Site icon NTV Telugu

Off The Record : సీట్లు మావే ఓట్లు మావే అని తొడలు కొట్టిన TDP నేతలకు హైకమాండ్ షాక్ ఇచ్చిందా?

Tdp Otr

Tdp Otr

సీటూ మాదే… ఓటు వేటా మాదేనంటూ ఇన్నాళ్ళుగా తొడలు కొట్టుకుంటూ తిరిగిన ఆ సీనియర్స్‌కి ఇప్పుడు సీట్లు చిరిగిపోతున్నాయా? కష్ట కాలంలో, క్లిష్ట సమయాల్లో సైతం గెల్చిన నేతలు ఇప్పుడు టీడీపీకి ఎందుకు కానివారయ్యారు? ఉమ్మడి వెస్ట్‌లో సూపర్‌ సీనియర్స్‌ అనుకున్నవారిని సైతం ఫస్ట్‌ లిస్ట్‌లో పార్టీ అధిష్టానం ఎందుకు పక్కన పెట్టింది? ఎవరా నేతకు? ఎందుకలా జరిగింది? ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్స్‌కి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. తమ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా తగులుతున్న ఎదురు దెబ్బలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధికారంలో ఉన్నంతకాలం, తమ హవా నడిచినన్ని రోజులు ఎదురే లేదన్నట్టుగా చెలరేగి భవిష్యత్తు ఆలోచన లేకుండా వ్యవహరించిన నాయకులు ఇప్పుడు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందంటున్నారు పరిశీలకులు. మాట చెల్లుబాటయినన్ని రోజులు.. వర్గపోరు, నోటి దురుసుతో అవతలి వాళ్ళని కట్టడి చేసిన సీనియర్స్‌ ఇప్పుడు తామే అవకాశాల కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొందంటున్నారు. పేరుకు సీనియర్స్‌ అయినా… రెండు సార్లు గెలిచిన అనుభవం ఉన్నా… ఈసారి టిక్కెట్‌ గ్యారంటీ లేక త్రిశంకు స్వర్గంలో ఉన్నారు వెస్ట్‌ టీడీపీ సీనియర్స్‌. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారి పేర్లు సైతం ఇప్పుడు బ్రాకెట్‌లో పడటంపైనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ , నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఉండి మాజీ శాసనసభ్యుడు కలవపూడి శివ, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అంటున్నా… పార్టీ అధిష్టానం నుంచి మాత్రం క్లియరెన్స్‌ రాలేదు. ఫస్ట్‌ లిస్ట్‌లో పేర్లు లేవు సరే…. వచ్చే జాబితాలోనైనా ఉంటాయా అంటే… అది కూడా డౌటేనన్న సమాధానమే వినిపిస్తోంది. ఇలా… సీనియర్స్‌ని ఒక్కసారిగా పక్కన పెట్టడానికి జనసేనతో పొత్తు ఒక కారణమైతే.. ఎలాంటి షరతులు లేకుండా పోటీ చేస్తానంటేనే అవకాశం అని అధినేత ఆంక్షలు విధించడం మరో రీజన్‌ అట. జనసేనతో పొత్తు కారణంగా అధికారంలోకి వస్తే ఆ పార్టీకి కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది.

 

అందుకే టీడీపీ అధిష్టానం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే సీనియర్స్‌ అయిన తెలుగుదేశం నేతలు ఈసారి పవర్‌లోకి వస్తే మంత్రి పదవులు గ్యారంటీ అంటూ ఆశలు పెంచుకుంటున్నారట. ఇటు వాళ్ళు ఆశలు పెంచుకుని, అటు జనసేనకు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ముందు ముందు సమస్యలు తీవ్రమవుతాయని, అందుకే టీడీపీ అధిష్టానం తమ పార్టీ సీనియర్స్‌కి అన్‌కండిషనల్‌ అన్న క్లాజ్‌ పెడుతున్నట్టు తెలిసింది. తొలి జాబితాలో వారి పేర్లు లేకపోవడానికి అదే కారణం అంటున్నారు. లిస్ట్‌లో పక్కన పెట్టి… మంత్రి పదవి సంగతి తర్వాత.. ముందు పోటీకి అవకాశం ఇవ్వండని వారంతట వారు దారిలోకి వచ్చేలా చేయాలన్నది టీడీపీ పెద్దల ఆలోచనగా తెలిసింది. ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివకు టికెట్ నిరాకరించడం, దెందులూరు మాజీ ఎమ్మెల్యే పేరు ఇంకా ప్రకటించకపోవడం, నిడదవోలు టిక్కెట్‌ను జనసేనకు ఇచ్చే ప్రయత్నం చేయడం, మాజీ మంత్రి పీతల సుజాతను పక్కన పెట్టడంలాంటివన్నీ ఇందులో భాగమేనన్నది పార్టీ వర్గాల టాక్‌. ఈ నలుగురు నేతలు కష్టకాలంలో ఉన్నప్పుడు గెలిచిన వారే అయినా ..వీరి వల్ల పార్టీకి కష్టాలు రాకూడదనుకుంటున్నారో ఏమో… ప్రస్తుతానికైతే పక్కనపెట్టినట్టుగానే కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. వారంతట వారు దారిలోకి వచ్చి ఎలాంటి షరతులు లేకుండా ముందుకు సాగుతామని చెబితే అవకాశాలు ఉండొచ్చన్నది ఇంటర్నల్‌ టాక్‌. ఉన్న అవకాశాలకంటే ఎక్కువ ఊహించుకోవడం, ఛాన్స్‌ ఇచ్చాక సరైన స్థాయి దక్కలేదని సణగడం లాంటి సమస్యలన్నీ సీనియర్స్‌తో ఉంటాయని, అందుకే ముందు తప్పించడమో, మీ పరిధి ఇంతవరకేనని చెప్పడమో చేస్తే క్లియర్‌గా ఉంటుందన్న భావనలో టీడీపీ పెద్దలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సెకండ్‌ లిస్ట్‌లో వీళ్ళలో ఎవరెవరి పేర్లు ఉంటాయో చూడాలి మరి.

Exit mobile version