే… అదర్స్‌ అన్న పదం చెవినపడితే చాలు… నిద్రలో నుంచి సైతం ఉలిక్కిపడి లేచి కూర్చుంటున్నారట. ఇంతకీ అంత పవర్‌ ఏముందా పదంలో. దాని గురించి వింటే వైసీపీ నాయకులకు ఉలికిపాటు ఎందుకు? క్షేత్ర స్థాయిలో కొత్త పుంతలు తొక్కుతోంది ఏపీ రాజకీయం. రెడ్ బుక్ పేరుతో టీడీపీ నేతలు తమను నిత్యం వేధిస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు వైసీపీ నాయకులు. శాంతి భద్రతలకు విఘాతం పేరుతో ఢిల్లీ వెళ్లి మరీ ధర్నా చేసివచ్చారు. ఈ క్రమంలో క్షేత్ర స్థాయిలో కేసులు,గొడవలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రతిపక్ష నేతల మీద పెడుతున్న కేసుల సంఖ్య తక్కువగానే ఉందన్నది కొందరి అభిప్రాయం. అయినా.. కొన్నిటి విషయంలో మాత్రం గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీ నేతల మీద పెడుతున్న కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లలో కొందరి పేర్లు ప్రస్తావిస్తున్నారు. వాళ్ళకు అదనంగా… ఇతరులు, అదర్స్ అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఇంకొందరు కూడా ఆ కేసులో ఉన్నారని అర్ధం వచ్చేలా రాస్తున్నారు పోలీసులు. ఇప్పుడా అదర్స్ అనే పదం చుట్టూనే ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది. ఆదర్స్ జాబితాలో తమను కలపొద్దని, తమ పేర్లుఎక్కించవద్దని కింది స్థాయిలో పెద్ద పెద్ద పైరవీలే చేస్తున్నారట ప్రతిపక్ష నాయకులు. అదర్స్ పేరుతో తమపై ఎక్కడ కేసులు నమోదు చేస్తారోనని కొన్ని నియోజకవర్గాల్లోని వైసీపీ నాయకులు బిక్కు బిక్కుమంటున్నట్టు తెలుస్తోంది. ఆ ఇతరుల్లో తాము లేకుండా చూడాలంటూ… అటు అధికార పక్ష నాయకులతో పాటు ఇటు పోలీసులను వేడుకుంటున్నారట కొందరు వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు. ఇతరుల జాబితా ఎంత ఘోరంగా ఉంటుందో.. దాని వల్ల వచ్చే ఇబ్బందులేంటో తెలుసు కనుకే చాలా మంది వైసీపీ నేతలు అలా… అదర్స్ అంటే అదిరిపోతున్నారట.

 

ఇంతకు ముందు తాము అధికారంలో ఉన్నప్పుడు అదర్స్ అనే క్లాజ్‌ పెట్టి.. అందులో తమకు రాజకీయంగా అడ్డం వస్తారని భావించిన టీడీపీ నేతలను.. తమకు వ్యతిరేకంగా వ్యవహరించే సామాన్యులను కూడా ఇబ్బందులు పెట్టిన సంగతిని గుర్తు చేసుకుని వణుకుతున్నారట. వైసీపీ పవర్‌లో ఉన్నప్పుడు ఏదో ఒక సాకు చూపి.. లేని పోని అంశాలు తెర మీదకు తెచ్చి.. ఆ ఆదర్స్ జాబితాలో పెట్టేసి చాలా మందిని జైళ్లకు పంపారన్న ఆరోపణలు వచ్చాయి. ఇలా అదర్స్ ఎఫెక్ట్ చాలా మంది టీడీపీ నేతల మీద.. అది కూడా ఆ సంఘటనలు జరిగినప్పుడు ఆ ఛాయల్లో లేని వారి మీద కూడా పడింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లు ఘటనలో అదర్స్ పేరుతో పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లోని చాలా మంది టీడీపీ కార్యకర్తలను, ప్రభావం చూపే నేతలను జైళ్లకు తరలించారన్న ఆరోపణలున్నాయి. ఒక్క అంగళ్లు ఘటనలోనే కాకుండా.. చాలా చోట్ల అప్పట్లో అదర్స్ పేరుతో టీడీపీ నేతలు జైళ్లకు వెళ్లారు. అప్పట్లో ఈ పదం గురించి పెద్ద చర్చే జరిగింది. ఇతరుల పేరుతో తెలుగుదేశం నేతలను ఇబ్బందులు పెడుతున్నారని.. నాడు చంద్రబాబే స్వయంగా విమర్శలు చేసిన పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇలా టీడీపీ గెలుస్తుందని.. వైసీపీ ఏకంగా 11 స్థానాలకు పడిపోతుందని ఊహించని వైసీపీ నేతలు ఎవరైతే ఆ రోజుల్లో చెలరేగిపోయారో.. ఇప్పుడు వాళ్ళే ముందుగా అలర్ట్‌ అవుతున్నట్టు తెలిసింది. కొన్నాళ్ల పాటు సైలెంట్ అయిపోవడమో.. లేక బాబ్బాబూ మమ్మల్ని వదిలేయమని బతిమాలుకోవడమో చేస్తున్నారట క్షేత్ర స్థాయిలోని కొందరు వైసీపీ నేతలు. దీంతో ఇప్పుడు చాలా చోట్ల అదర్స్ పాలిటిక్స్ అదిరిపోతున్నాయట.