NTV Telugu Site icon

Off The Record : టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి వైసీపీ చెక్ పెట్టనుందా..?

Tdp Sikkolu

Tdp Sikkolu

సిక్కోలు రాజకీయం చిత్రంగా మారబోతోందా? లోక్‌సభ నియోజకవర్గంలో కులమే బలంగా వైసీపీ పావులు కదుపుతోందా? టీడీపీకి చెందిన గట్టి అభ్యర్థి రామ్మోహన్‌ నాయుడుని ఢీకొట్టడానికి అధికార పార్టీ వేస్తున్న కొత్త స్కెచ్‌ ఏంటి? బరిలో దిగబోతున్న ఆ తురుపు ముక్క ఎవరు? లెట్స్‌ వాచ్‌..

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన కుటుంబానికో స్థానం ఉంది. మొదట్నుంచి టీడీపీకి వ్యతిరేకంగా ఉందీ ఫ్యామిలీ. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్‌ వెంట నడిచారు ధర్మాన కృష్ణదాస్‌. ఆ క్రమంలోనే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కూడా దక్కింది. తర్వాత మంత్రివర్గం నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించింది నాయకత్వం. ఇక్కడ టీడీపీ తరపున సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అత్యధిక అసెంబ్లీ సీట్లను గెల్చుకున్నా… ఎంపీ సీటు దక్కించుకోలేకపోయింది వైసీపీ. అందుకే హ్యాట్రిక్‌ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న రామ్మోహన్‌ నాయుడికి ఈసారి ఎలాగైనా చెక్‌ పెట్టాలన్న లక్ష్యంతో కృష్ణదాస్‌ వైపు చూస్తోందట అధికార పార్టీ నాయకత్వం.

టెక్కలిలో అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో రామ్మెహన్ నాయుడిని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలగా ఉందట వైసీపీ అగ్ర నాయకత్వం. ఇప్పటికే టెక్కలి అసెంబ్లీ అభ్యర్దిని ఖరారు చేసేసింది. ఎంపిగా దీటైన అభ్యర్థి కోసం వెదుకుతున్న క్రమంలో ఫోకస్‌ అంతా కృష్ణదాస్‌ మీదే ఉన్నట్టు తెలిసింది. కింజరాపు కోటను బద్దలు కొట్టాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన ధర్మాన ఫ్యామిలీలో ఒకరిని బరిలో దించాలని అనుకుంటోందట అధికార పార్టీ నాయకత్వం. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరాపుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుచరగణానికి సామాజిక సమీకరణలు తోడవుతాయని భావిస్తోందట పార్టీ అధిష్టానం.

నియోజకవర్గం నుంచి తెప్పించుకున్న నివేదికలు కూడా నరసన్నపేట ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ అయితేనే రామ్మోహన్‌ నాయుడిని గట్టిగా ఎదుర్కోగలమని తేల్చేశాయట. ఇంకా ప్రకటించకున్నా.. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు దాదాపు ఖాయమైనట్టేనంటున్నారు. అయితే ఇక్కడే కృష్ణదాస్‌ ఇంకో మెలిక పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. తాను శ్రీకాకుళం వెళితే… నరసన్నపేటలో తన కుటుంబానికి చెందిన వ్యక్తికే అసెంబ్లీ టిక్కెట్‌ ఇవ్వాలని అడిగినట్టు తెలిసింది. పార్టీ నాయకత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదట. మొత్తంగా చూస్తే…ఇన్నాళ్ళు కింజరాపు ఫ్యామిలీకి బలంగా ఉన్న కులం ఓట్లను చీల్చాలని ప్లాన్‌ చేసిందట వైసిపీ. దాని ద్వారా ఇన్నాళ్ళు జరుగుతున్న క్రాస్‌ ఓటింగ్‌ని అడ్డుకోవచ్చని, రామ్మోహన్‌ నాయుడిని గట్టిగా ఢీ కొట్టవచ్చని భావిస్తోందట. శ్రీకాకుళం, నరసన్నపేటలతో పాటు వివిధ నియోజకవర్గాల్లో బలంగా ఉన్న వెలమలు తమకు అండగా నిలబడితే గెలుపు అవకాశాలు పెరుగుతాయని లెక్కలేసుకుంటోందట వైసీపీ నాయకత్వం. ఎన్నికల సీజన్‌లో సిక్కోలు సిత్రాలు ఎలా మారిపోతాయో చూడాలి.