NTV Telugu Site icon

Off The Record: జనసేన వైపు రాపాక వరప్రసాద్ అడుగులు..?

Otr Rapaka

Otr Rapaka

Off The Record: వైసీపీలో ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే తిరిగి సొంత గూటికి చేరబోతున్నారా? వెళ్ళాలి… వెళ్ళిపోవాలంటూ… మనసు తెగ లాగేస్తోందా? ఎప్పుడెప్పుడు గ్లాస్‌ పట్టుకుందామా అని ఆయన ఆత్రంగా ఎదురు చూస్తున్నా… గతం వెంటాడుతోందా? నాయకత్వం సంగతి తర్వాత ముందు జనసైనికులే అడ్డుకుంటారన్న భయం ఉందా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటాయన మనసు లాగుడు మేటర్‌?

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాపాక వరప్రసాదరావు రాజకీయ భవిష్యత్తు కొత్త టర్న్‌ తీసుకోబోతోందా అంటే… అవుననే అంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు. వైసీపీ అమలాపురం పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న రాపాక త్వరలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో… ఆయన తదుపరి అడుగులు ఎటువైపు పడుతున్నాయన్న చర్చ మొదలైంది.కొన్ని అనివార్య పరిస్థితుల్లో… గతంలో జనసేన నుంచి వైసీపీలో చేరాల్సి వచ్చిందని, ఇష్టం లేకపోయినా ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చిందని అంటున్నారట ఆయన. దీంతో రాపాక తిరిగి సొంత గూటికి చేరతారన్న ప్రచారం జరుగుతోంది. మలికిపురంలో ఇటీవల జనసేన నిర్వహించిన ఓ సమావేశానికి రాపాక వరప్రసాదరావు హాజరవడంతో జన సైనికులు షాకైనట్టు తెలిసింది. 2019లో జనసేన ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన వరప్రసాదరావు…. తర్వాత వైసీపీ గూటికి చేరారు. అక్కడ ఏ మాత్రం గుర్తింపు లభించలేదన్న ఆవేదన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం లాంటి కారణాలతో మళ్లీ జనసేన లోకి లైన్‌ క్లియర్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే…రాపాక వ్యవహారం రాజోలు జనసేనలో చిచ్చు రేపిందట. మలికిపురం సమావేశంలో ప్రత్యక్షమైన మాజీ ఎమ్మెల్యే… ప్రస్తుత ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తో మాట్లాడి వెళ్లిపోయారు. ఆ వీడియోను షేర్‌ చేస్తూ… ఏంటి విశేషం అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారట జన సైనికులు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ని ఘాటుగా విమర్శించిన రాపాక ఇప్పుడు జనసేనలోకి ఎలా వస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయన చేసిన పనికి రాజోలు జనసైనికులు పార్టీలోకి ఆహ్వానిస్తారా ? అడ్డుపడతారా? అన్న చర్చ సైతం జరుగుతోందట రాజకీయ వర్గాల్లో. 2019లో జనసేన నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీలోకి జంప్‌ అయినా,…. ఇటీవలి ఎన్నికల్లో ఆయనకు రాజోలు అసెంబ్లీ టికెట్ దక్కలేదు.‌

అమలాపురం పార్లమెంటు సీట్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారాయన. ఆ తర్వాత నుండి వైసీపీలో యాక్టివ్ గా లేరు. వైసిపి కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ను నియమించాక పార్టీతో రాపాకకు దూరం మరింత పెరిగిందట. ఈ పరిస్థితుల్లోనే ఆయన పార్టీ మారిపోతారన్న ప్రచారం జోరుగా మొదలైందంటున్నారు. పార్టీ మారిపోవాలని మాజీ ఎమ్మెల్యే మానసికంగా సిద్ధమైనా…జనసేన శ్రేణులు అభ్యంతరం చెబుతారన్న భయం ఆయన్ని వెంటాడుతోందట. పెట్టే బేడా సర్దుకుని రెడీగా ఉన్నారని, గ్లాస్‌ పార్టీ అధిష్టానం జస్ట్‌ ఓకే చెబితే ఎగిరి దూకడానికి రెడీగా ఉన్నారన్నది రాజోలు టాక్‌. గతంలో పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసినప్పుడల్లా రాపాకపై జన సైనికులు మండిపడేవారు. సోషల్ మీడియాలో ఆటాడేసుకునేవారు. కానీ… ఆయన పవన్ను విమర్శించారేగానీ… స్థానికంగా ఉన్న జనసైనికుల్ని ఏమీ అనలేదు.నన్ను గెలిపించింది జన సైనికులేనని, నన్ను తిట్టే అధికారం వారికే ఉందని చెప్పుకునేవారు. ఆ ఒక్క రీజనే ఇప్పుడాయనకు ప్లస్‌ అయితే కావచ్చంటున్నారు పరిశీలకులు. మొత్తం మీద రాపాక వరప్రసాద్‌ జనసేనలోకి మారడం ఖాయమని అంటున్నా… అట్నుంచి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

 

Show comments