ఆ మంత్రి చేతికి ఉన్న పచ్చబొట్టు కథేంటి? దాని చుట్టూ రాజకీయ వివాదాలు ఎందుకు ముసురుకుంటున్నాయి? పొలిటికల్ ప్రత్యర్థుల వెటకారాలకు ఆ పచ్చబొట్టే ఎందుకు కారణమవుతోంది? ఇంతకీ మంత్రి చేతి మీద ఏమని ఉంది? దాని గురించి వినిపిస్తున్న గుసగుసలేంటి?
మినిస్టర్ సత్యవతి రాథోడ్. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న నాయకురాలు. సర్పంచ్ స్థాయి నుంచి తెలంగాణ మంత్రిగా ఎదిగారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక విచిత్రమైన వ్యవహారంతో టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్ అయ్యారు. సీఎం కేసీఆర్ మీద భక్తో, అభిమానమో గానీ… ఆయన బాగుండాలని కోరుకుంటూ.. ప్లస్ ఆయన దృష్టితో పడేందుకు మంత్రి చేస్తున్న పనులే అందుకు కారణమట. అదంతా నిజంగానే అభిమానమా లేక రాజకీయ అవసరాల కోసం చేస్తున్న విన్యాసాలా అని గులాబీ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారట.
తెలంగాణ ఉద్యమ సమయంలో మారిన పరిణామాలతో రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు సత్యవతి రాథోడ్. అప్పుడు కేసీఆర్ మద్దతుతో తిరిగి పుంజుకున్నారామె. ఎమ్మెల్సీని చేయడం, కేబినెట్‌లో బెర్త్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఆ క్రమంలోనే సీఎం మీద అభిమానం పెరిగిపోయి ఎవ్వరూ ఊహించని విధంగా స్వామి భక్తి చాటుకున్నారట మంత్రి. ఈసారి ఎన్నికల్లో తిరిగి బీఆర్‌ఎస్ గెలిచి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే వరకు తాను కాళ్ళకు చెప్పులు వేసుకోబోనని మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రతిజ్ఞ చేశారట సత్యవతి. అన్నట్టుగానే అప్పటి నుంచి కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతున్నారామె.
ఆ వ్యవహారం అలా కొనసాగుతుండగానే…. ఇప్పుడు మరో రూపంలో ఇంకోసారి సీఎం మీద అభిమానాన్ని చాటుకున్నారు మినిస్టర్. కేసీఆర్ పేరును తన చేతికి పచ్చబొట్టుగా వేయించుకున్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బంజారాభవన్‌లో నిర్వహించిన గిరిజన సంస్కృతి వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అక్కడ ఆదివాసీలు ఏర్పాటు చేసిన స్టాల్‌లో ఈ పచ్చబొట్టు పొడిపించుకున్నారట మంత్రి.
అయితే… మంత్రి చర్యలు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశం అయ్యాయి. ఆమె నిజంగానే అభిమానంతో ఇవన్నీ చేస్తున్నారా? రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ దృష్టిలో పడేందుకు ఇలా పాట్లు పడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. చెప్పులు లేకుండా తిరగడాన్ని అభిమానం అనుకున్నా… పచ్చబొట్టు పొడిపించుకోవడం, మళ్ళీ దాన్ని ప్రచారం చేసుకోవడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకురాలైన సత్యవతి రాథోడ్ పట్టు నిలుపుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూ తనదైన మార్కు ప్రదర్శిస్తారన్న ప్రచారం ఉంది. సీఎం దృష్టిలో ఉండేందుకే ఆమె ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టేశారు. కేసీఆర్ కోసం చెప్పులు వేసుకోవడం మానేసిన విషయాన్ని అందరూ మర్చిపోవడంతో ఇప్పుడు పచ్చబొట్టుతో మళ్ళీ ప్రచారంలోకి వచ్చారని అంటున్నారు. ఈసారి డోర్నకల్ నుంచి కానీ, మహబూబాబాద్ నుంచిగాని ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారట సత్యవతి రాథోడ్ . ఈ పాట్లన్నీ అందుకేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. డోర్నకల్ టికెట్ విషయంలో రెడ్యా నాయక్ కుటుంబంతో తీవ్ర పోటీ ఉంది. మహబూబాబాద్ టికెట్ రేసులో కూడా శంకర్ నాయక్..కవిత మధ్య పోటీ ఉంది. అందుకే తనకు లైన్ క్లియర్ చేసుకునే క్రమంలో రకరకాల ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు మంత్రి రాజకీయ ప్రత్యర్థులు.
