Site icon NTV Telugu

Off The Record : కాంగ్రెస్‌లో కీచులాటలు కామన్.. అది ఎంతటివారికైనా..!

Congress Otr

Congress Otr

తెలంగాణ కాంగ్రెస్‌లో ఏక్‌ నిరంజన్‌ తయారయ్యారా? అంతా తానై నడపాలనుకుంటున్నారా? ఢిల్లీ స్థాయిలో నా పరపతి అరచేతి మందాన ఉంది. మిగతా వాళ్ళని లెక్కచేయాల్సిన అవసరం ఏంటని అనుకుంటున్నారా? తనలాగే వచ్చిన వారిని కావాలని పక్కకు పెడుతున్నారా? ఇంతకీ ఎవరా నేత? ఎందుకలా ప్రవర్తిస్తున్నారు?

 

సమన్వయ లోపం, పరస్పరం గోతులు తీసుకోవడం, కలహించుకోవడమన్నది కాంగ్రెస్‌ పార్టీలో కామన్‌. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గనుక మా పార్టీలో అలాగే ఉంటుంది. అదే మాకు బలం అని కూడా అంటుంటారు సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్స్‌. డీఎన్‌ఏ సేమ్‌ కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కూడా అందుకు అతీతం ఏమీకాదు. అయితే.. ఇన్నాళ్ళు ఈ సమన్వయ లోపం పదవుల కోసం పోటీపడే రాష్ట్ర నాయకుల మధ్య మాత్రమే ఉండేది. కానీ…ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోందని పార్టీ వర్గాలే అంటున్నాయి. రాష్ట్ర నేతల మధ్య పోరు ఓకేగానీ… పర్యవేక్షణకోసం వచ్చిన ఏఐసీసీ పెద్దలు కూడా అలాగే కీచులాడుకోవడం కొత్తగా ఉందంటున్నారు రాష్ట్ర నేతలు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీకి, ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు మధ్య సమన్వయ లోపం ఉన్నట్టు చెబుతున్నాయి గాంధీభవన్‌ వర్గాలు. ఇన్ఛార్జ్‌గా దీపాదాస్‌ అంతా తానై నడపాలని భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. మిగిలిన ముగ్గురు కార్యదర్శులను ఆమె పరిగణనలోకి తీసుకోవడం లేదన్న గుసగుసలు గాంధీభవన్లో వినిపిస్తున్నాయి. సోనియాగాంధీకి సన్నిహితురాలిగా దీపాదాస్‌కు పేరుంది. ఆ సాన్నిహిత్యంతో ఆమె సోలో రోల్‌ పోషించాలనుకుంటున్నారన్న మాటలు కాంగ్రెస్‌ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీని సమన్వయం చేయడం కోసం కార్యదర్శులుగా విష్ణునాథ్‌, మన్సూర్ అలీ ఖాన్, రోహిత్ చౌదరి ఉన్నారు. ఈ ముగ్గురు అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఎన్నికలు ముగియగానే… అప్పటివరకు పనిచేసిన థాక్రేని పార్టీ గోవాకు బదిలీ చేసింది ఏఐసీసీ. ఆ స్థానంలో బాధ్యతలు చేపట్టారు దీపాదాస్. కానీ… ఇన్ఛార్జ్‌గా ఆమె మిగిలిన ముగ్గురు కార్యదర్శులని కలుపుకొని పోవడం లేదనేది ప్రధానమైన చర్చ.

 

ఇటీవల ఓ కార్యదర్శిని ఉద్దేశించి… మీరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్టు తెలిసింది ఆ పని మీద దృష్టి పెట్టండని అన్నట్టు తెలిసింది. అంటే ఇన్‌డైరెక్ట్‌గా నీ పని నువ్వు చూసుకో అన్నట్టేకదా అన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇక మరో ఏఐసీసీ కార్యదర్శి గతంలో పనిచేసిన ఇంచార్జికి చాలా సన్నిహితంగా ఉండేవారట. అందుకే ఆయనకు థాక్రే మనిషిగా ముద్ర వేసి పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలపై మొదట్లో గ్రేటర్ హైదరాబాదులోని ముగ్గురు డిసిసి అధ్యక్షుల సమక్షంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఇన్చార్జ్‌ దీపాదాస్‌. ఆ సమావేశానికి సంబంధించిన సమాచారం ఆయా ఇన్చార్జి కార్యదర్శులకు చెప్పనేలేదట. ఇక ప్రభుత్వం తాజాగా ఆరు గ్యారంటీల్లో భాగంగా మరో రెండు పథకాలను అమలులోకి తెచ్చింది. అందులో భాగంగా చేవెళ్లలో నిర్వహించిన సభకి హాజరయ్యారు దీపాదాస్‌. కానీ చేవెళ్ల నియోజకవర్గాన్ని చూసే ఏఐసీసీ కార్యదర్శి మాత్రం మీటింగ్‌కు వెళ్ళలేదు. మరో ఇద్దరు కార్యదర్శులు కూడా దూరంగా ఉన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఎక్కడ జరిగినా గతంలో ఇన్చార్జ్‌తో పాటు ఏఐసీసీ కార్యదర్శులు కూడా హాజరవడం ఆనవాయితీగా ఉంది. కానీ… చేవెళ్ల సభకు కేవలం ఇన్చార్జి మాత్రమే హాజరవడం వాళ్ళ మధ్య ఉన్న అంతరాన్ని తెలియజెపుతోందంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. పార్టీలో సమన్వయ లోపం సహజమే అయినా… అది ఇన్నాళ్ళు రాష్ట్ర నేతల మధ్య మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏఐసీసీ నుంచి వచ్చిన నలుగురు నాలుగు దిక్కులుగా ఉండటంతో ఇది ఎట్నుంచి ఎటు పోతుందో… చివరికి ఎవరు బలవుతారోనన్న ఆందోళన పెరుగుతోందట పార్టీ వర్గాల్లో. అంటే… ఇన్ఛార్జ్‌ జీపాదాస్‌ అంతా నేనేనని చెప్పాలనుకుంటున్నారా? లేదంటే మిగిలిన వాళ్ళంటే అసలు లెక్కే లేదా అన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ సర్కిల్స్‌లో.

 

Exit mobile version